 
					Jubilee Hills: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జూబ్లిహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున యూసుఫ్‌గూడ నుండి వెంగళ్‌రావు నగర్ వరకు జరిగిన భారీ రోడ్ షోలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనకు అండగా నిలిచిన వేలాది మంది కార్యకర్తలకు, మద్దతు తెలిపిన మహిళలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈసారి జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ ‘సెంటిమెంట్’ పేరుతో ఓట్లు అడగడాన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. “2007లో పేదల దేవుడు, ఖైరతాబాద్ శాసనసభ్యుడు పి.జనార్ధన్ రెడ్డి (పీజేఆర్) అకాల మరణం చెందినప్పుడు, కాంగ్రెస్‌కు బద్ధ శత్రువులైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ నేతలు సైతం రాజకీయ వైరాన్ని పక్కనపెట్టి పీజేఆర్ కుటుంబానికి గౌరవంగా ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయడానికి సహకరించారు. కానీ ఆనాడు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆ మంచి సంప్రదాయాన్ని తుంగలో తొక్కి, పీజేఆర్ కుటుంబంపై అభ్యర్థిని నిలబెట్టి దుష్ట సంప్రదాయానికి తెరలేపింది వాస్తవం కాదా?” అని రేవంత్ రెడ్డి నిలదీశారు. ఆనాటి ప్రత్యక్ష సాక్షి, పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి ఇక్కడే ఉన్నారని గుర్తుచేశారు. పేదల దేవుడైన పీజేఆర్ కుటుంబాన్నే అవమానించిన బీఆర్ఎస్‌కు ఈరోజు సానుభూతి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని ఆయన విమర్శించారు.
ఈ ఉప ఎన్నిక సెంటిమెంట్‌కు, అభివృద్ధికి మధ్య జరుగుతున్న పోరాటమని సీఎం అభివర్ణించారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికను ఆయన ఉదాహరణగా చూపారు. “అక్కడ కూడా బీఆర్ఎస్ సానుభూతిని నమ్ముకుంది, కానీ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు. శ్రీ గణేష్‌ను గెలిపిస్తే, కేవలం కొద్ది నెలల్లోనే 4000 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించి, 30-40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మేడ్చల్, షామీర్‌పేట ఎలివేటెడ్ కారిడార్ పనులను, తాగునీటి, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తున్నాడు” అని తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రజలు కూడా అభివృద్ధిని కోరుకోవాలని పిలుపునిచ్చారు.
గతంలో 2014, 2018, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపించినా జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం ఒరిగిందని సీఎం ప్రశ్నించారు. “ఆనాడు ఎమ్మెల్యే వారిదే, మున్సిపల్ మంత్రి వారిదే, ముఖ్యమంత్రి వారిదే. అయినా మీ ప్రాంత సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదు? ఆనాటి మంత్రులు, ముఖ్యమంత్రి ఎప్పుడైనా మీ బస్తీలకు వచ్చారా? ఇక్కడి సినిమా కార్మికుల సమస్యలను పట్టించుకున్నారా? వెంగళ్‌రావు నగర్ బస్తీలోని ఇళ్లపై నుంచి వెళ్తున్న హై-టెన్షన్ వైర్లను తొలగించాలని మూడుసార్లు గెలిచిన ఎమ్మెల్యే ఒక్కరోజైనా అసెంబ్లీలో మాట్లాడారా?” అని ఆయన నిలదీశారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీలపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. “హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తుంటే, మెట్రో రైలు విస్తరణకు, మూసీ నది అభివృద్ధికి కిషన్ రెడ్డి అడ్డం పడుతున్నారు. రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే భయంతో బీఆర్ఎస్‌తో కుమ్మక్కై అభివృద్ధిని అడ్డుకుంటున్నారు” అని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎనిమిది స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయి, తన ఓట్లను బీజేపీకి బదిలీ చేసి గెలిపించిందని, ఇది వారి ‘రహస్య బంధానికి’ నిదర్శనమన్నారు. “రెండుసార్లు మంత్రిగా, ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్రం నుంచి ‘బుడ్డ పైసా’ అయినా తెచ్చారా?” అని ప్రశ్నించారు. ఉప ఎన్నికల కోసం బీజేపీ ‘కార్పెట్ బాంబింగ్’ (కేంద్ర మంత్రులను దించడం) చేస్తుందన్న వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తూ, “జూబ్లీహిల్స్‌పై బాంబులు వేస్తారా? అభివృద్ధి చేయాలనుకోవాలి కానీ, విధ్వంసం కాదు” అని అన్నారు.
మోడీ, కేసీఆర్ పాలనలో పేదలకు రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత కరెంట్, సన్న బియ్యం అందలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్యారెంటీలను అమలు చేస్తోందని సీఎం అన్నారు. ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి, “మా ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తూ, ఇంటాయన ముందు చేయి చాపకుండా పనులు చేసుకుంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ఈ పథకాన్ని బంద్ పెట్టించాలని చూస్తున్నారు” అని ఆరోపించారు. “బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే, మీ పిల్లలకు అందుతున్న సన్న బియ్యం, ఉచిత కరెంట్, రేషన్ కార్డులు, ఉచిత బస్సు ప్రయాణం అన్నీ రద్దయిపోతాయి” అని హెచ్చరించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, పేదల కోసం పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. “జూబ్లీహిల్స్‌కు సెంటిమెంట్ కాదు, అభివృద్ధి కావాలి. చదువుకున్న యువకుడు, మీ బిడ్డ నవీన్ యాదవ్ ను గెలిపించండి. అతను అసెంబ్లీలో మీ గొంతుక అవుతాడు. మీ సమస్యల కోసం పోరాడుతాడు. ప్రభుత్వాన్ని నిలదీసి మీ పనులు చేయిస్తాడు” అని పిలుపునిచ్చారు. రెండు నెలల్లో మంత్రులు తిరిగి వచ్చి అభివృద్ధి పనులపై సమీక్ష చేస్తారని హామీ ఇచ్చారు.