Municipal corporation : తెలంగాణలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పాలక మండళ్ల పదవీ కాలం జనవరి 26తో ముగిసింది. దీంతో.. ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారుల్ని నియమిస్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో.. జనవరి 27 నుంచి వీటిలో ప్రత్యేక అధికారుల పరిపాలనలోకి వెళ్లనున్నాయి.
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఈ వివరాల్ని వెల్లడించింది. దీని ప్రకారం..2020లో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు. వాటి పదవీ కాలమైన ఐదేళ్లు పూర్తయ్యింది. వాస్తవానికి ఐదేళ్ల పదవీ కాలం ముగియడానికి ముందే స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించి, నూతన పాలక వర్గాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ వివిధ కారణాలతో ప్రభుత్వ ఇప్పటి వరకు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించలేదు. దాంతో.. ఆయా పాలక వర్గాల స్థానాల్లో ప్రత్యేక అధికారుల్ని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు.. జనవరి 26తో 129 మున్సిపాలిటీలకు పదవీ కాలం ముగిసింది. రెండు రోజుల తర్వాత అంటే 28 జనవరి నాటికి కరీంనగర్ కార్పొరేషన్ పాలక వర్గం పదవీ కాలం ముగిసిపోనుంది. ప్రస్తుతానికి వీటి పరిపాలనను ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలోకి వెళ్లనుండగా, కొత్త పాలక మండళ్లు ఏర్పడే వరకు వీరు నేతృత్వం వహించనున్నారు. ఇందుకోసం.. 128 మంది ప్రత్యేక అధికారుల్ని ప్రభుత్వం ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించింది. కాగా.. నర్సాపూర్ మున్సిపాలిటీని మంచిర్యాల, కొత్తపల్లి మున్సిపాలిటీని కరీంనగర్ మున్సిపాలిటీలో విలీనం చేయడం ద్వారా రెండు స్థానాలు తగ్గిపోయినట్లు వెల్లడించింది.