BigTV English

CM Progress Report: అందరూ మెచ్చేలా.. పిల్లలకు నచ్చేలా.. విద్య శాఖపై సీఎం రేవంత్ ఫోకస్

CM Progress Report: అందరూ మెచ్చేలా.. పిల్లలకు నచ్చేలా.. విద్య శాఖపై సీఎం రేవంత్ ఫోకస్
Advertisement

CM Progress Report: ఈ వారం సీఎం రేవంత్ షెడ్యూల్ బిజీబిజీగా గడిచింది. విద్యావ్యవస్థలో సమూల మార్పులు, కార్పొరేట్ తరహా చదువులు, అభ్యసనా సామర్థ్యాలను పెంచేలా తనిఖీలు, పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ స్కీం అమలు, ప్రజాపాలన విజయోత్సవాలకు షెడ్యూల్, మామూనూరు భూములిచ్చిన రైతులకు మరింత సహాయం చేశారు..


12-10-2025 ఆదివారం (ఇంటర్ పరీక్షలు ఇంకింత ముందుకు!)
ఇంటర్మీడియట్‌ ఫైనల్ ఎగ్జామ్స్ ఈసారి ఫిబ్రవరి నెలాఖరులోనే ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోసం ఇంటర్‌బోర్డు ఫైల్ పంపింది. 2026 ఫిబ్రవరి 23 లేదా 25 నుంచి పరీక్షలు మొదలయ్యేలా రెండు రకాల టైం టేబుళ్లను సర్కారుకు పంపారు. సీఎం రేవంత్‌రెడ్డే విద్యాశాఖ మంత్రిగా ఉండడంతో ఆయన ఆమోదం తర్వాత షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు. ఏపీ ఇంటర్‌ పరీక్షలు ఫిబ్రవరి 23న ప్రారంభమై.. మార్చి 24తో ముగియనున్నాయి. అదే మాదిరిగా తెలంగాణలోనూ అనుకుంటున్నారు. గతంలో ఫిబ్రవరి నెలాఖరులోనే ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతుండేవి. అయితే కరోనాతో షెడ్యూల్ మార్చిలోకి షిఫ్ట్ అయింది. ఫిబ్రవరిలోనే ఇంటర్ పరీక్షలు మొదలుపెడితే జేఈఈ మెయిన్, ఎప్‌సెట్, నీట్‌కు ప్రిపేర్ అయ్యే వారికి రివిజన్ కు, కొంత వెసులుబాటు దొరుకుతుంది. ఇంటర్ రెండు సంవత్సరాలు కలిపి 9 లక్షల మందికిపైగా మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. సో వీళ్లకు ప్లస్ అవుతుంది.

13-10-2025 సోమవారం (గురుకులాలకు గుడ్ న్యూస్)
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ వ‌స‌తి గృహాలలో అత్యవసర పనులకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 60 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ నిధులను హాస్టళ్లలో డైట్ ఛార్జీలు, తాత్కాలిక సిబ్బంది జీతాల విడుదల, హాస్టళ్లలో మోటార్ల మరమ్మతులు, ఇతర అత్యవసర పనులకు వినియోగించుకునే వెసులుబాటు క‌లిగించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ గృహాలు, విద్యా సంస్థలపై ఈనెల 13న కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది ఫేస్ ఐడెంటిఫికేషన్ కు ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యతను తెలుసుకునేందుకు యాప్‌ను ఉప‌యోగించాలన్నారు. విద్యార్థులకు అందించే యూనిఫాంలు, పుస్తకాలు సకాలంలో స‌క్రమంగా అందేలా సీనియర్ అధికారులు చూసుకోవాలని, హాస్టళ్లలో ఉన్న సౌకర్యాలు, ఇతర వ‌స‌తులు, వాటి నిర్వహణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు డాష్‌బోర్డ్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. గంటలూ ఆన్‌లైన్‌లో వైద్యులు అందుబాటులో ఉండేలా హాట్‌లైన్ ఏర్పాటు చేయాలని, పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ఎడ్ టెక్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు.


14-10-2025 మంగళవారం (బనకచర్లపై పోరుబాట)
పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టు డీపీఆర్ విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయాలకు చెక్ పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ క్రమంలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా లేఖ రాశారు. బనకచర్ల లింక్ ప్రాజెక్టు విషయంలో గతంలోనే ఫిర్యాదు చేసినట్లు లేఖలో గుర్తు చేశారు. డీపీఆర్ కోసం ఏపీ ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిందని, వెంటనే ఈ ప్రక్రియను ఆపాలన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించే, నిబంధనలు, విభజన చట్టానికి వ్యతిరేకంగా బనకచర్ల లింక్ ప్రాజెక్టు చేపట్టకుండా చూడాలని కోరారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు లేఖ రాసింది. తాజాగా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖ రాశారు.

14-10-2025 మంగళవారం (ఆస్పత్రుల ప్రక్షాళన )
ప్రభుత్వ హాస్పిటల్స్ ను సమూల ప్రక్షాళన చేసి పేదలకు నాణ్యమైన వైద్యం అందించేలా రేవంత్ ప్రభుత్వం డే వన్ నుంచి ప్రణాళికలు రచించింది. ఈ క్రమంలో చాలా వరకు మార్పు తీసుకొచ్చారు. వైద్య శాఖలో క్రమం తప్పకుండా ఖాళీలు భర్తీ చేస్తున్నారు. హాస్పిటల్స్ లో పరిస్థితులను సమూలంగా మార్చేసేలా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా వైద్యారోగ్య శాఖకు 500 కోట్లు కేటాయించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దశల వారీగా సర్కారు దవాఖానాలను ప్రక్షాళన చేసేలా ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో హాస్పిటల్స్ భవన నిర్మాణ పనులు స్పీడప్ చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ఇటీవల చేపట్టిన బ్రాండింగ్‌ పనులు, సంస్కరణల గురించి మంత్రి దామోదర సీఎంకు వివరించారు. ఆరోగ్య శాఖలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై క్రిస్టినా ప్రజంటేషన్‌ ఇచ్చారు. నిర్మాణంలో ఉన్న టిమ్స్‌ ఆసుపత్రులతోపాటు, వైద్య కళాశాలల నిర్మాణాలకు అయ్యే వ్యయంపై సీఎం ఆరా తీశారు. ఆరోగ్యశాఖను పూర్తిస్థాయిలో సంస్కరించాలని, అందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. తక్షణ అవసరాలకు 500 కోట్లు విడుదల చేస్తున్నట్టు చెప్పారు.

15-10-2025 బుధవారం (ఇందిరమ్మ ఇండ్లు జెట్ స్పీడ్)
గత ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల మాదిరి కాకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. జెట్ స్పీడ్ లో ఈ ఇండ్లను నిర్మించేలా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఇండ్లు పూర్తై.. గృహ ప్రవేశాలు కూడా చేశారు. మరో మూడేళ్లలో అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసే దిశగా రేవంత్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు 6 నెలల్లోనే 2,233.21 కోట్ల రూపాయలను రాష్ర్ట ప్రభుత్వం చెల్లించింది. ఈ పథకంలో ఆయా ఇంటి నిర్మాణ పనులను బట్టి ప్రతి సోమవారం నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి నిధులను విడుదల చేస్తున్నారు. ఈ వారం రికార్డు స్థాయిలో 22,305 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు 252.87 కోట్లను ఖాతాల్లో జమ చేసింది హౌసింగ్ కార్పొరేషన్. పథకం ప్రారంభమైన నాటి నుంచి ఒక వారంలో ఇంత పెద్ద మొత్తాన్ని లబ్దిదారులకు రిలీజ్ చేయడం ఇదే తొలిసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం సుమారు 2.18 లక్షల ఇండ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. అందుకే ఈ నిర్మాణాలకు బ్రేకులు లేకుండా జెట్ స్పీడ్ లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటోంది రేవంత్ ప్రభుత్వం.

16-10-2025 గురువారం (క్యాబినెట్ కీలక నిర్ణయాలు)
ఈ నెల 16న కీలకంగా జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయిన సందర్భంగా ఉత్సవాలు నిర్వహించాలని క్యాబినెట్ లో నిర్ణయించారు. వీటికి తోడు ధాన్యం సేకరణకు కొనుగోలు సెంటర్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తూ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. కొత్తగా మూడు వ్యవసాయ కళాశాలలు హుజూర్‌నగర్, కొడంగల్, నిజామాబాద్‌లో ఏర్పాటుకు ఆమోదించారు. స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేసేందుకు క్యాబినెట్ ఓకే చెప్పింది. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి మెట్రో 2A, 2B విస్తరణకు అడ్డంకిగా మారిన మొదటి దశను పీపీపీ మోడ్‌లో నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. ప్రత్యేకంగా కమిటీ వేసింది. మంత్రివర్గ ఉపసంఘం స్టడీ తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. ఇక రాష్ట్రంలో హ్యామ్ మోడ్‌లో మొద‌టి ద‌శ‌లో 5,566 కిలోమీట‌ర్ల రోడ్ల నిర్మాణానికి ఆమోదించారు. వీటితో పాటే కీలక రైలు, రోడ్డు మార్గాలపై నిర్ణయాలు తీసుకున్నారు. మ‌న్ననూర్‌ – శ్రీ‌శైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి మొత్తం ఖర్చులో మూడో వంతు రాష్ట్ర ప్రభుత్వం భ‌రించాలని నిర్ణయించింది.

17-10-2025 శుక్రవారం (వస్తోంది బ్రేక్ ఫాస్ట్ స్కీం)
రాష్ట్రంలో మెరుగైన విద్య అందించడమే లక్ష్యంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు పాలు, బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 17న చేసిన రివ్యూలో అధికారులను ఆదేశించారు. 2026 విద్యా సంవత్సరం జూన్ నుంచి అమలు జరిగేలా ఈ కార్యాచరణ ప్రణాళిక ఉండాలని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లల్లో మెరుగైన వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని, అందుకు తగ్గట్లు ప్రణాళికలు ఉండాలన్నారు. తొలి దశలో ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్‌ ప్రాంతంలో దృష్టి పెట్టాలన్నారు. ప్రతీ ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూళ్లకన్నా మెరుగ్గా ఉండాలని, ప్లే గ్రౌండ్, అవసరమైన తరగతి గదులతోపాటు మంచి వాతావరణం ఉండేలా చూడాలన్నారు సీఎం. మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి విద్యా శాఖ పరిధిలో ఉన్న స్థలాలను గుర్తించాలని సూచించారు. సరైన సౌకర్యాలు లేని పాఠశాలలను దగ్గరలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలకు తరలించాలని చెప్పారు. స్కూళ్ల అభివృద్ధికి నిధులిచ్చే దాతలు, పూర్వ విద్యార్థుల తోడ్పాటు తీసుకోవాలని కోరారు. మౌలిక వసతుల కల్పనలో ఇది సరైన మార్గమని చెప్పారు.

17-10-2025 శుక్రవారం (ఆదివాసీలకు అండ)
రాష్ట్రంలో ఆదివాసీల హక్కులు, అవసరాలు, వారి అభివృద్ధి కోసం రేవంత్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి నిరూపించుకుంది. ప్రధాన మంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌లో తెలంగాణ ఉత్తమ పనితీరు ప్రదర్శించింది. జాతీయ ర్యాంకింగ్‌లో 3వ స్థానంలో నిలిచింది. ముఖ్యంగా గిరిజన వర్గాలకు న్యాయం చేయడం, వారు నివసించే ప్రాంతాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవలి కాలంలో అద్భుతంగా పని చేసి మూడో స్థానంలో నిలిచింది. అక్టోబర్ 17న ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరిగిన ఆది కర్మయోగి జాతీయ సదస్సులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా తెలంగాణ ప్రభుత్వం తరపున సెక్రెటరీ కోఆర్డినేషన్ గౌరవ్ ఉప్పల్ అవార్డును స్వీకరించారు. ఆదికర్మయోగి అభియాన్ లో ఆదిలాబాద్, నల్గొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఉత్తమ ప్రతిభ చూపాయి.

18-10-2025 శనివారం (ఇక చదువులపై తనిఖీలు)
విద్యావ్యవస్థలో సమూల ప్రక్షాళన, పిల్లల్లో బోధనాభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిక్షణ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇదే విషయంపై విద్యాశాఖను స్వయంగా చూస్తున్న సీఎం రేవంత్.. చాలా సార్లు రివ్యూలు చేశారు. ఈ వారం కూడా ప్రత్యేకంగా సమీక్షించారు. ప్రభుత్వ బడుల్లో చదువులు ఎలా సాగుతున్నాయ్ అన్నది చాలా కీలకం. పిల్లలకు ఏమైనా వస్తోందా లేదా.. చెప్పేది అర్థమవుతోందా లేదా.. సరిగా బోధిస్తున్నారా లేదా.. ప్రతిభ చూపిస్తున్నారా లేదా.. ఇలాంటి విషయాలను ఇకపై మానిటర్ చేయబోతోంది ప్రభుత్వం. ప్రతి 100 ప్రభుత్వ స్కూళ్లకు ఒక కమిటీని నియమించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచాలనుకుంటోంది. ప్రైమరీ స్కూల్ స్థాయిలో ఎస్జీటీ, హెచ్ఎం, ప్రాథమికోన్నత పాఠశాలలకు స్కూల్‌ అసిస్టెంట్‌, ఉన్నత పాఠశాలలకు పీజీ హెచ్‌ఎం సంబంధిత కమిటీల బాధ్యతలు చూడనున్నారు. వీరు స్కూళ్లను పర్యవేక్షిస్తూ వాటి స్థితిగతులపై ఎప్పటికప్పుడు డీఈఓకు రిపోర్ట్ అందించాల్సి ఉంటుంది. చదువులు వస్తున్నాయా.. లెక్కలు చేస్తున్నారా.. ఇంగ్లీష్ మాట్లాడుతున్నారా.. గ్రామర్ తెలుస్తోందా ఇలాంటి విషయాపలపై ఆయా కమిటీలు రోజువారీగా నివేదిక రూపొందించాల్సి ఉంటుంది. బోధనలో సమస్య ఉందా.. పిల్లల్లో అభ్యసనా సామర్థ్యాలు సరిగా లేవా ఇలాంటి లోటుపాట్లను గుర్తించి ఉన్నతాధికారులకు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ ప్రక్రియ సర్కార్ స్కూళ్ల పనితీరులో ఓ మైల్ స్టోన్ గా నిలిచే ఛాన్స్ కనిపిస్తోంది. అదే సమయంలో పిల్లలకు మెరుగైన విద్య అందే అవకాశం ఉందంటున్నారు.

Also Report: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో తల్లీకూతుళ్లు మృతి, పలువురికి గాయాలు

18-10-2025 శనివారం (మామునూరుకు మరింత బూస్టప్)
వరంగల్ జిల్లాలో నిర్మించనున్న మామునూరు ఎయిర్‌పోర్టు భూసేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం మరిన్ని నిధులు విడుదల చేసింది. 90 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధికి 280.3 ఎకరాల భూసేకరణకు మొదట నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ ఏడాది జులైలో 205 కోట్లును రిలీజ్ చేశారు. అయితే మరో 90 కోట్లు కేటాయించాలన్న హన్మకొండ జిల్లా కలెక్టర్‌ ప్రతిపాదనలతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా 309 మంది రైతులు, మరో 50 మంది ప్లాట్ల యజమానుల వద్ద ఈ భూమిని సమీకరించనున్నారు. పనులను వేగవంతం చేసేందుకు అధికారులు గ్రామాలవారీగా భూసేకరణ ప్రక్రియ చేపడుతున్నారు. భూ సేకరణతో నష్టపోతున్న రైతులకు ఒక్కో ఎకరానికి కోటి 20 లక్షల చొప్పున చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.

Story By Vidya Sagar, Bigtv

Related News

Bank Holidays: వరుస సెలవులు.. పండుగ వేళ ఐదు రోజులు బ్యాంకులు బంద్!

Hyderabad News: చిట్టీల పేరుతో ఆర్ఎంపీ డాక్టర్ కోట్ల రూపాయల మోసం.. హైదరాబాద్‌లో ఘటన

CM Revanth Reddy: ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. ఇక అలా చేస్తే జీతంలో కోత.. త్వరలో కొత్త చట్టం: సీఎం రేవంత్

Wine Shops Applications: వైన్స్ టెండర్ల జోరు.. 82 మద్యం షాపులకు 3500 అప్లికేషన్స్

Naveen Yadav: జూబ్లీహిల్స్ బైపోల్.. నవీన్ యాదవ్‌కు పెరుగుతున్న గెలుపు అవకాశాలు..? కారణాలివే..!

CM Revanth Reddy: ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవొద్దు.. అధికారులపై సీఎం రేవంత్ ఫైర్

V Hanumantha Rao: బీసీ బిల్లును తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలి.. కేంద్రానికి వీహెచ్ డిమాండ్

Big Stories

×