Harish Rao vs Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈరోజు ఆయన నోటి నుంచి టీఎంసీల కొద్దీ అబద్దాలు, క్యూసెక్కుల కొద్దీ అజ్ఞానం బయటకు వచ్చాయి అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు.
అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరో చెప్పాల్సిన అవసరం లేదని, అబద్దాలకు కూడా ఆస్కార్ అవార్డు ఇచ్చే పరిస్థితి వస్తే అంతర్జాతీయంగా ఏకగ్రీవంగా రేవంత్ రెడ్డినే ఎంపిక చేస్తారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బేసిన్లపై కనీస ప్రాథమిక అవగాహన కూడా ముఖ్యమంత్రికి లేదన్న విషయం ఇప్పటికే బహిరంగ సత్యమని, తాజాగా బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేష్ ట్రిబ్యునల్ మధ్య తేడా కూడా తెలియదని రుజువైందని విమర్శించారు.
కీర్తిశేషులైన బచావత్ ఏ లోకంలో ఉన్నారో కానీ, ముఖ్యమంత్రిగా మీరు ప్రదర్శిస్తున్న అజ్ఞానాన్ని చూసి ఎంత బాధపడుతున్నారో అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించడమే రేవంత్ రెడ్డి రాజకీయ నైజమని ఎద్దేవా చేశారు.
అసెంబ్లీకి వస్తే కేసీఆర్‌ను అవమానించమని ఒకవైపు చెప్పి, అదే ప్రెస్ మీట్‌లో కేసీఆర్‌ను కసబ్‌తో పోల్చడం ఏ రకమైన సంస్కారమని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించి, నాలుగు కోట్ల ప్రజలను ఏకం చేసి, నిరాహార దీక్షతో కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహనీయుడిని కసబ్‌తో పోల్చడం నీచాతినీచమని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ గారిని, తనను ఉరి తీయాలని, రాళ్లతో కొట్టాలని అనాగరిక వ్యాఖ్యలు చేసిన వ్యక్తి మళ్లీ మర్యాద గురించి మాట్లాడటం.. ఆవు తోలు కప్పుకున్న తోడేలు ప్రవర్తన అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలవరం, నల్లమల సాగర్ అంశాలపై తాను వేసిన ప్రశ్నలకు సీఎం సూటిగా సమాధానం ఇవ్వలేదని విమర్శించారు.
గోదావరి బనకచర్లపై నిజంగా సుప్రీంకోర్టులో పోరాడతామని చెప్పిన రేవంత్ రెడ్డి, ఢిల్లీకి వెళ్లి మీటింగ్ ఎందుకు పెట్టారని, కమిటీ ఎందుకు వేశారని ప్రశ్నించారు. కమిటీ ఏర్పాటు అంటేనే ఏపీ జలదోపిడికి తలుపులు తెరవడమేనని, ఇది మెదడున్న ఎవరికైనా అర్థమవుతుందని అన్నారు.
కృష్ణా జలాల్లో 763 టీఎంసీలు తాము అడుగుతున్నామని చెప్పుతూ, కేసీఆర్ 299 టీఎంసీలకు ఒప్పుకున్నారని అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. కేసీఆర్ 299 టీఎంసీలకు ఒప్పుకున్నారని నిజమైతే, రాష్ట్రం ఏర్పడిన 42 రోజుల్లోనే 811 టీఎంసీల పునఃపంపిణీ కోసం కేంద్రానికి లేఖ ఎందుకు రాశారని ప్రశ్నించారు.
ఈరోజు తెలంగాణకు 71 శాతం వాటా రావాలని రేవంత్ మాట్లాడుతున్నారని, కానీ ఆనాడే కేసీఆర్ 69 శాతం వాటా తెలంగాణకు రావాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. కేంద్రం స్పందించకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని, బ్రిజేష్ ట్రిబ్యునల్ తుది అవార్డు వచ్చే వరకు 50:50 నిష్పత్తిలో నీటి పంపిణీ జరగాలని 28 లేఖలు ఎందుకు రాసారని నిలదీశారు.
తుంగభద్ర అనే నది ఉందని, ఆ నది ద్వారా ప్రతి సంవత్సరం 450 నుంచి 600 టీఎంసీలు శ్రీశైలంకు వస్తాయన్న కనీస అవగాహన కూడా లేదని ఎద్దేవా చేశారు. ఈ ఏడాది జూరాల ఆధారిత ప్రాజెక్టుల కింద 5.50 లక్షల ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించింది మీ ప్రభుత్వమే కాదా అని ప్రశ్నించారు.
Also Read: కేసీఆర్ మళ్లీ అసెంబ్లీకి వస్తారా? ఆ మాటలకు అర్థం అదేనా?
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎన్జీటీలో కేసులు వేసిన వ్యక్తిని ప్రోత్సహించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 90 టీఎంసీలకు డీపీఆర్ పంపి ఏడు అనుమతులు తెచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు గడిచినా ఒక్క అనుమతి కూడా తీసుకురాలేకపోయిందని విమర్శించారు.