E-Paper
Advertisement

పన్నుల నుంచి పర్మిషన్‌ల వరకు.. CUREతో హైదరాబాద్‌లో మారేదేంటి?

పన్నుల నుంచి పర్మిషన్‌ల వరకు.. CUREతో హైదరాబాద్‌లో మారేదేంటి?
Advertisement

మీ ఇంటి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలంటే ఒక ఆఫీస్.. బిల్డింగ్ పర్మిషన్ కావాలంటే మరో ఆఫీస్.. వాటర్ కనెక్షన్ సమస్య వస్తే ఇంకో డిపార్ట్‌మెంట్.. ఒక చిన్న పని కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఇకపై ఈ కష్టాలకు చెక్ పడబోతోందా? హైదరాబాద్‌లో ఇల్లు ఉన్నవాళ్లకు, కొత్తగా ఇల్లు కట్టాలనుకునేవాళ్లకు, వ్యాపారాలు నిర్వహించేవాళ్లకు ఒక కీలకమైన మార్పు రాబోతోంది. దాదాపు 70 ఏళ్ల చరిత్ర ఉన్న GHMC చట్టం స్థానంలోకి ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది. అదే కోర్ ఆర్బన్ రీజియన్ ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్ యాక్ట్.. సింపుల్‌గా క్యూర్ యాక్ట్. అసలు ఈ చట్టం ఎందుకు తీసుకొచ్చారు? దీని వల్ల సామాన్యులకు కలిగే ప్రయోజనాలేంటి? ప్రాపర్టీ ట్యాక్స్ పెరుగుతుందా? బిల్డింగ్ పర్మిషన్లు వేగంగా వస్తాయా?

ఈ చట్టం ఎందుకు?

ముందుగా ఈ చట్టం ఎందుకు అవసరమో తెలుసుకుందాం. 1955లో GHMC చట్టం వచ్చినప్పుడు హైదరాబాద్ జనాభా దాదాపు 15 లక్షలు. కానీ ఇప్పుడు నగరం విస్తరించింది. జనాభా కోటి 30 లక్షల వరకు చేరింది. ట్రాఫిక్ సమస్యలు, వరదలు, కాలుష్యం, నీటి కొరత, చెరువుల ఆక్రమణలు.. ఇలా టైమ్ మారుతున్న కొద్ది.. భాగ్యనగరం ఎదుర్కొంటున్న సమస్యలు కూడా పెరిగాయి. అందుకే మూడు మున్సిపల్ కార్పొరేషన్లను ఒకే పాలనా వ్యవస్థ కిందకు తీసుకొచ్చారు. అవే Greater Hyderabad, Cyberabad, Malkajgiri మున్సిపల్ కార్పొరేషన్లు. అంటే మూడు కార్పొరేషన్లు తమ పరిధిలో స్థానిక సేవలు అందిస్తూనే, మొత్తం నగరానికి సంబంధించిన కీలక నిర్ణయాలు, అభివృద్ధి పనులు ఒకే సమన్వయ వ్యవస్థ కింద సాగాలన్నది ఈ చట్టం లక్ష్యం.

ఏమిటీ ఈ క్యాపిటల్ వాల్యూ సిస్టమ్?

Advertisement

ఇప్పుడు కామన్‌ మ్యాన్ విషయానికి వద్దాం. మొదటిది… మీ ఇంటి ప్రాపర్టీ ట్యాక్స్. ఇప్పటివరకు ఇంటి అద్దె విలువ ఆధారంగా ప్రాపర్టీ ట్యాక్స్ లెక్కించేవారు. దీన్నే యాన్యువల్ రెంటల్ వాల్యూ సిస్టమ్ అంటారు. కానీ కొత్త CURE చట్టంలో క్యాపిటల్ వాల్యూ సిస్టమ్ తీసుకొచ్చారు. అంటే మీ ఇంటికి లేదా స్థలానికి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్‌మెంట్ నిర్ణయించిన గైడ్‌లైన్ విలువ ఆధారంగా పన్ను లెక్కిస్తారు. రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు సంవత్సరానికి 0.10 శాతం నుంచి 0.50 శాతం వరకు, కమర్షియల్ లేదా నాన్-రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు 0.20 శాతం నుంచి 2 శాతం వరకు పన్ను రేట్లు ప్రతిపాదించారు. ప్రస్తుతం మధ్యంతరంగా రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు 0.15 శాతం, నాన్-రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు 0.75 శాతం రేట్లు వర్తిస్తాయి.

ప్రాపర్టీ ట్యాక్స్ భారీగా పెరిగిపోతుందా?

అయితే ఇక్కడ చాలామందికి ఒక భయం ఉంది. కొత్త చట్టం వస్తోంది కాబట్టి ప్రాపర్టీ ట్యాక్స్ భారీగా పెరిగిపోతుందా? అని. కానీ అందరికీ ఒకేసారి భారీ భారం పడకుండా ప్రభుత్వం 10 శాతం పరిమితి పెట్టింది. ఫర్ ఎగ్జాంపుల్‌ మీరు ప్రస్తుతం సంవత్సరానికి 10 వేల రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారనుకుందాం. కొత్త లెక్కల ప్రకారం అది 16 వేల రూపాయలు కావాలి. కానీ ఒకేసారి ఇలా కట్టించుకోరు. మొదటి ఏడాది మీరు కట్టాల్సింది 11 వేల రూపాయలే. రెండో ఏడాది గరిష్ఠంగా 12,100 రూపాయలు. ఆ తర్వాత కూడా పాత పన్నుతో పోలిస్తే ఏటా గరిష్ఠంగా 10 శాతం చొప్పున పెరుగుతుంది. కొత్త పన్ను మొత్తానికి చేరేవరకు ఈ విధానం కొనసాగుతుంది. అంటే ప్రతీ ఇంటికీ ఏటా 10 శాతం పన్ను పెరుగుతుందని కాదు. కొత్త లెక్కల ప్రకారం ఎంత పెరగాల్సి ఉందన్నదానిపై ఆధారపడి ఉంటుంది. ఈ కొత్త చట్టం ప్రకారం అక్రమ నిర్మాణాల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించనున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్‌పై 300 శాతం వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అంతేకాదు జరిమానా కట్టినంత మాత్రాన అక్రమ నిర్మాణం క్రమబద్ధీకరణ అయినట్లు కాదు.

ఎప్పటి నుంచి అమలు?

Advertisement

ఈ కొత్త పన్ను విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అంటే.. కొత్తగా నిర్మించిన, ఇప్పటివరకు పన్ను అసెస్‌మెంట్ జరగని ఇళ్లకు Capital Value System ఇప్పటికే వర్తిస్తోంది. కానీ పాత ఇళ్లకు మాత్రం 2027 ఏప్రిల్ 1 నుంచి అంటే 2027-28 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త విధానం వర్తిస్తుంది.

వేగంగా బిల్డింగ్ పర్మిషన్లు

ఇల్లు కట్టాలనుకునేవాళ్లకు బిల్డింగ్ పర్మిషన్ కోసం ఎదురుచూడటం ఎంత పెద్ద సమస్యో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సమస్యను తగ్గించేందుకు కొత్త చట్టంలో టైమ్‌లైన్స్ తీసుకొచ్చారు. 500 చదరపు మీటర్ల వరకు స్థలం ఉండి, 10 మీటర్ల వరకు ఎత్తులో నిర్మించే సాధారణ రెసిడెన్షియల్ బిల్డింగ్స్‌కు 15 రోజుల్లో అనుమతుల ప్రక్రియ పూర్తి చేయాలనే టార్గెట్ ఉంది. పెద్ద రెసిడెన్షియల్ ప్రాజెక్టులు, అన్ని నాన్-రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు 21 రోజుల గడువు పెట్టారు.

డీమెడ్ అప్రూవల్ తప్పనిసరి

ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ రూల్ కూడా ఉంది. అదే Deemed Approval. అంటే నిబంధనలకు అనుగుణంగా ఉన్న అప్లికేషన్‌ను సంబంధిత అధికారులు నిర్ణీత సమయంలో ప్రాసెస్ చేయకపోతే, కొన్ని షరతులకు లోబడి అనుమతి వచ్చినట్లుగా పరిగణించే అవకాశం ఉంటుంది. అయితే ఇది అన్ని భవనాలకూ వర్తించదు. చెరువుల బఫర్ జోన్లలో నిర్మాణాలు, హై రైజ్ బిల్డింగ్స్, ఫైర్ సర్వీసెస్, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ వంటి సంస్థల నుంచి NOCలు అవసరమయ్యే ప్రాజెక్టులకు ఈ వెసులుబాటు ఉండదు. కాబట్టి 15 లేదా 21 రోజులు దాటితే చాలు, అనుమతి వచ్చేసినట్లే అని ఎవరూ భావించవద్దు. ఈ అప్లికేషన్‌ ప్రక్రియను బిల్డ్ నౌ తెలంగాణ పోర్టల్ ద్వారా మెయింటేన్ చేస్తారు.

అన్ని బిల్లులూ ఒకే చోటికి..

ఇది నిజంగా అమల్లోకి వస్తే హైదరాబాద్ ప్రజలకు పెద్ద ఊరట దక్కినట్టే. ఇప్పటివరకు ప్రాపర్టీ ట్యాక్స్ ఒకచోట, వాటర్ బిల్ మరోచోట, సీవరేజ్ ఛార్జీలు ఇంకోచోట చెల్లిస్తున్నారు. దీనికి పరిష్కారంగా CURE-1 పేరుతో ఒకే కన్సాలిడేటెడ్ సివిక్ బిల్ తీసుకురావాలని చట్టం ప్రతిపాదిస్తోంది. అంటే ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ఛార్జీలు, సీవరేజ్ ఛార్జీలు, శానిటేషన్ బకాయిలు ఒకే బిల్లులో కనిపించేలా చేయాలన్నది లక్ష్యం. ప్రతి ప్రాపర్టీకి ఇంటిగ్రేటేడ్ ప్రాపర్టీ ఐడెంటిటీ కోడ్ అంటే IPIC కూడా ఇవ్వనున్నారు. దీంతో ఇంటి ఓనర్‌ వివరాలు, ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ కనెక్షన్, సీవరేజ్ రికార్డులు ఒకే ఐడీతో లింక్ అవుతాయి. అయితే CURE-1 యాప్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. కానీ ఒకే కన్సాలిడేటెడ్ బిల్లింగ్ సిస్టమ్, పూర్తి ప్రాపర్టీ రికార్డుల లింక్ ఇంకా పూర్తికావాల్సి ఉంది. ఇక ఇంటి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మున్సిపల్ రికార్డుల్లో పేరు మార్చుకోవడానికి ప్రత్యేకంగా తిరగాల్సిన అవసరం తగ్గించేందుకు ఆటోమేటిక్ ప్రాపర్టీ మ్యుటేషన్ విధానాన్ని కూడా తీసుకొచ్చారు.

అన్ని శాఖలతో సమన్వయం

అన్ని బాగున్నాయి.. మరి రోడ్లు, డ్రైనేజీలు, చెత్త సమస్యలు వస్తే ఎవరిని అడగాలి అనే క్వశ్చన్ మీకు రావొచ్చు. ఇక్కడే ఈ చట్టంలోని మరో కీలకమైన మార్పు ఉంది. మూడు కార్పొరేషన్లతో పాటు వాటర్ బోర్డు, ఎలక్ట్రిసిటీ, పోలీస్, మెట్రో, RTC, HMDA, HYDRAA వంటి సంస్థల మధ్య కోఆర్డినేషన్ కోసం CURE ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కనీసం మూడు నెలలకు ఒకసారి సమావేశమై నగర సమస్యలు, అభివృద్ధి పనులు, వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని సమీక్షించాలి. అంటే ఒక రోడ్డు సమస్యకు ఒక శాఖ, డ్రైనేజీ సమస్యకు మరో శాఖ అని తప్పించుకునే పరిస్థితి ఉండకూడదు అనేది టార్గెట్.

ఈ నిర్ణయాలు తీసుకొనేది ఎవరు?

మరి ఇంత పెద్ద వ్యవస్థలో కీలక నిర్ణయాలు తీసుకునేది ఎవరు అంటే.. సీఎం అధ్యక్షతన అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్ నగరానికి సంబంధించిన ప్రధాన విధాన నిర్ణయాలు తీసుకుంటుంది. ఎగ్జిక్యూటివ్ కమటీ వాటి అమలును కో ఆర్డినేట్ చేస్తుంది. మొత్తంగా చూస్తే CURE Act హైదరాబాద్ అడ్మినిస్ట్రేషన్‌ను కొత్త దిశలోకి తీసుకెళ్లే ప్రయత్నం అని చెప్పొచ్చు.

Also Read: డబ్బు మనది.. పర్మిషన్ నెటిజన్లది, వైరల్‌ చైనా యాప్ కథేంటి?

అయితే చట్టం తీసుకురావడం ఒక ఎత్తు. దానిని పక్కాగా ఇంప్లిమెంట్ చేయడం మరో ఎత్తు. హైదరాబాద్ ప్రజలకు నిజంగా కావాల్సింది కొత్త చట్టం మాత్రమే కాదు.. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేని పాలన. మరి CURE ఆ మార్పును తీసుకొస్తుందా? లేదా? అనేది కొన్ని రోజుల్లో తేలనుంది.

Tags

Related News

ఒక్క కేసీఆర్‌.. పదేండ్ల పాలన! ఆమాంతం పెరిగిన కుటుంబ ఆస్తులు! అంతా కలిసి కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్‌కు పరిమితం చేసి!

భారత్‌ సమ్మిట్ వేదికగా రాజకీయ రగడ.. వీసాల రద్దు వెనుక మోడీ సర్కార్ వ్యూహమేంటి?

ఫామ్‌హౌజ్‌ చుట్టూ కుటుంబ సభ్యుల భూములు! కొండ పోచమ్మ నుంచి ఫామ్‌హౌజ్‌కు నీళ్లు నిజమే? కవిత నిప్పులాంటి నిజాలు..!

తెలంగాణ నర్సింగ్ కాలేజీల్లో విచిత్ర పరిస్థితి.. ఇలాంటి వారు కూడా ఉన్నారా..?

తెలంగాణ ఇసుక క్వారీల్లో అక్రమ బకాసురులు.. పట్టించుకోని అధికారులు!

తెలంగాణ మహిళలకు చీరల పంపిణీకి డేట్ ఫిక్స్ చేసిన సర్కార్.. ఎప్పుడంటే?

భారత్‌ సమ్మిట్‌పై కేంద్రం నజర్! దేశ వ్యతిరేక శక్తుల ముద్ర వేసే ప్రయత్నం.. ! విదేశీ అతిథుల వీసాలు రద్దు చేయడంతో కొత్త రచ్చ..

Big Stories

Advertisement
×