BLN Reddy: ఫార్ములా ఈ రేసు కేసు విచారణ ఎంతవరకు వచ్చింది? ఈ కేసు విచారణలో ఏసీబీ నిందితులందర్నీ విచారణ చేసిందా? నిందితులు ఇచ్చిన ఆధారాలతో ఇంకా ఎవరినైనా పిలుస్తారా? ఏసీబీ విచారణలో ముగ్గురు నిందితులు సేఫ్‌గా గేమ్ ఆడారా? హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్‌రెడ్డి.. వారిద్దరి మీదకు తోసేశారా? అవుననే సమాధానాలు బలంగా వినిబడుతున్నాయి.
ఫార్ములా ఈ రేసు కేసు నుంచి తప్పించుకునేందుకు నిందితులు ఎవరి వెర్షన్ వారు ఏసీబీ ముందు చెప్పారు. కేటీఆర్‌ను అధికారులు ప్రశ్నిస్తే.. వారిద్దరు చేశారని ఆయన చెప్పారు. శుక్రవారం బీఎల్ఎన్‌రెడ్డి విచారించిన ఏసీబీ, వారిద్దరి ఒత్తిడితో తాను చేయాల్సి వచ్చిందంటూ సేఫ్ గేమ్ ఆడారు. ఈ కేసు నుంచి బయట పడేందుకు ఎవరికి వారే తీవ్ర ప్రయత్నాలు చేసినట్టు కనిపిస్తోంది.
శుక్రవారం ఉదయం 10 గంటలకు ఏసీబీ ముందు హాజరయ్యారు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి. సాయంత్రం నాలుగున్నర గంటల వరకు సాగిన విచారణలో ఈడీ ముందు ఏమైతే చెప్పారో అవే సమాధానాలు ఏసీబీ ముందు ఆయన చెప్పినట్టు తెస్తోంది. అయితే అధికారులు ఏ ప్రశ్న అడిగినా రిపీట్‌గా ఒకటే సమాధానం చెప్పారట.
మొత్తం వ్యవహారాన్ని ఐఏఎస్ అరవింద్ కుమార్‌పై ఎక్కువగా నెట్టే ప్రయత్నం చేశారని అంతర్గత సమాచారం. ఉల్లంఘన వెనుక ముమ్మాటికీ కారణం ఆయనేనట. అధికారులు చేసిన తప్పులను తనపై ఎలా రుద్దుతారని రివర్స్‌గా ఆయన కొన్ని ప్రశ్నలు వేసినట్టు తెలుస్తోంది. కేటీఆర్ సైతం అధికారులే చేశారని విచారణలో చెప్పుకొచ్చిన సంగతి తెల్సిందే.
ALSO READ: కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ వెనుక, కొడుకా జాగ్రత్త.. ఏ ఒక్కరినీ నమ్మవద్దు
హెచ్ఎండీఏ బోర్డుకు చెందిన అకౌంట్స్‌ను ఎవరు ఆపరేట్ చేస్తారు? నిధుల సమీకరణ, వాటి ఖర్చు ఏ అకౌంట్లోకి డిపాజిట్ అవుతుంది? అనే అంశాలపై ఆరా తీసినట్టు సమాచారం. హిమాయత్ నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో హెచ్ఎండీఏ అకౌంట్ ఆపరేషన్స్ గురించి పలు ప్రశ్నలు లేవనెత్తినట్టు తెలిసింది.
2023, అక్టోబరు 3, 11 తేదీల్లో ట్రాన్స్‌ఫర్ చేసిన మనీకి సంబంధించి ఇన్ వాయిస్ గురించి ప్రశ్నలు సంధించారట. తొమ్మిదో సీజన్ జరిగినప్పుడు ట్రాక్, ఇతర పనుల నిమిత్తం 12 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని వివరించినట్టు సమాచారం. ఈ చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వ అనుమతులపై ఏసీబీ ఆరా తీసిందట. ఆ అంశం తన పరిధిలో లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారట బీఎల్ఎన్ రెడ్డి. మళ్లీ పిలిచినప్పుడు విచారణకు రావాలని ఆయనను ఏసీబీ ఆదేశించింది.