Hyderabad News: హైదరాబాద్ సిటీలోని కేబిఆర్ పార్క్‌లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో దేశీ కుక్క పిల్లల దత్తత మేళా కార్యక్రమం జరిగింది. ఆగష్టు 31 అనగా ఆదివారం ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు కొనసాగింది. ముఖ్యంగా దేశీ కుక్క పిల్లలకు సురక్షిత హోమ్, సంరక్షణ, వీధి కుక్కల బెడద లేకుండా చూసేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది.
ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి ఈ మేళాను ప్రారంభించారు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్. టీకాలు వేసిన,నులి పురుగులు తొలగించిన దేశీ కుక్కపిల్లలను ఉచితంగా దత్తత తీసుకోవచ్చు. మేళాలో పలు రకాల కుక్క పిల్లల ప్రదర్శనకు ఉంచారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న ఔత్సాహికులకు ఉచితంగా కుక్క పిల్లలను అందజేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్.
గ్రేటర్ పరిధిలోని అన్ని జోన్లలో దేశీ కుక్క పిల్లల దత్తత మేళాను నిర్వహిస్తామన్నారు. ఈ చిన్న జీవితాలకు హీరోలుగా మారాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ పౌరులను కోరారు. మీరు దత్తత తీసుకున్నప్పుడు కేవలం ఒక ప్రాణాన్ని కాపాడటమే కాదు.. జీవితాంతం ఉండే స్నేహితుడిని పొందుతున్నారని అన్నారు. ఇది సెకండ్ దేవీ కుక్కపిల్ల దత్తత డ్రైవ్ కార్యక్రమం.
గతంలో ఒకసారి ఇలాంటి కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించిన విషయం తెల్సిందే. మొత్తానికి వీధి కుక్కల నియంత్రణకు జీహెచ్ఎంసీ చేపట్టిన దత్తత కార్యక్రమం హైదరాబాద్ వాసుల నుంచి మంచి రెస్పెన్స్ వచ్చిందని అంటున్నారు అధికారులు. ఇలాంటి కార్యక్రమం వల్ల వీధి కుక్కల సంఖ్యను తగ్గించడం, వాటికి ప్రేమగల వాతావరణం కల్పించడం మంచి ఉద్దేశం.