Harishrao: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఒక దిశా నిర్దేశం లేకుండా ముగిశాయని ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు. ఆరు గ్యారెంటీలపై స్పష్టత వస్తుందని, ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశించిన ప్రజలకు తీవ్ర నిరాశ మిగిలిందన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియా ముందుకొచ్చారు.
అసెంబ్లీ సమావేశాలు ముగింపుపై బీఆర్ఎస్ హాట్ కామెంట్స్
బడ్జెట్, బిల్లులు ఆమోదానికి తూతూ మంత్రంగా సభను నడిపారని విమర్శించారు. నిజమైన ప్రజా సమస్యలు చర్చించడానికి ప్రభుత్వం ముందుకు రాలేదని వాపోయారు. ప్రజలు ఎదుర్కొంటున్న 19 సమస్యలపై చిన్నపాటి చర్చ కోసం బీఆర్ఎస్ తరపున నోటీసులు ఇచ్చినా, ఏ అంశంపైనా చర్చ పెట్టలేదన్నారు. ప్రభుత్వం చేసిన మంచి పనులు చెప్పుకోవడానికి ఒక్క ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం కూడా లేదన్నారు.
సభా సాంప్రదాయాలను పూర్తిగా తిలోదకాలు ఇచ్చారన్నారు. సభా మర్యాదలను, నియమ నిబంధనలను తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలకు కనీస గౌరవం ఇవ్వలేదన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు సీఎం రేవంత్‌రెడ్డి సూటిగా సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారని ఎద్దేవా చేశారు. సభలో ఆయన ప్రవర్తించిన తీరు సభా నాయకుడి హోదాకు తగినదిగా లేదన్నారు.
ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగడం తప్ప మరేమీ లేదు-హరీష్‌రావు
ప్రభుత్వం డిఫెన్స్‌లో పడినప్పుడల్లా ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగడం తప్ప మరేమీ లేదన్నారు. ప్రజల పక్షాన ప్రశ్నించడానికి ప్రతిపక్షం ఉందని, ఆ బాధ్యతను బీఆర్ఎస్ నిర్వహిస్తుంటే కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేక పోతోందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రశ్నించడమే ప్రతిపక్ష బాధ్యత అని గుర్తు చేశారు.
బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు ప్రశ్నోత్తరాల సమయం ఉంటుందని, ప్రభుత్వం దాన్ని ఎత్తి వేసిందన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం రోజు ఆర్థికమంత్రి బడ్జెట్‌లో పెట్టిన రోజు ప్రశ్నోత్తరాలు లేవన్నారు. సభ జరిగిన రోజుల్లో సగం ప్రశ్నోత్తరాలు నడపలేదని, అడిగిన ప్రశ్నలు చర్చకు రాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో టీ బ్రేక్ 10 నిమిషాలు, లంచ్ బ్రేక్ అరగంట ఉంటుందన్నారు. సమావేశాల కోసం ఆర్థికమంత్రి ప్రిపేర్ అవుతున్నాడని మూడు గంటలపాటు సభను ఆపారని అన్నారు. ప్రిపరేషన్ ఇంట్లో చేసుకోవాలి కానీ సభకు వచ్చాక చేస్తారా అంటూ ప్రశ్నించారు. అసెంబ్లీ పని దినాలు రోజు రోజుకూ తగ్గిపోతున్నాయని, మరో వారం సభా సమావేశాలు పొడిగించాలని కోరినా ప్రభుత్వం ముందుకు రాలేదు.
ALSO READ: రాజకీయాల్లోకి జీవన్ రెడ్డి కోడలు చరిష్మారెడ్డి.. రాజీనామా వెనుక పెద్ద ప్లానే..!
కేరళ ఎన్నికల ప్రచారం కోసం అసెంబ్లీని 30న హడావుడిగా ముగించారని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు ముఖ్యమా? లేక కేరళ ఎన్నికల ప్రచారం ముఖ్యమా? అంటూ ప్రశ్నలు సంధించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవినీతిని సాక్ష్యాధారాలతో సభలో బయట పెడితే, ప్రజల దృష్టి మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడ్డారని ఆరోపించారు.
మంత్రిని కాపాడటానికే ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రెండు రోజుల పాటు సస్పెండ్ చేశారని, ప్రతిపక్షం లేకుండానే ముఖ్యమైన బిల్లులను ఆమోదించారని ఆందోళన వ్యక్తం చేశారు. హేట్ స్పీచ్ బిల్లును చివరి రోజు తెచ్చి ఎలాంటి చర్చ లేకుండానే ముగించారని అన్నారు. పద్దులన్నీ లాస్ట్ రోజు పెట్టారని, ఇరిగేషన్ పద్దు మీద కనీసం చర్చ లేకుండా పాస్ చేసుకున్నారని తెలియజేశారు.
కృష్ణా-గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చిద్దామని అడిగితే ముఖ్యమంత్రి పారిపోయారని అన్నారు హరీష్‌రావు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కేవలం 16 వేల ఉద్యోగాలని, సభకు ఇచ్చిన సమాధానంతో స్పష్టమైందన్నారు. గడిచిన రెండున్నర సంవత్సరాల్లో బీసీ కార్పొరేషన్‌కు ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులపై బహిర్గతం చేశామన్నారు.
కాళేశ్వరంపై పార్లమెంట్‌లో కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలను మా పార్టీ తీవ్రంగా ఖండించిందన్నారు. ఆయన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి మాదిరిగానే ఉన్నాయన్నారు. బీఆర్ఎస్‌పై బురద జల్లేందుకు కాంగ్రెస్-బీజేపీల ఫెవికాల్ బంధం బయటపడిందన్నారు.