GHMC Property Tax: దేశంలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పడిన జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరుల్లో ఒకటైన ప్రాపర్టీ ట్యాక్స్ (GHMC Property Tax) కలెక్షన్ పై ఉన్నతాధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. వర్తమాన ఆర్థిక సంవత్సరం చివరి రోజు కల్లా నిర్ణీత టార్గెట్ రూ. 3 వేల కోట్లు వసూలు చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. వర్తమాన ఆర్థిక సంవత్సరం (2026-27) నకు సంబంధించి ఇప్పటి వరకు రూ. 1963 కోట్లు వసూలు చేయగా, లక్ష్యం చేరుకునేందుకు ఇంకా మిగిలి ఉన్న రూ. 1037 కోట్లను మార్చి నెలాఖరు కల్లా ఎట్టి పరిస్థితుల్లో వసూలు చేసుకునేందుకు అధికారులు వ్యూహాన్ని సిద్దం చేశారు.
ఇందుకు సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధిత సమస్యల పరిష్కారానికి మార్చి నెలాఖరు వరకు వచ్చే సెలవు రోజుల్లో ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం పేరిట ప్రత్యేక కార్యక్రమాల్ని కూడా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ సిద్దమైంది. గత సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఎర్లీ బర్డ్ స్కీమ్ కలెక్షన్ ను కలుుకుని ఇప్పటి వరకు రూ. 1963 కోట్ల మేరకు ప్రాపర్టీ ట్యాక్స్ ను వసూలు చేసుకున్న జీహెచ్ఎంసీ గత ఆర్థిక సంవత్సరం (2025-26) లో ఇదే తేదీ నాటికి పోల్చుకుంటే రూ.210 కోట్లను అధికంగా వసూలు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ కు సంబంధించి పెద్ద మొత్తంలో బకాయి పడ్డ ఆస్తులను గుర్తించి, త్వరలోనే రెడ్ నోటీసులు కూడా జారీ చేయనున్నారు. కరెంట్ ఈయర్ బకాయిలకు సంబంధించి ప్రతి ఏటా సక్రమంగా చెల్లించే బకాయిదారులను ట్యాక్స్ స్టాఫ్ నేరుగా కలిసి వసూలు చేసేలా ఆదేశాలిచ్చినట్లు తెలిసింది.
ముఖ్యంగా దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న మొండి బకాయిల వసూళ్ల కోసం ఈ సారి కాస్త ముందుగానే వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్) ను అమల్లోకి తీసుకువచ్చిన జీహెచ్ఎంసీ మొండి బకాయిల వసూళ్లపై కూడా స్పెషల్ వ్యూహాన్ని సిద్దం చేసినట్లు సమాచారం. ఏళ్ల తరబడి భారీ మొత్తంలో పెండింగ్ లో ఉన్న మొత్తం బకాయిలను వివరించి, ఓటీఎస్ ద్వారా వారికి కలిగే ప్రయోజనాన్ని నేరుగా కలిసి వివరించాలని ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
ముఖ్యంగా ఓటీఎస్ స్కీమ్ కింద మొండి బకాయిలు చెల్లించే వారికి ఇప్పటి వరకు విధించిన వడ్డీలో 90 శాతాన్ని మాఫీ చేస్తున్న విషయాన్ని యజమానులకు వివరించి, వారు ట్యాక్స్ చెల్లించేలా మేనేజ్ చేయాలని స్టాఫ్ కు ఆదేశాలు జారీ చేశారు. వర్తమాన ఆర్థిక సంవత్సరం (2025-26) లో ఇప్పటి వరకు రూ. 1963 కోట్లను అధికారులు వసూలు చేసుకోగా, రానున్న ఫిబ్రవరి, మార్చి నెలాఖరులోకా రూ. 1037 కోట్లను వసూలు చేసుకునేందుకు స్కెచ్ సిద్దం చేసిన అధికారులు ఫిబ్రవరి మాసంలో రూ. 500 కోట్లు, ఆ తర్వాత చివరి మాసమైన మార్చి నెలాఖరుకల్లా మరో రూ. 500 కోట్లను వసూలు చేసుకునేందుకు ప్రయత్నాలను ప్రారంభించారు. కానీ టార్గెట్ ను చేరుకునేందుకు కావల్సిన రూ. 1037 కోట్లలో సింహాభాగం మార్చి నెల చివరి పక్షం రోజుల్లో వసూలయ్యే అవకాశాలున్నాయి.
జీహెచ్ఎంసీలోకి 27 పట్టణ స్థానిక సంస్థల విలీనానికి ముందు ట్యాక్స్ చెల్లించే ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నెంబర్ (పీటీఐఎన్) లు సుమారు 19.50 లక్షల వరకు దాదాపు 345 పై చిలుకు డాకెట్లలో ఉండేవి. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ లోని 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం తర్వాత పీటీఐఎన్ లు దాదాపు 28 లక్షల నుంచి 29 లక్షల వరకు పెరిగినట్లు సమాచారం. పాత 345 పై చిలుకు డాకెట్లకు అదనంగా మరో 254 డాకెట్లు పెరిగాయి. జీహెచ్ఎంసీ ఆస్తు పన్నువివరాలతో కూడిన డాకెట్లు అదనంగా రూ. 254 వరకు పెరిగినట్లు తెలిసింది.
విలీనానికి ముందు ట్యాక్స్ ను క్షేత్ర స్థాయిలో వసూలు చేసేందుకు 145 మంది ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు, మరో 300 మంది బిల్ కలెక్టర్లుండగా, విలీనం తర్వాత అదనంగా 254 మంది ఇన్ ఛార్జి బిల్ కలెక్టర్లు వచ్చారు. వీరితో ట్యాక్స్ స్టాఫ్ సంఖ్య 599కు పెరిగింది. డాకెట్ల విభజన, ఇన్ ఛార్జి బిల్ కలెక్టర్ల నియామకాలు ఇటీవలే పూర్తి కావటంతో వారికి హ్యాండ్ హెల్డ్ మిషన్ల పంపిణీ ప్రక్రియను కొనసాగిస్తున్న జీహెచ్ఎంసీ వారికి కూడా ప్రత్యేకంగా వసూళ్ల టార్గెట్లు విధించినట్లు సమాచారం. ట్యాక్స్ కలెక్షన్ పెంచుకునేందుకు జీహెచ్ఎంసీ ఇటీవలే మరో నిర్ణయం కూడా తీసుకుంది.
ప్రాపర్టీ ట్యాక్స్ కు సంబంధించిన వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించి, పన్ను వసూలు చేసుకునేందుకు వీలుగా ప్రాపర్టీ ట్యాక్స్ కు సంబంధించి రెండున్నరేళ్ల లోపు ఏలాంటి వివాదాలున్నా, ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం కార్యక్రమంలో అధికారులు పరిష్కరించే వారు. రెండున్నరేళ్లు దాటిన వివాదాల పరిష్కారం కోసం బకాయిదారుల తప్పకుండా కమిషనర్ ఆమోదం తీసుకోవాలన్న నిబంధన ఉండేది. కానీ కమిషనర్ కర్ణన్ ఆ నిబంధనను సవరిస్తూ రెండున్నరేళ్ల లోపున్న ప్రాపర్టీ ట్యాక్స్ వివాదాన్ని పరిష్కరించే పవర్ డిప్యూటీ కమిషనర్ కు, అంతకన్నా ఎక్కువ కాలం ఉన్న వివాదాన్ని పరిష్కరించే పవర్ జోనల్ కమిషనర్లకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.