Formula E Race Case: ఫార్ములా ఈ కారు రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం వాదోప వాదనలు జరుగుతున్నాయి. జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ముందు కేటీఆర్ తరుపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ దవే తన వాదనలు వినిపించారు.
ఎఫ్ఐఆర్‌లో ఉన్న 409 సెక్షన్‌పై తొలుత వాదనలు జరిగాయి. పిటిషన్‌దారుడు అనుమతి తీసుకోలేదన్నది నిజమే.. కానీ డబ్బు ఆయా వ్యక్తులకు చేరలేదని వాదనలు మొదలు పెట్టారు. అవినీతి అన్న అంశమే లేదు కాబట్టి, ఇక్కడ సెక్షన్ 409 చెల్లదన్నారు.
బ్యాంక్ ద్వారా డబ్బు చెల్లింపు జరిగిందని, ఇక్కడ వ్యక్తిగత ప్రయోజనం ఎక్కడ ఉందని ఆర్గ్యుమెంట్ చేశారు. ఎఫ్ఈఓతో అగ్నిమెంట్‌పై సంతకం చేసింది అధికారి అరవింద్ కుమార్, కేటీఆర్ కాదన్నారు. FEOను ఏసీబీ అధికారులు నిందితుడిగా ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు.
ఈ కేసులో నిందితుడిగా కేటీఆర్ చేర్చినప్పుడు ఎఫ్ఈవో మాటేంటని ప్రశ్నించారు దవే. ఫార్ములా ఈ కారు రేస్ ఆపరేషన్స్ (ఎఫ్ఈవో) చేసిందని, వాళ్ళను ఎందుకు FIRలో చేర్చలేదన్నారు. ఈ క్రమంలో న్యాయమూర్తి జోక్యం చేసుకున్నారు. విచారణ కొనసాగుతున్న క్రమంలో ఎఫ్ఈఓ ను నిందితుడిగా చేర్చవచ్చు కదా అని అన్నారు.
ALSO READ: న్యూ ఇయర్ అలర్ట్.. 4 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్
కేటీఆర్ లబ్ధి పొందినట్టు ఎలాంటి ఆధారాలు లేవన్నారు న్యాయవాది దవే. ఈ కేసులో IAS అరవింద్ కుమార్‌ని బాద్యుడిని చేస్తూ వాదనలు చేశారు. ఆ తరహా మూడు కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించారు. సెక్షన్ 405, 409 ఏమాత్రం చెల్లవని, ఈ – రేస్‌ను కొనసాగించాలన్న ఉద్దేశంతో నిధుల చెల్లింపులు జరిగాయి తప్ప అవినీతి లేదన్నారు.
సుప్రీంకోర్టు తీర్పులను చదివి వినిపించారు న్యాయవాది దవే. కేటీఆర్ తరపున న్యాయవాది దవే వాదనలు ముగిశాయి. లంచ్ బ్రేక్ తర్వాత ఏసీబీ, ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్నారు అడ్వేకేట్ జనరల్. మధ్యాహ్నం ఏసీబీ, ఐఏఎస్ అధికారి దాన కిషోర్ తరపున వాదనలు న్యాయస్థానం ఆలకించనుంది. మంగళవారంతో కేటీఆర్ అరెస్ట్ గడువు ముగియనుంది.