Jubilee Hills By Poll: హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. తమ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకునేందుకు బీఆర్ఎస్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం పి.జనార్ధన్ రెడ్డి(పీజేఆర్) కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డితో నామినేషన్ వేయించింది. ఇప్పటికే బీఆర్ఎస్ తరఫున దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
అయితే నామినేషన్ తిరస్కరణకు గురైతే ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ముందు జాగ్రత్తగా విష్ణువర్ధన్‌రెడ్డితోనూ నామినేషన్ వేయించింది. బీఆర్ఎస్ ముఖ్యనేతలు నియోజకవర్గం వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో అధికార కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసేందుకు 40 మంది క్యాంపైనర్లతో జాబితా విడుదల చేసింది. ఆ జాబితాలో ముఖ్య నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఈ జాబితాలో ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ వ్యూహాత్మకంగా వ్యవహరించి నవీన్ యాదవ్ ను అభ్యర్థిగా ఖరారు చేశారు. సామాజిక సమీకరణాలతో పాటుగా ఎంఐఎం, టీడీపీ పోటీ చేయకపోవడంతో పరిణామాలు తమకు అనుకూలంగా మారుతాయని కాంగ్రెస్ భావిస్తుంది. కాగా ముగ్గురు మంత్రులకు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్.
మరో వైపు బీఆర్ఎస్ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తుంది. బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు ముఖ్యనేతలంతా ప్రచారంలోకి దిగారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారంలో పాల్గొంటున్నారు. కిషన్ రెడ్డి సన్నిహితుడైన దీపక్ రెడ్డిని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో దీపక్ రెడ్డి గెలుపును కిషన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
Also Read: CM Progress Report: అందరూ మెచ్చేలా.. పిల్లలకు నచ్చేలా.. విద్య శాఖపై సీఎం రేవంత్ ఫోకస్
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. అయితే ఆయన ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యమైంది. మాగంటి గోపీనాథ్ టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. దీంతో టీడీపీ మద్దతుదారులు గోపీనాథ్ కు మద్దతుగా నిలిచారని ప్రచారం జరిగింది. అయితే మారిన సమీకరణలతో టీడీపీ మద్దతుదారులు ఎవరికి సపోర్ట్ చేస్తారో ఆసక్తిగా మారింది.