Gadwal News: స్వేచ్చ బ్యూరో: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రమైన గద్వాల పట్టణంలో ఇంతకాలం ప్రభుత్వ భూములు, ఫుట్పాతాల్లో ఏర్పాటు చేసుకున్న అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. గద్వాల పట్టణంలో ఇరువైపులా డ్రైనేజీల వరకు రోడ్ల విస్తరణకే ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నారు. గద్వాల మున్సిపల్ పరిధిలో రోజురోజుకూ విస్తరిస్తున్న ఆక్రమణల పై గద్వాల మున్సిపల్ చైర్పర్సన్ తుమ్మల జయలక్ష్మీ ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సూచనల మేరకు రోడ్ల స్థలాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తొలగించేందుకు అధికారులు ఇప్పటికే వాటికి మార్కింగ్ కూడా ఇచ్చారు.
ఈ క్రమంలో మంగళవారం కృష్ణవేణి చౌరస్తా నుంచి భీంనగర్ వరకు రోడ్డుకు ఇరువైపుల ఉన్న ఆక్రమణలన్నీ తొలగించగా, ప్రస్తుతం ఆ ప్రాంతం విశాలంగా దర్శనమిస్తోంది. అలాగే కృష్ణవేణి చౌరస్తా నుంచి అంబేద్కర్ వరకు త్వరలో అక్రమణల తొలగింపునకు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే పాతబస్టాండ్, పాత కూరగాల మార్జెట్, ఆంధ్రబ్యాంక్ రోడ్డు, గాంధీచౌక్ , డ్యాం రోడ్డు, రాజీవ్ మార్గ్, బీరొల్లు చౌరస్తా, కలెక్టరేట్ తదితర మార్గాలలో ఆక్రమణల తొలగింపు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ భీంనగర్ లో అక్రమణలు తొలగించినట్లు మిగతా ప్రాంతాల్లో ఎందుకు చేయడం లేదని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
గద్వాల పట్టణంలో పాతబస్ఠాండ్, పాతకూరగాయాల మార్కెట్, గాంధీచౌక్, డ్యాం రోడ్డు, రాజీవ్ మార్గ్, రెండ రైల్వే గేటు, బీరొల్లు చౌరస్తా, కలెక్టరేట్, జిల్లా ప్రభు ఆసుపత్రి తదితర ప్రధాన మార్గాలలో ప్రధాన రోడ్లు ఇరుకుగా ఉండడంతో నిత్యం వాహనదారులకు ట్రాఫిక్ ఇక్కట్లు తప్పడం లేదు. ప్రధానంగా కూడలిలో నిత్యం వాహనాలు ఇరుక్కుపోతున్నాయి. పాతబస్ఠాండ్, పాతకూరగాయాల మార్కెట్, గాంధీచౌక్, డ్యాం రోడ్డులలో రెండు బస్సులు ఎదురెదురుగా వస్తే చాలు .. ఇక అంతే సంగతి. ఇక భారీ వాహనాలు వస్తే గంటలకొలదీ ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సిందే.
Also read: అత్వెల్లిలో నారాయణ స్కూల్ అరాచకం.. విద్యాశాఖ నిబంధనలు బేఖాతర్!
పట్టణంలోని ప్రధాన రోడ్డుకు ఇరువైపులా వాణిజ్య, వ్యాపార సముదాయాలు ఇబ్బడిముబ్బడిగా వెలిశాయి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న కాలువలు, ఆర్‌అండ్‌బీ స్థలాలు ఆక్రమణకు గురైనట్టు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. అనధికారికంగా రోడ్డుకిరువైపులా ఎడాపెడా తాత్కాలిక ప్రాతిపదికన చిల్లర దుకాణాలు, తోపుడు బళ్లు వెలిశాయి. దీంతో ట్రాఫిక్ సమస్య మరింత జఠిలమవుతుంది.
గద్వాల పట్టణంలో అనేక సంవత్సరాలుగా ఫుట్పాత్లను ఆనుకొని వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. అందులో చిరువ్యాపారులు షెడ్లు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తుండగా, కొందరు రాజకీయ నాయకులు సైతం తమ చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలున్నాయి. ఫుట్పాత్లను ఆనుకొని వ్యాపారాలకు అనువుగా ఉండే స్థలాల పై కన్నేసిన నాయకులు తమ పలుకుబడితో వివిధ ప్రాంతాల్లో విచ్చలవిడిగా షెడ్లను ఏర్పాటు చేశారు. వాటిని చిరువ్యాపారులకు అద్దెకిస్తూ నెలవారీ అద్దె రూపంలో వేలల్లో దోచుకుంటున్నారు. అయినా ఇంత కాలం వాటిపై ప్రశ్నించే నాథుడే లేకపోయాడు. ఈ క్రమంలో పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. వాటి వెనుక ప్రజాప్రతినిధుల అండ ఉండగా, నెలకు లక్షల రూపాయలు కిరాయిల రూపంలో చేతులు మారుతున్నాయి.
Also read: కూకట్‌పల్లి వాసులకు బంపర్ ఆఫర్.. ట్రాఫిక్ తిప్పలకు చెక్.. భారీ ఫ్లైఓవర్‌కి గ్రీన్ సిగ్నల్!