Jagga Reddy: ఆ మాజీ ఎమ్మేల్యే నైజం వేరు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడంలో ఆ నేతకు లేరు సాటి. కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉంటూ.. ప్రభుత్వంపై విమర్శల జోరు సాగే సమయంలో ఘాటుగా కామెంట్స్ చేయడం ఆ నేత నైజం. తాజాగా ఆ నేత చేసిన కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఇంతలా ఘాటుగా కామెంట్స్ చేసిన ఆ నేత ఎవరంటే.. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.
ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మేల్యేలు రహస్య భేటీ అయ్యారన్న వార్తలపై జగ్గారెడ్డి తనదైన స్టైల్ లో స్పందించారు. సోమవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో జగ్గారెడ్డి చిట్ చాట్ గా మాట్లాడారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నికల సమయంలో మాజీ సీఎం కేసీఆర్ ను గద్దె దించాలని రాష్ట్ర ప్రజలు భావించారని, అదే సమయంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజల వాణి వినిపించిందన్నారు. ఎన్నికలకు ముందే పార్టీ నేతలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ మేరకు ఇండికేషన్ ఇచ్చిందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో.. లీడర్ షిప్ సమస్య రావడంతో, పక్క పార్టీల నుండి ఎమ్మెల్యేలను కేసీఆర్ ఆహ్వానించారని నాటి రోజుల గురించి జగ్గారెడ్డి వివరించారు. అందుకే కేసీఆర్ ను దారుణంగా తిట్టిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సైతం పార్టీలోకి నాడు చేర్చుకున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. బలహీనంగా ఉన్నట్లు భావించారు కాబట్టే.. నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకున్నారని జగ్గారెడ్డి విమర్శించారు. 2018 ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలోకి నేటి సీఎం రేవంత్ రెడ్డి చేరారని ఆ విషయాన్ని ముందుగా అందరూ గమనించాలన్నారు. ప్రతి చిన్న విషయాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా పెద్దదిగా చూపిస్తూ.. ఫేక్ ప్రచారాలు సాగిస్తుందన్నారు.
ఇక ఇటీవల ఎమ్మెల్యేల రహస్య భేటీ అంటూ వచ్చిన వార్తలపై జగ్గారెడ్డి స్పందిస్తూ.. తాను సమయం, సందర్భం వచ్చినప్పుడు ఆ భేటీ పై స్పందిస్తానన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏ రాష్ట్రంలోనైనా.. మంత్రులకు వారి శాఖలపై స్వతంత్రం ఉంటుందని, ముఖ్యమైన విషయమైతేనే సీఎంలు జోక్యం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఫ్రీడమ్ ఇవ్వాలని ఉద్దేశంతోనే మంత్రులకు పూర్తి స్వేచ్ఛ కల్పించారని, ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న ఇబ్బందులు సర్వసాధారణమేనని అంటూ జగ్గారెడ్డి కొట్టి పారేశారు. తాను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, పార్టీకి సలహాలు ఇచ్చే ప్రోటోకాల్ పరిధిలో లేనని జగ్గారెడ్డి అన్నారు.
Also Read: Bank Loans: రూ. 5 లక్షల లోన్ కావాలా.. తక్కువ వడ్డీతో ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు..
తనకు రాహుల్ గాంధీ పార్టీ అంతర్గత విషయాలు బయట మాట్లాడరాదని సూచించిన సమయం నుండి, తాను అటువంటి విషయాలకు దూరంగా ఉన్నానన్నారు. ప్రభుత్వంకు పాలనతోపాటు గెలిచిన ఎమ్మెల్యేల ప్రాధాన్యత తీసుకొని పరిపాలించాల్సిన అవసరం ఉంటుందని, అలాగే ఓడిన అభ్యర్థుల వ్యవహారాలను కూడా పార్టీ చూసుకోవాలని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. గెలిచిన ఎమ్మెల్యేలను ప్రభుత్వం బాధ్యత తీసుకుంటే, ఓడిన అభ్యర్థులకు పార్టీలు అండగా ఉండాల్సిన బాధ్యత ఎంతైనా ఉందంటూ జగ్గారెడ్డి అన్నారు.