GHMC: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ లోని సుమారు కోటిన్నర మంది జనాభాలో అత్యధిక మందికి పౌర, అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీ లో ఇటీవలే వెలుగుచూసిన ఫేక్ బర్త్, డెత్ సర్టిఫికెట్లకు అధికారులు శాశ్వతంగా చెక్ పెట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సివిలియన్స్ రిజిస్ట్రేన్ సిస్టమ్ (సీఆర్ఎస్) పరిధిలోకి ఈ సర్టిఫికెట్ల జారీని తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా కొద్ది సంవత్సరాల క్రితం పాత జీహెచ్ఎంసీ పరిధిలో మూడు నెలల్లో అత్యధిక బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ కావటంతో అనుమానం వచ్చిన ఉన్నతాధికారులు దీనిపై విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించగా, కొన్ని హాస్పిటల్స్ లో అక్రమంగా బర్త్, డెత్ సర్టిఫికెట్ల వివరాలు నమోదై, ఆ తర్వాత సరైన ఫీల్డు ఎంక్వైరీ చేయకుండా సిబ్బంది సర్టిఫికెట్లు జారీ చేసినట్లు గుర్తించిన అధికారులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు వీలుగా అధికారులు శాశ్వత పరిష్కారాన్ని అన్వేషించగా, ఇప్పటికే 16 దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని మహానగరాల్లో బర్త్, డెత్ సర్టిఫికెట్లు సీఆర్ఎస్ ద్వారానే జారీ చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు.
ఇదే విధానాన్ని జీహెచ్ఎంసీలో అమలు చేయాలని కోరుతూ గతంలో పలు సార్లు జీహెచ్ఎంసీ అధికారులు కేంద్ర ప్రభుత్వ సీఆర్ఎస్ వింగ్ అధికారులతో జూమ్ మీటింగ్ ను కూడా నిర్వహించారు. కానీ పాత జీహెచ్ఎంసీ పరిధిలో కోర్ సిటీ అయిన 16 మండలాల హైదరాబాద్ లోని ప్రాంతాలకు బర్త్, డెత్ సర్టిఫికెట్లను మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేస్తుండగా, మిగిలిన శివారు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్లు ఈ సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు. జిల్లా నుంచి స్థానిక సంస్థ గానీ, జిల్లాలో సర్టిఫికెట్లు జారీ చేసే వారిలో ఏ ఒక్క అధికారిని మాత్రమే ఈ యాప్ లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వ సీఆర్ఎస్ అధికారులను సూచించారు. దీంతో హైదరాబాద్ పట్టణ, శివారు ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాలు మిక్స్ అయి ఉండటంతో ఎవర్నీ సర్టిఫికెట్లు జారీ చేసే అధికారిగా చేర్చాలోనన్న అంశంపై అయోమయం నెలకొంది. దీంతో ఈ సమస్యను గుర్తించిన కేంద్ర సీఆర్ఎస్ అధికారులు మున్ముందు కూడా ఈ సమస్య తలెత్తకుండా తమ పోర్టల్ లోనే పట్టణ, గ్రామీణ ప్రాంతాలను జారీ చేసే అధికారిగా పొందుపరిచేలా మార్పులు చేసుకున్నట్లు సమాచారం.
Also Read: CM Revanth Reddy: 2028లో కాదు.. 2029లో అసెంబ్లీ ఎన్నికలు, హస్తినలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం కోర్ అర్బన్ రీజియన్ లోని జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధి (క్యూర్ ) సిటీలో బర్త్, డెత్ సర్టిఫికెట్లను రెండు సిస్టమ్ ల ద్వారా జారీ చేస్తున్నారు. పాత జీహెచ్ఎంసీలోని 30 సర్కిళ్లలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) పోర్టల్ ద్వారా బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. గత సంవత్సరం నవంబర్ 25వ తేదీ తర్వాత జీహెచ్ఎంసీలో విలీనమైన కోర్ అర్బన్ రీజియన్ లోని 27 పట్టణ స్థానిక సంస్థల్లో నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఎన్ఐసీ) ద్వారా జారీ చేస్తున్నారు. గత నెల 11వ తేదీన జీహెచ్ఎంసీ మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటైన తర్వాత 27 పట్టణ స్థానిక సంస్థలు కూడా మూడు కార్పొరేషన్లలోకి వెళ్లిపోయాయి. దీంతో ఇప్పటికే మూడు కార్పొరేషన్లలో రెండు సిస్టమ్ ల ద్వారా బర్త్, డెత్ సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు. ఈ విధానాన్ని స్వస్తి పలికి యూనిఫామ్ పోర్టల్ వేధికగా బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు జీహెచ్ఎంసీ సిద్దమైంది. ఇప్పటికే ఈ రెండు విధానాలను రీ మ్యాపింగ్ చేసిన అధికారులు త్వరలోనే కేంద్ర ప్రభుత్వ సీఆర్ఎస్ పోర్టల్ లో పొందుపర్చనున్నట్లు, ఈ కసరత్తు తుది దశలో ఉన్నట్లు, వచ్చే నెల రెండో వారం నుంచి సీఆర్ఎస్ ద్వారానే బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ సోమవారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సీఆర్ఎస్ తో 16 అంకెల యూనిక్ నెంబర్ తో బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ చేసిన తర్వాత దేశంలో సీఆర్ఎస్ అమల్లో ఉన్న నగరాల్లో నుంచి వీటిని పొందే అవకాశం ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు.