Sisters Politics: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో రెండు రాష్ట్రాల్లో కుటుంబసభ్యుల మధ్య పోటీ పెరుగుతోంది. కుటుంబాలతో సొంత పార్టీతో విబేధించి బయటకు వచ్చిన ఇద్దరు మహిళా రాజకీయ నాయకులు సొంత అన్నలకే సవాల్‌గా మారుతున్నారు. అటు ఏపీలో పీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల, వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు ఏకు మేకులా తయారయ్యారు. ఇటు తెలంగాణలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి, తన అన్న కేటీఆర్‌కు సవాల్‌గా మారారు. ప్రస్తుతం టూస్టేట్స్ లో ఇప్పుడు ఈ చెల్లెళ్ల రాజకీయం గురించి హాట్ డిస్కషన్ నడుస్తోంది…
కవిత, షర్మిల మధ్య దగ్గరి సారూప్యాలు
అటు తెలంగాణలో కల్వకుంట్ల కవిత..ఇటు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ షర్మిలా రెడ్డి.. ఇద్దరికీ రాజకీయ, వ్యక్తిగత జీవితంలో చాలా దగ్గర పోలికలుంటాయి. గులాబీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముద్దుల కూతురు కవిత. వైఎస్ షర్మిల దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారాల పట్టి. ఇద్దరూ సీఎంల కుమార్తెలే. బలమైన రాజకీయ కుటుంబాల నుంచి వచ్చినవారే..పైగా ఇద్దరూ ఇప్పుడు కుటుంబంతో విబేధించి సొంతంగా రాజకీయ భవిష్యత్తును ఎదుర్కుంటున్నారు.
2 రాష్ట్రాలతో అన్నలతో విభేదిస్తున్న చెల్లెళ్లు
ఇద్దరు చెల్లెళ్లు రెండు రాష్ట్రాల్లో సొంత అన్నలతో విభేదిస్తున్నారు. ఏపీలో తోడబుట్టిన అన్న వైఎస్ జగన్ తో విబేధించి సొంతంగా తెలంగాణలో పార్టీ పెట్టి తర్వాత.. ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా పని చేస్తున్నారు షర్మిల. తెలంగాణలో కూడా సేమ్ సీన్. సొంత అన్న కేటీఆర్‌తో విబేధించి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు కవిత. అక్కడ సొంత అన్న జగన్ తో పాటు మరో సోదరుడు అవినాష్ రెడ్డి పై ఎన్నికల సమయంలో షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఇక్కడ సొంత అన్న కేటీఆర్ పై నేరుగా విమర్శలు చేయకపోయినప్పటికీ బంధువు హరీష్ పై మాత్రం తీవ్ర విమర్శలు చేస్తున్నారు కవిత. ప్రస్తుతం కవిత రాజకీయ పార్టీ ఎనౌన్స్ చేయకపోయినప్పటికీ,.. తెలంగాణ జాగృతి సంస్థనే త్వరలో పొలిటికల్ పార్టీగా మార్చబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
బీసీల బంద్‌లో ప్రత్యక్షమైన కవిత కొడుకు ఆదిత్య
ఇక ఇప్పుడు వీరిద్దరి గురించి మరోసారి చర్చ ఎందుకు జరుగుతూంటే. ఇద్దరూ తమ రాజకీయ వారసులను రంగంలోకి దింపుతున్నారు.. ఈ మధ్య కర్నూల్ లో జరిగిన పార్టీ కార్యక్రమాలకు కొడుకు వైఎస్ రాజారెడ్డిని తీసుకొచ్చారు షర్మిళ..అమెరికాలో ఉద్యోగం చేస్తున్న రాజారెడ్డికి కాంగ్రెస్ పార్టీ కండువా మెడలో వేసి పార్టీ కార్యక్రమంలో నాయకులకు పరిచయం చేశారు. ఒక విధంగా తన కొడుకు పొలిటికల్ ఎంట్రీని ఖరారు చేసేశారు. ఇదుగో నా రాజకీయ వారసుడు వైఎస్ రాజారెడ్డి అంటూ పబ్లిక్ కి చెప్పేశారు. తాజాగా కర్నూలు ఉల్లి రైతుల పరామర్శకు తల్లి షర్మిలతో కలిసి రాజారెడ్డి హాజరయ్యాడు. తాజాగా కవిత కుమారుడు ఆదిత్య తెలంగాణ లో బీసీ ల బంద్ సందర్భంగా సడన్‌గా ప్రత్యక్షమయ్యాడు.. ఏకంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్లకార్డు పట్టుకుని మరీ..రోడ్డుపై కూర్చుని ధర్నా చేశాడు. తల్లి కవితతో పాటు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్న ఆదిత్యను చూసి..కవిత వారసుడు రంగంలోకి దిగాడు అంటూ కవిత అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
కేసీఆర్ వారసుడిగా ఆదిత్యను కవిత ఫోకస్ చేస్తారా?
అక్కడ షర్మిల తన కొడుకు రాజశేఖర్ రెడ్డి వారసుడు అంటూ పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చేశారు. తాత వైఎస్ రాజారెడ్డి పేరు పెట్టుకున్న తన కుమారుడే రాజశేఖర్ రెడ్డికి అసలైన వారసుడు అంటూ స్టేట్మేంట్లు ఇస్తున్నారు. అంటే వైఎస్ జగన్ కు ఎలాగూ మగపిల్లలు లేరు..ఇద్దరూ ఆడపిల్లలే కావడం వల్ల తన కొడుకే అసలైన రాజకీయ వారసుడు అనే సంకేతాన్ని జనాల్లోకి పంపుతున్నారు.. ఇక కవిత కూడా తన కొడుకుని కేసీఆర్ వారసుడిగానే జనాల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది.
Also Read: భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాగృతి అధ్యక్షురాలు కవిత
కేసీఆర్ పేరు చెప్పుకోకుండా, కేసీఆర్ ఫొటో లేకుండా తెలంగాణ రాజకీయాల్లో కవిత మనుగడ చాలా కష్టం అన్న అభిప్రాయం ఉంది.అందుకే తన కొడుకు ఆదిత్యను కేసీఆర్ కు అసలైన వారసుడు అంటూ జనాల్లోకి తీసుకెళ్లబోతున్నట్టు సమాచారం. మరోవైపు కేటీఆర్ కుమారుడు హిమాన్షు కూడా యాక్టివ్ గానే ఉన్నప్పటికీ అతను ఇంకా చాలా చిన్నపిల్లాడు కావడం వల్ల అతని కంటే ముందే తన కుమారుడిని రాజకీయాల్లోకి అడుగు పెట్టించే ప్రయత్నం కవిత చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.మొత్తం మీద రెండు తెలుగురాష్ట్రాల్లో ఈ ఇద్దరు వారసుల మీద ఆసక్తికర చర్చ నడుస్తోంది.
Story By Apparao, Bigtv