Musapet Truck Park Land: మూసాపేటలో ‘ట్రక్ పార్క్’ భూములు అమ్మితే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకునేది లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు హెచ్చరించారు. వేలంలో పాల్గొనేవారు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రేపు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్న హరీశ్.. ఒకవేళ వేలంలో భూములు కొన్నా అనుమతులు రావని స్పష్టం చేశారు. భూమిని వెనక్కి తీసుకుని ప్రజా ప్రయోజనాలకే ఉపయోగిస్తామని స్పష్టం చేశారు.
కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని మూసాపేటలో ప్రజా అవసరాల కోసం కేటాయించిన ‘ట్రక్ పార్క్’ భూములను ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందంతో కలిసి హరీశ్ రావు ఆ స్థలాన్ని పరిశీలించారు. స్థానిక ప్రజలు, ట్రక్ డ్రైవర్లు, కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా అవసరాల కోసం కేటాయించిన భూములను ప్రభుత్వం అమ్మకానికి పెట్టడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ధర్నాలో హరీష్ రావు పాల్గొని మాట్లాడుతూ ట్రక్ పార్క్ భూముల వేలాన్ని కచ్చితంగా అడ్డుకుంటామని వెల్లడించారు.
స్థానిక ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూములను అమ్మకానికి పెడితే.. నాడు బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంల ఉమ్మడి పోరాటంతో అడ్డుకున్నాయని గుర్తుచేశారు. ఆ తర్వాత కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్లలో ఈ ట్రక్ పార్క్ భూమిలో ఒక్క గజం కూడా అమ్మలేదన్నారు. కానీ 13 ఏళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ భూమిని మొత్తం అమ్మకానికి పెట్టడం అత్యంత దురదృష్టకరం అన్నారు. ఈ నెల 27న వేలం వేసేందుకు గురువారం హెచ్ఎండీఏ నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు.
Also Read: ఏపీకి సినీ పరిశ్రమ.. మంత్రి లోకేశ్ మాస్టర్ ప్లాన్.. వైజాగ్‌కు ‘భల్లాలదేవుడి’ కీలక భరోసా!
సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు.. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఎంతసేపూ భూముల చుట్టే తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఏడ భూమి కనబడితే ఆడ అమ్ముడే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఒకవేళ ఈ భూమిని ప్రజా అవసరాలకు వాడకపోతే.. ఆనాడు భూములిచ్చిన పేద ఎస్సీ, ఎస్టీ రైతులకైనా తిరిగి ఇచ్చేయాలని పట్టుబట్టారు. లేదంటే దవాఖానా, పార్కు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ జాగా లేక జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీలు షిఫ్ట్ సిస్టమ్‌లో నడుస్తున్నాయని.. కాబట్టి పిల్లల చదువుల కోసం కాలేజీలకైనా కేటాయించాలని హరీశ్ రావు సూచించారు. అంతేగానీ అమ్ముకోవడానికి వీల్లేదన్నారు. నాటి స్ఫూర్తితోనే నేడు కూడా బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం కలిసి ఎంతవరకైనా పోరాడతాయని హెచ్చరించారు.
Also Read: ఒరేయ్ గుర్నూర్.. నీ బొక్కలు విరగ్గొడతాం, లైవ్ మ్యాచ్‌లోనే కైల్ జేమీసన్ వార్నింగ్