
BRS vs BJP in Karimnagar(Today breaking news in Telangana):
బండి సంజయ్. ఈ పేరే ఇప్పుడో బ్రాండ్. బీజేపీ ఫైర్‌బ్రాండ్ లీడర్. ఆయనకు అంతటి ఫేమ్ తీసుకొచ్చి పెట్టింది బీజేపీ అధ్యక్ష పదవి. అయితే, అంతకు ముందు ఏళ్ల తరబడి కార్పొరేటర్‌గానే ఉన్నారు. జిల్లా స్థాయి నేతకే పరిమితమయ్యారు. అలాంటిది, అసెంబ్లీ బరిలో ఓడి.. కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి గెలిచి.. ఒక్కసారిగా కింగ్ అయ్యారు. అందుకే, గత పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పోరు బీజేపీకి కీ టర్న్‌గా చెబుతుంటారు.
బండి సంజయ్ చేతిలో ఓడిపోయింది మరెవరో కాదు. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు, సామాజిక వర్గ సహచరుడు, సుప్రీంకోర్టు మాజీ లాయర్ బోయిన్‌పల్లి వినోద్ కుమార్. అప్పటి సిట్టింగ్ ఎంపీ వినోద్‌ను ఓడించి.. కేసీఆర్‌కు ఖతర్నాక్ షాక్ ఇచ్చారు బండి సంజయ్. ఆయన గెలుపుతో తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ రాకెట్‌లా దూసుకుపోయింది. ఆ ఎన్నికల్లో ఎంపీగా వినోద్ కుమార్ ఓడిపోవడం పరోక్షంగా కారు పార్టీకి తీరని డ్యామేజ్ చేసింది.
అయితే, సామాజికవర్గంగా జిల్లాలో బలమైన నేతగా ఉన్న వినోద్ కుమార్‌ను సొంతపార్టీ నేతలే ఓడించారని అంటారు. ఆయన గెలిస్తే.. జిల్లాలో ఇక వేరే లీడర్‌కు పరపతి లేకుండా పోతుందని.. అంతా వినోద్ హవానే నడుస్తుందని కొందరు బీఆర్ఎస్ నేతలు భయపడ్డారు. వారంతా ఎన్నికల్లో వినోద్‌కుమార్‌కు వెన్నుపోటు పొడిచారని.. అందుకే ఆయన ఓడిపోయారని అన్నారు. ఇదే విషయాన్ని ఇప్పుడు మాజీ ఎంపీ వినోద్‌కుమార్ మరోసారి బహిరంగంగానే ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది.
ఈసారి మళ్లీ కరీంనగర్ ఎంపీ సీటుపైనే గురిపెట్టారు తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్. తాజాగా, పార్టీ మీటింగ్‌లో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో తన ఓటమికి బీఆర్ఎస్ నేతలే కారణం అన్నారు. బీఆర్ఎస్ నేతలు మౌనంగా ఉండడం వల్లే ఓడిపోయానని చెప్పారు. బండి సంజయ్ మాటలకు జిల్లా పార్టీ నేతలు కౌంటర్ ఇవ్వలేదన్నారు. ఇది నిజమా? కాదా? అని నేతలు, కార్యకర్తల్ని ప్రశ్నించారు. ఛాలెంజ్ చేస్తున్నా.. తప్పు మాట్లాడితే చెప్పండి? అంటూ వినోద్‌కుమార్ నిలదీశారు.
వినోద్ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ గ్రూప్ పాలిటిక్స్‌పై మరోసారి చర్చ జరుగుతోంది. ఇప్పటికే మెజార్టీ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించగా.. అనేక చోట్ల కుమ్ములాటలు బయటపడుతున్నాయి. కరీంనగర్ మాదిరిగానే ఈసారి తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ అభ్యర్థులను సొంత పార్టీ నేతలే ఓడిస్తారంటూ ప్రచారం జరుగుతుండటం గులాబీ బాస్‌ను కలవరపెట్టే విషయమే. కరీంనగర్ ఎంపీ పోరులో మరోసారి బండి వర్సెస్ బోయిన్‌పల్లి ఫేస్ టు ఫేస్ తలబడితే..? ఈసారి ఫలితం ఏ పార్టీ భవిష్యత్తును మార్చేస్తుందో? చూడాలి.