Wife Emotional Abuse Reddit | ఇటీవలి కాలంలో దేశంలో భార్యా బాధితులు ఎక్కువైపోతున్నారు. ఇంతకాలం బయటకురాని ఈ కేసులన్నీ ఇప్పుడు నెట్టింట బయటకు వచ్చి, మహిళలకు అనువుగా ఉన్న చట్టాలపై ప్రశ్నలు లేవనెత్తేలా చేస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం బెంగళూరుకు చెందిన అతుల్ సుభాష్ అనే ఆటోమొబైల్ కంపెనీ ఉద్యోగి.. భార్య హెరాస్‌మెంట్ తట్టుకోలేక వీడియోలో తన కష్టాలు చెప్పుకొని సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటిదే మరో కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అతుల్ సుభాష్‌తోపాటు యూపీలో కూడా మరో వ్యక్తి తన భార్య, ఆమె కుటుంబం పెడుతున్న బాధలు పడలేక ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ప్రముఖ సోషల్ మీడియా వేదిక ‘రెడిట్’లో ఒక వ్యక్తి తన గోడు వెళ్లబోసుకున్నాడు. 2023లో తన పెళ్లయిందని చెప్పిన ఆ యూజర్.. కొన్నిరోజులు భార్యాభర్తలు ఇద్దరూ సంతోషంగానే ఉన్నామని, కానీ 2024లో తమ బంధం ఊహించని మలుపులు తిరిగిందని చెప్పుకొచ్చాడు. భార్య తనను మానసికంగా హింసించసాగిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
Also Read: అత్యాచారం ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితురాలు.. నిందితుడితో పెళ్లిచేసుకోమని చెప్పిన పోలీసులు
26 ఏళ్ల ఆ రెడిట్ యూజర్ కథనం ప్రకారం.. 2023 డిసెంబరులో అతనికి పెళ్లయింది. కొంతకాలం అన్యోన్యంగా ఉన్న తర్వాత భార్య తన అసలు రూపం చూపించడం మొదలు పెట్టింది. అతన్ని మానసికంగా బాధ పెట్టడం ప్రారంభించింది. ఒకసారి బాత్‌రూంలోకి వెళ్లి తలుపులు మూసేసుకున్న ఆమె.. పుట్టింటి వాళ్లను పిలిచి పెద్ద పంజాయితీ పెట్టిందని, ఆ సమయంలో ఎవరూ ఊహించని విధంగా తను మగాడు కాదనే ఆరోపణలు చేసిందని ఆ వ్యక్తి చెప్పుకొచ్చాడు.
తనకు ఎరక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉందని పుట్టింటి వాళ్ల ముందు ఆరోపణలు చేసిన ఆమె.. ఆమె కోరికలు అతను తీర్చలేడని, అలాంటి వాడికిచ్చి పెళ్లి చేసి తన గొంతు కోశారని ఏడవడం మొదలుపెట్టిందట. ఇదంగా చూసిన ఆమె కుటుంబీకులు కూడా అల్లుడిపై ఎగిరిపడ్డారు. తమ కూతుర్ని సరిగా చూసుకోవడం లేదని, ఒక అపార్ట్‌మెంట్ కొని ఆమె పేరిట రాసివ్వకపోతే పంచాయతీ పెద్దల దగ్గరకు వెళ్లి అతని పరువు తీస్తామని బెదిరించడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఆమె కూడా తన తల్లిదండ్రులతోపాటు పుట్టింటికెళ్లిపోయిందట.
ఇది జరిగిన కొన్ని రోజులకు తన తల్లిదండ్రులను తీసుకొని వెళ్తే.. అక్కడ కూడా తన తల్లిదండ్రులను ఆమె, ఆమె కుటుంబం తీవ్రంగా అవమానించారని ఆ భర్త తన బాధను రెడిట్‌లో పంచుకున్నాడు. ఆ అవమానం తట్టుకోలేక, ఏం చెయ్యాలో తెలియక దారి తెలియని వాడిలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లిపోతుంటే.. చాలా సేపటికి తన తమ్ముడు వచ్చి తనను ఇంటికి తీసుకొచ్చాడని చెప్పాడు. అత్తమామలు కూడా ఇప్పుడు తన భార్య వెనుక నిలబడ్డారని, వాళ్లు చెప్పినట్లు ఫ్లాట్ కొని భార్యాభర్తలిద్దరు వేరేగా కాపురం ఉండాలని, లేదంటే పంచాయతీ పెద్దల ముందు తమ కుటుంబం పరువు తీస్తామని బెదిరిస్తున్నట్లు ఆ వ్యక్తి చెప్పుకొచ్చాడు.
‘ఇక నాకు ఆమెపై ఏమాత్రం ప్రేమ లేదు. తనతో కలిసి ఉండాలని కూడా నేను అనుకోవడం లేదు. ఎవరైనా నాకు సలహా ఇవ్వండి. ఇప్పుడు ఏం చేస్తే నా కష్టాలు తీరతాయి?’ అని ఆ వ్యక్తి అడిగాడు. భార్య, ఆమె కుటుంబం చేసిన ఆరోపణల వల్ల తన కుటుంబం పరువు పూర్తిగా పోయిందని, అందరూ తనను చేతకాని వాడిలా చూస్తున్నారని. నడిరోడ్డు మీద అవమానకరంగా మాట్లాడుతున్నారని వాపోయాడు. ఇదంతా చదివిన నెటిజన్లు.. ప్రస్తుతం మహిళలకు అనుకూలంగా ఉన్న చట్టాలను మార్చి, చట్టం అందరికీ సమానం చేసే వరకు ఇలాంటి తిప్పలు తప్పవని అంటున్నారు.