CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రం విద్యార్థులు, నిరుద్యోగ యువత చేసిన ఆత్మబలిదానాలు, అమరుల త్యాగాల పునాదులపై సాకారమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గ్రూప్-2 నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో పదేళ్లు అధికారం చెలాయించిన గత పాలకులు ఒక్క క్షణం కూడా నిరుద్యోగుల గురించి ఆలోచించలేదని ఆయన విమర్శించారు. వారు అమరుల ఆశయ సాధనపై దృష్టి పెట్టి ఉంటే.. ఈ ఉద్యోగాలు నిరుద్యోగులకు ఎనిమిదేళ్ల క్రితమే లభించేవని అన్నారు.
⦿ మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు
గత పాలకులు తమ కుటుంబంలో పదవులను భర్తీ చేసుకున్నారు.. తప్ప, గ్రూప్- 2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. పదిహేనేళ్లుగా గ్రూప్ -1 ఉద్యోగాల భర్తీ జరగకపోవడం దౌర్భాగ్యమన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేశామని అన్నారు. అలాగే గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించి నేడు నియామక పత్రాలను అందిస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని వెల్లడించారు.
⦿ సోషల్ మీడియాలో బుదర జల్లే ప్రయత్నం..
నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపడానికి తాము సమస్యలను ఎదుర్కొని ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని చెప్పారు. గత పాలకులు ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు కేసులు వేసి, అక్రమ సంపాదనతో ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియా వ్యవస్థతో తమపై బురద జల్లే ప్రయత్నం చేశారని విమర్శించారు. అలాంటి ఏ వ్యవస్థ తమకు లేదని.. ‘మా వ్యవస్థనే మీరు ఆ వ్యవస్థలో మీరే మా కుటుంబ సభ్యులు’ అని ఉద్యోగులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ‘ఇప్పటి వరకు మీరు సామాన్యులు.. ఈ రోజు నుంచి మీరు ఆఫీసర్స్. కొత్త ఉద్యోగులు తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి.. రైజింగ్ తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా పనిచేయాలి. దేశంలోనే తెలంగాణను అభివృద్ధిలో ఆదర్శంగా నిలపాలి’ అని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
ALSO READ: Naveen Yadav: జూబ్లీహిల్స్ బైపోల్.. నవీన్ యాదవ్‌కు పెరుగుతున్న గెలుపు అవకాశాలు..? కారణాలివే..!
⦿ ఇక అలా చేస్తే జీతం కట్.. జాగ్రత్త..?
రక్తం చెమటగా మార్చి మిమ్మల్ని ఇంతవాళ్లను చేసిన తల్లిదండ్రులను మరిచిపోవద్దని వారికి గుర్తు చేశారు. తల్లిదండ్రులను మంచిగా చూసుకోకపోతే వారి జీతంలో కోత విధించి తల్లిదండ్రులకు అందజేస్తామని అన్నారు. ఇందుకోసం త్వరలోనే చట్టం తీసుకొస్తామని వివరించారు. నిస్సహాయులకు సహాయం చేయాలని.. పేదలకు అండగా నిలవాలని కోరారు. హాస్టల్స్‌లో ఫుడ్ పాయిజన్ వంటి ప్రమాద ఘటనలు జరగకుండా చూసుకోవాలని అన్నారు. ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా చూసే బాధ్యత తీసుకోవాలని చెప్పారు. సమర్థవంతంగా పనిచేసి ఆదర్శంగా నిలవాలని గ్రూప్-2 ఉద్యోగులకు సూచించారు.