Rohit Sharma – Virat Kohli: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో భారత్ క్రికెట్ జట్టు దిగ్విజయంగా వైఫల్యాల పరంపరను కొనసాగిస్తోంది. మెల్ బోర్న్ వేదికగా జరిగిన నాలుగవ టెస్ట్ లో రోహిత్ సేన 184 పరుగుల భారీ తేడాతో మరో పరాభవాన్ని మూట కట్టుకున్న విషయం తెలిసిందే. ఈ టెస్ట్ లో ఓటమితో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసి) ఫైనల్ బెర్త్ ను సంక్లిష్టం చేసుకుంది భారత జట్టు.
Also Read: Indian Team Schedule 2025: 2025లో టీమిండియా ఫుల్ బిజీ.. పూర్తి షెడ్యూల్ వచ్చేసింది..!
నాలుగో టెస్ట్ లో కూడా భారత జట్టు ఓటమి చెందడంతో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లుగా వార్తలు వెలువడ్డాయి. సిడ్నీలో జరిగే చివరి టెస్ట్ అనంతరం రోహిత్ శర్మ తన నిర్ణయాన్ని ప్రకటించనున్నాడని అంటున్నారు. ఇదిలా ఉంటే.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని 5వ చివరి టెస్ట్ కోసం రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు సిడ్నికి చేరుకుంది. ఈ చివరి టెస్ట్ జనవరి మూడవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు సిడ్నీ వేదికగా జరగబోతోంది.
అయితే ఈ టెస్ట్ లో గెలిచి సిరీస్ ని సమం చేయాలని భారత జట్టు కలలు కంటోంది. ఇందుకోసం ఇరు జట్లు మంగళవారం రోజే సిడ్నీ చేరుకున్నాయి. కానీ విరాట్ కోహ్లీ మాత్రం జట్టుతో కలిసి విమానాశ్రయం నుండి బయటకు వెళ్లడం కనిపించలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ, ఓపెనర్ యశస్వి జైస్వాల్ తో సహా మొత్తం జట్టు సిడ్నీ విమానాశ్రయం బయట కనిపించింది. కాగా కోహ్లీ ఈ సిరీస్ కి తన కుటుంబంతో కలిసి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అతడు విడిగా ప్రయాణిస్తున్నాడు.
ఇక ఈ చివరి టెస్ట్ కి మరో మూడు రోజులు మాత్రమే గ్యాప్ మిగిలి ఉంది. ఈ చివరి టెస్ట్ లో భారత్ విజయం సాధిస్తే 2-2 తో సమం అవుతుంది. లేదంటే సిరీస్ ఆస్ట్రేలియా వశం అవుతుంది. అంతేకాదు ఈ చివరి టెస్ట్ లో విజయం సాధిస్తేనే భారత జట్టు డబ్ల్యుటిసి ఫైనల్ కి వెళ్లే అవకాశాలు సజీవంగా ఉంటాయి. దీంతో భారత జట్టు ఈ ఆఖరి టెస్ట్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా భారత బ్యాటింగ్ వైఫల్యం పై దృష్టిపెట్టిన సెలెక్టర్లు గత మూడు టెస్టులలో చేసిన తప్పిదాలపై ఫోకస్ చేశారు.
Also Read: Navjot Singh Sidhu on Travis Head: వేలు పెట్టి గెలికేసిన ట్రావిస్ హెడ్.. రంగంలోకి ICC ?
దీంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఈ చివరి టేస్ట్ కి దూరం పెట్టనున్నట్లుగా సమాచారం. రోహిత్ స్థానంలో గిల్ తుది గెట్టిలోకి రీఎంట్రీ ఇవ్వనుండగా.. కెప్టెన్సీ బాధ్యతలను బూమ్రాకి అప్పగించే అవకాశం ఉంది. జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయగా.. మూడవ స్థానంలో గిల్ బ్యాటింగ్ కి దిగుతాడు. ఇక సిడ్ని పిచ్ స్పిన్ కి అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో భారత్ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. మరోవైపు కోహ్లీని కూడా ఈ టెస్ట్ నుంచి పక్కకు పెట్టాలని యోచిస్తున్నారట. దీంతో కొత్త ఏడాది ప్రారంభంలోనే టీమ్ ఇండియా అభిమానులకు భారీ షాక్ తగలనుంది.