Property Tax: స్వేచ్ఛ బ్యూరో: వర్తమాన ఆర్థిక సంవత్సరం (2025-26) త్వరలోనే ముగియనుంది. ఈ ఏటా జీహెచ్ఎంసీ టార్గెట్ గా పెట్టుకున్న ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసుకునేందుకు ఏళ్లుగా పేరుకుపోయిన మొండి బకాయిలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. ఈ మేరకు సోమజీ గూడలోని హోటల్ కత్రియాను జీహెచ్ఎంసీ సోమవారం సీజే చేసినట్లు తెలిసింది. ఇదే సమయంలో ప్రాపర్టీ టాక్స్ బకాయిల వసూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
కత్రియా హోటల్ సీజ్
టాప్ డిఫాల్టర్లపై కొరడా ఝుళిపిస్తూ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ట్యాక్స్ కలెక్షన్ కు సంబంధించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఓటీఎస్ స్కీమ్ తుది గడువు ఈ నెలాఖరుతో సమీపిస్తున్నందున చర్యలను వేగవంతం చేశారు. పన్ను బకాయిలు చెల్లించకుండా ఆలస్యం చేస్తున్న ఆస్తులపై జప్తు, సీజ్ చర్యలు చేపడుతున్నారు. సోమాజీగూడలోని కత్రియా హోటల్‌ను జప్తు చేయడం ద్వారా భారీ బకాయిల వసూళ్లకు శ్రీకారం చుట్టారు. 2017 నుంచి రూ. 6.16 కోట్ల పన్ను బకాయిలు ఉండటంతో అధికారులు సీజ్ చేసినట్లు తెలిసింది.
హెచ్చరికలు జారీ
గోషామహల్‌లో స్వర్ణ ట్రాన్స్‌పోర్ట్, బంజారాహిల్స్‌లో క్లాత్ మాల్‌లపై కూడా సీజ్ చర్యలు తీసుకున్నారు. పలుసార్లు నోటీసులు జారీ చేసినా, స్పందించకపోటంతో అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇకపై బకాయిలు చెల్లించని వారిపై మరింత దూకుడుగా చర్యలుంటాయని హెచ్చరికలు జారీ చేశారు. పన్ను బకాయిలు వెంటనే చెల్లించాలని జీహెచ్ఎంసీ నగరవాసులకు, వ్యాపార సంస్థలకు సూచించింది. ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలోని కత్రియా హోటల్‌పై డిప్యూటీ కమిషనర్ వారెంట్ బృందం జప్తు చర్యలు చేపట్టింది.
స్వర్ణ ట్రాన్స్‌పోర్ట్ సంస్థ సీజ్
ఈ హోటల్ 2017 సంవత్సరం నుంచి ఆస్తి పన్ను చెల్లించకుండా మొత్తం రూ. 6.16 కోట్ల మేరకు బకాయిలున్నట్లు అధికారులు వెల్లడించారు. పలు మార్లు నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో చివరకు జప్తు చర్యలకు దిగాల్సి వచ్చిందని అధికారులు వెల్లడించారు. అదే విధంగా గోషామహల్ సర్కిల్‌లో స్వర్ణ ట్రాన్స్‌పోర్ట్ సంస్థను వారెంట్ బృందం సీజ్ చేసింది.
షమీమ్ సుల్తానా క్లాత్ మాల్ సీజ్
ఈ సంస్థపై రూ. 36 లక్షల ఆస్తి పన్ను బకాయిలుండగా, గడువులు ఇచ్చినా చెల్లింపులు జరగకపోవడంతో చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. బంజారా హిల్స్, రోడ్ నం.10లో ఉన్న షమీమ్ సుల్తానా క్లాత్ మాల్‌ను కూడా జూబ్లీ హిల్స్ సర్కిల్ అధికారులు సీజ్ చేశారు. ఈ మాల్‌పై రూ. 35.27 లక్షల పన్ను బకాయిలు ఉన్నట్లు గుర్తించారు. నగరంలో ఇంకా పలువురు పెద్ద మొత్తంలో ఆస్తి పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉందని, వీరిపై కూడా త్వరలోనే ఇదే తరహా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.
31లోపు పన్నులు క్లియర్ చేయండి
ఈ నెలాఖరుతో ముగియనున్న గడువు వర్తమాన ఆర్థిక సంవత్సరం ట్యాక్స్ బకాయిలు, పేరుకుపోయిన మొండి బకాయిలను 90 శాతం వడ్డీ రాయితీతో చెల్లించేందుకు గడువు ఈ నెలాఖరు 31వ తేదీతో ముగియనుంది. ఓటీఎస్ స్కీమ్ ద్వారా పన్ను బకాయిలను తగ్గింపు సదుపాయంతో చెల్లించుకునే అవకాశం ఉన్నప్పటికీ, దానిని బకాయిదారులు సద్వినియోగం చేసుకోకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో గడువు ముగిసేలోపు బకాయిలను క్లియర్ చేసుకోవాలని జీహెచ్ఎంసీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. పన్ను చెల్లింపు నగరాభివృద్ధికి ముఖ్యమని అధికారులు గుర్తు చేస్తున్నారు.
జీహెచ్ఎంసీ హెచ్చరిక
రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ఈ ఆదాయం కీలకమని పేర్కొన్నారు. ఇకపై పన్ను ఎగవేతకు తావులేకుండా కఠిన చర్యలు కొనసాగుతాయని, అవసరమైతే మరిన్ని ఆస్తులను జప్తు చేయడం, సీజ్ చేయడం వంటి చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. పన్ను బకాయిలున్న వారు వెంటనే చెల్లించాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. 31 వ తేదీ వరకు అమల్లోనుండనున్న వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్ ) స్కీమ్ ద్వారా వడ్డీపై 90 శాతం రాయితీ లభిస్తుందని ఈలోగా బకాయిలు చెల్లించాలని కమిషనర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు.
Also Read:ORR పై డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ తప్పులు చేస్తే ఇక అంతే సంగతులు!