Diwali First-Aid Guide: దీపావళి వంటి పండగ సమయాల్లో.. ఇల్లంతా దీపాలతో.. టపాసుల వెలుగులతో సందడిగా ఉంటుంది. అయితే.. ఈ ఉత్సవాల వేళ చిన్న చిన్న ప్రమాదాలు, ముఖ్యంగా కాలిన గాయాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి సమయాల్లో వెంటనే స్పందించి సరైన ప్రథమ చికిత్స అందిస్తే,..గాయం తీవ్రతను తగ్గించవచ్చు. అంతే కాకుండా వెలంటనే ఉపశమనం పొందవచ్చు.
తక్షణం చేయాల్సిన పని: 20 నిమిషాల చల్లని నీరు
కాలిన గాయాలకు ప్రథమ చికిత్సలో మొదట చేయాల్సింది చల్లబరచడం. మంట, వేడి కారణంగా కణజాలం మరింత దెబ్బతినకుండా ఆపడానికి ఇది సహాయ పడుతుంది.
గాయాన్ని చల్లబరచండి: వెంటనే కాలిన భాగాన్ని (ఉదాహరణకు, చేతిని) సుమారు 10 నుంచి 20 నిమిషాల పాటు పారుతున్న చల్లని (సాధారణ) నీటి కింద ఉంచండి. కుళాయిని ఇందుకు ఉపయోగించండి.
ఐస్ వద్దు: కాలిన గాయాలపై ఐస్ లేదా ఐస్ వాటర్‌ను నేరుగా ఉపయోగించకూడదు. ఇది చర్మానికి మరింత నష్టం కలిగిస్తుంది.
నగలను తీసివేయండి: గాయం చుట్టూ వాపు రాకముందే ఉంగరాలు, వాచీలు, గట్టిగా ఉండే దుస్తులను తీసివేయండి.
గాయం స్వభావాన్ని గుర్తించండి:
కాలిన గాయాలు వాటి లోతును బట్టి మూడు రకాలుగా ఉంటాయి.
మొదటి డిగ్రీ కాలిన గాయం: చర్మం పై పొర మాత్రమే ఎర్రబడి, తేలిక పాటి నొప్పి ఉంటుంది.
రెండవ డిగ్రీ కాలిన గాయం : చర్మంలో లోతుగా చొచ్చుకుపోయి, బొబ్బలు , వాపు, తీవ్రమైన నొప్పి ఉంటుంది.
మూడవ డిగ్రీ కాలిన గాయం : చర్మం అన్ని పొరలను దెబ్బతీసి, నలుపు లేదా తెలుపు రంగులోకి మారే ప్రమాదం ఉంటుంది. ఈ గాయాలకు డాక్టర్ సహాయం అవసరం.
ప్రథమ చికిత్స (చిన్న గాయాల కోసం):
చల్లటి నీటితో చల్లార్చిన తర్వాత.. చిన్నపాటి కాలిన గాయాలకు ఇలా చేయవచ్చు.
కలబంద వాడకం: చల్లబరచిన గాయంపై తాజా కలబంద గుజ్జు సున్నితంగా రాయండి. అలోవెరాలో నొప్పిని తగ్గించే.. మంటను ఉపశమనం కలిగించే లక్షణాలు ఉంటాయి.
తేనె, కొబ్బరి నూనె: కొబ్బరి నూనె, తేనె వంటి వాటికి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి కూడా గాయంపై ఉపశమనం కలిగిస్తాయి. అయితే.. వీటిని చర్మం పూర్తిగా చల్లబడిన తర్వాతే వాడాలి.
కట్టు కట్టడం: గాయాన్ని గాలికి తగలకుండా.. ఇన్ఫెక్షన్ రాకుండా శుభ్రమైన, అంటుకోని కట్టుతో వదులుగా కట్టండి. కాటన్ నేరుగా గాయంపై పెట్టకూడదు.
బొబ్బలు : బొబ్బలు ఏర్పడితే వాటిని అస్సలు చిదమకూడదు. బొబ్బలు చర్మాన్ని ఇన్ఫెక్షన్ నుంచి రక్షించే సహజ కవచాలు. ఒకవేళ బొబ్బ పగిలితే.. ఆ ప్రాంతాన్ని శుభ్రమైన నీరు, సబ్బుతో కడిగి, యాంటీ బయాటిక్ ఆయింట్‌మెంట్ రాసి కట్టు కట్టాలి.
Also Read: దీపావళి ఎఫెక్ట్, పెరగనున్న కాలుష్యం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
చేయకూడని పనులు:
పసుపు, సిరా, టూత్‌పేస్ట్: కాలిన గాయాలపై పసుపు, సిరా, వెన్న, టూత్‌పేస్ట్ లేదా ఇతర హోం రెమెడీస్ వాడకూడదు. ఇవి గాయాన్ని మరింత తీవ్రతరం చేస్తాయి. అంతే కాకుండా ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతాయి.
బొబ్బలు చిదమకూడదు.
గట్టి కట్టు కట్టకూడదు.
డాక్టర్‌ని ఎప్పుడు సంప్రదించాలి?
ముఖం, కీళ్లు , చేతులు, పాదాలపై కాలిన గాయాలు అయితే. గాయం తీవ్రంగా.. ఉంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.