KCR Talks KTR: బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది? ఫార్ములా ఈ రేసు విచారణలో రెండో అంకం మొదలు కానుందా? అసలు టెన్షన్ కారు పార్టీకి మొదలైందా? ఉన్నట్లుండి కేసీఆర్‌తో కేటీఆర్ సమావేశం వెనుక ఏం జరుగుతోంది? విచారణ గురించి మొత్తం చెప్పారా? అరెస్టయితే జరిగే పరిణామాల గురించి వివరించారా? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు.
శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నాలుగు గంటలపాటు ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో ఏం జరిగింది? కేసీఆర్-కేటీఆర్ మధ్య జరిగిన చర్చల సారాంశం ఏంటి? ఎందుకు కొడుకుని కేసీఆర్ అలర్ట్ చేశారు? ప్రభుత్వంతో జాగ్రత్త అని హెచ్చరిక వెనుక కారణమేంటి? ఇవే ప్రశ్నలు ఆ పార్టీ నేతలను వెంటాడుతోంది.
ఫార్ములా ఈ రేసు కేసు విచారణ తర్వాత కేసీఆర్ నుంచి కేటీఆర్‌కు కబురొచ్చింది. ఆఘుమేఘాల మీద శుక్రవారం మధ్యాహ్నం ఫామ్ హౌస్‌కు కేటీఆర్, హరీష్‌రావులు వెళ్లారు. ఈ ముగ్గురి మధ్య కీలక విషయాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఏసీబీ విచారణలో ఏం జరిగిందనే దానిపై పూసగుచ్చి తండ్రికి వివరించాడట కేటీఆర్.
విచారణ సమయంలో మిగతా నిందితులు ఇచ్చిన సమాచారంపై అధికారులు ఏమైనా ప్రశ్నించారా? ఎక్కడ తప్పు జరిగింది? ఎన్నికల కోడ్ సమయంలో ఎందుకు కంగారు పడ్డావని కేటీఆర్‌ను మందలించారట పెద్దాయన. మళ్లీ విచారణకు పిలిచే అవకాశం వుందా అని అడిగారట కేసీఆర్.
ALSO READ: పౌల్ట్రీ ముసుగులో మత్తు పదార్థాలు.. కోళ్ల దాన ముసుగున అల్ప్రాజోలం దందా..
వచ్చే వారంలో తెలుస్తుందని బదులిచ్చారట కేటీఆర్. ఈ కేసులో నిందితులుగావున్న ముగ్గుర్ని విచారించారని, వచ్చే వారం ఏమైనా జరగొచ్చు.. జరగకపోవచ్చని బదులిచ్చారట కేటీఆర్. మరోవైపు వచ్చేవారం ఈడీ ముందుకు రానున్నారు కేటీఆర్. వాళ్లు అడిగే ప్రశ్నలకు జాగ్రత్తగా సమాధానాలు చెప్పాలని, తేడా వస్తే పీక పట్టుకుంటారని కాసింత జాగ్రత్త చెప్పారట కేసీఆర్.
ఒకవేళ ఏసీబీ లేదా ఈడీ గానీ అరెస్ట్ చేస్తే జరగబోయే పరిణామాలను ఎలా ఫేస్ చెయ్యాలి? తాను ప్రజల్లోకి రావాలా అని కేసీఆర్ అడిగారట. ప్రస్తుతానికైతే ఎలాంటి సంకేతాలు లేవని, అంతా కూల్‌గా ఉందని చెప్పినట్టు పార్టీ వర్గాల మాట. ఒకవేళ అరెస్టయితే హరీష్‌రావు హైదరాబాద్‌లో ఉండి ప్రభుత్వంపై ఆందోళనకు దిగుతారని బదులిచ్చారట కేటీఆర్. కవిత జిల్లాల నేతలు, కేడర్‌ను అలర్ట్ చేస్తుందని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం కంగారు పడాల్సిదేమీ లేదని, స్థానిక సంస్థల ఎన్నికలు తప్పితే మేజర్ ఎన్నికలు లేవని అన్నారట కేటీఆర్. ఈడీ అరెస్ట్ చేసినా ఆరునెలల్లోపు బయటకు రావచ్చని సెలవిచ్చారు. చుట్టు పక్కలవారిని గమనించి వేసే అడుగులు.. మాట్లాడే మాట జాగ్రత్త అని చెప్పి కొన్ని సూచనలు చేశారట కేసీఆర్. మొత్తానికి తండ్రీకొడుకుల మధ్య చర్చ బాగానే జరిగిందని అంటున్నాయి పార్టీ వర్గాలు.