Gadwal Fort: మరో చారిత్రక సంపద కనుమరుగుకాబోతుంది.. వారసత్వ సంపద శిథిలమవుతోంది. అది మట్టిగోడే కావొచ్చు.. కానీ ఓ చరిత్రకు నిదర్శనం. కానీ ఆ గోడే మట్టిలో కలిసిపోతూ చరిత్రగా మారబోతుంది. ఇంతకీ ఏంటా గోడ? ఎక్కడుందా గోడ? ఆ గోడ చరిత్రేంటి?
శిథిలమవుతున్న గ్రేట్ వాల్ ఆఫ్ గద్వాల్
వందల ఏళ్ల చరిత్ర, తెలంగాణ చారిత్రక వైభవానికి నిలువెత్తు నిదర్శనం.. గ్రేట్ వాల్ ఆఫ్ గద్వాల్.. ఇప్పుడు శిథిలమవుతోంది. గద్వాల్ సంస్థానానికి గుర్తుగా ఉన్న ఈ వారసత్వ సంపద.. ఇంకొన్నేళ్లలోనే కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది. 363 ఏళ్ల నాటి ఈ గట్టి గోడలు.. ఇప్పుడు మట్టిలో కలిసిపోతున్నాయ్. పురావస్తు శాఖ నిర్లక్ష్యంతో.. గద్వాల్ సంస్థానం చరిత్ర చెదిరిపోతోంది. ఆనాటి కోట గోడ కూలిపోతోంది. అసలు.. గద్వాల్ కోటకు ఈ దుస్థితి ఎందుకొచ్చింది?
1662లో గద్వాల్ కోటని నిర్మించిన నల్ల సోమనాద్రి
14వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత.. బహమనీ సామంతుల కింద గద్వాల సంస్థానం వృద్ధి చెందింది. 1662లో నల్ల సోమనాద్రిగా పిలిచే రాజా పెద్ద సోమభూపాలుడు.. కృష్ణా నది తీరానికి సమీపాన ఈ కోటను నిర్మించాడు. బనగానపల్లె, ఆదోని, నంద్యాల లాంటి ప్రాంతాలకు విస్తరించిన సంస్థానానికి.. ఈ కోటే కేంద్రంగా నిలిచింది. 103 గ్రామాలు, 26 జాగీర్లతో ఈ సంస్థానం ఒకప్పుడు శక్తిమంతమైన పాలనా కేంద్రంగా విరాజిల్లింది.
ఇప్పటికీ చెక్కు చెదరని గద్వాల్ కోట ముఖద్వారం
గద్వాల్ కోట ముఖద్వారం తలుపులు.. ఈ నాటికి చెక్కు చెదరకుండా.. తరాల నాటి చరిత్రను గుర్తుచేస్తున్నాయి. ఇంతటి గొప్ప ముఖ ద్వారానికి రంగులేసి చేతులు దులుపుకున్నారు అధికారులు. ముందుకు బాగానే కనిపిస్తున్నా.. వెనుక వైపు మొత్తం కూలిపోతోంది.
గద్వాల కోటలో కొలువైన చెన్నకేశవస్వామి ఆలయం
గద్వాల కోటలోని చెన్నకేశవస్వామి దేవాలయం.. నల్ల సోమనాద్రి నిర్మించిన అద్భుత కళాఖండం. 90 అడుగుల గాలి గోపురం, గోడలపై ఉన్న శిల్ప కళ.. గద్వాల్ కోట సాంస్కృతిక, కళా వైభవాన్ని ప్రతిబింబిస్తాయ్. గద్వాల కోట నిర్మాణ సమయంలో అవాంతరాలు ఏర్పడటంతో.. ఓ బ్రాహ్మణుడిని నరబలి ఇచ్చారని.. దానికి పరిహారంగా నల్ల సోమనాద్రి.. ఈ చెన్నకేశవ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది.
గద్వాల్ కోట పరిరక్షణకు తగిన చర్యలు లేవనే విమర్శలు
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. గద్వాల్ సంస్థానం మాత్రం మరో ఏడాది పాటు నిజాం సామంత రాజ్యంగానే కొనసాగింది. ఆ సమయంలో గద్వాల్ మహారాణిగా ఆదిలక్ష్మమ్మ ఉన్నారు. చివరికి.. ఆపరేషన్ పోలోతో గద్వాల్ భారత్‌లో విలీనమైంది. ఇప్పటికీ.. కోట లోపల మహారాణి విగ్రహం కనిపిస్తుంది. రాజ బహద్దూర్ సీతారామ్ భూపాల్.. 1924 వరకు గద్వాల్ సంస్థానాన్ని పాలించారు. ఆయన విగ్రహం కూటా కోట లోపల ఏర్పాటు చేశారు. గద్వాల్ సంస్థానం పరాక్రమానికి, యుద్ధ పోరాట చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది ఈ 30 అడుగుల ఫిరంగి. ఆనాటి సైనికుల పటిమను గుర్తు చేసేలా ఇప్పటికీ గద్వాల్ పట్టణంలో ఉంది.
క్రమంగా శిథిలమవుతున్న రాజభవనాలు, దేవాలయాలు
రాష్ట్ర పురావస్తు శాఖ.. గద్వాల్ కోటను పురాతన స్మారకంగా గుర్తించినా.. దాని పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోలేదనేది స్థానికుల ఆరోపణ. కోటలోని రాజభనాలు, దేవాలయాలు.. సరైన నిర్వహణ లేక శిథిలమవుతున్నాయి. ఈ కోట చుట్టూ.. కందకాలు, రాతి గోడలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కానీ.. కోట లోపలి వైపు ఉన్న గోడ మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది.
గద్వాల్ కోట లోపలి బావిని పరిరక్షించడంలో విఫలం
గోల్కొండ, జాఫర్‌గఢ్ లాంటి కోటలను తెలంగాణ ప్రభుత్వం సంరక్షిస్తోంది. ఈ కోటను కూడా టూరిస్ట్ స్పాట్‌గా మారిస్తే.. దీని చారిత్రక విలువని కాపాడే అవకాశం ఉంది. కానీ.. ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఇప్పటికీ.. కోట లోపల చెక్కు చెదరకుండా ఉన్న బావిని పరిరక్షించడంలోనూ విఫలమవుతున్నారు.
గద్వాల కోట.. గతానికి సంబంధించిన వర్తమాన గుర్తు!
గద్వాల కోట ఓ చారిత్ర వారసత్వ సంపద మాత్రమే కాదు. మన సంస్కృతి. గతానికి సంబంధించిన వర్తమాన గుర్తు. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. పురావస్తు శాఖ, ప్రభుత్వం, ప్రజలు కలిసి చర్యలు తీసుకుంటే.. గ్రేట్ వాల్ ఆఫ్ గద్వాల వైభవం.. ఇంకొన్నేళ్ల పాటు గొప్పగా నిలిచిపోతుంది. ఇక్కడి ప్రజలు, చరిత్రకారులు విజ్ఞప్తి కూడా ఇదే.
కోట పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు
గద్వాల్ కోట అంటే.. మట్టి గోడలు, రాళ్ల నిర్మాణం మాత్రమే కాదు. గొప్పగా వెలుగొందిన మన చరిత్రకు.. సజీవ సాక్ష్యం. గద్వాల కోటను సంరక్షించడమంటే.. మన చరిత్రని రక్షించడమే! భావి తరాలకు.. తెలంగాణ వారసత్వాన్ని కళ్ల ముందు నిలపడమే! ఇప్పటికైనా.. గద్వాల్ కోట పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఇప్పుడు గనక చర్యలు చేపట్టకపోతే.. గద్వాల్ సంస్థానం గొప్ప చరిత్ర.. ఈ మట్టి గోడల శిథిలాల కింద కూరుకుపోతుంది.