Fox Sagar: ఒకప్పుడు హైదరాబాద్ నగరానికి నీటి వనరుగా, పరిసర ప్రాంతాలకు వరద ముప్పు నుంచి రక్షణగా నిలిచిన ఫాక్స్ సాగర్ చెరువు.. ఆక్రమణలు, మురుగు నీరు, రసాయన వ్యర్థాలతో తన పూర్వ వైభవాన్ని కోల్పోయింది. చారిత్రక ప్రాధాన్యమున్న ఈ జలాశయానికి మళ్లీ జీవం పోసి, స్వచ్ఛమైన నీటి నిల్వతో పాటు పర్యావరణహితమైన ఆహ్లాదకర ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు హైడ్రా నడుం బిగించింది. ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా జీడిమెట్ల ఫాక్స్ సాగర్ అభివృద్ధి పనులకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ (ఐపీఎస్) వివిధ శాఖల అధికారులతో కలిసి భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ.. చెరువుల పునరుద్ధరణ, అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు భావితరాలకు విలువైన నీటి వనరులను అందిస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు నీటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే చెరువుల పరిరక్షణ, అభివృద్ధి ఒక్కటే మార్గమన్నారు. కొన్నేళ్లుగా ఆక్రమణలు, కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఫాక్స్ సాగర్‌ను మరో ఏడాది కాలంలో హైదరాబాద్‌కు నీరు అందించే పూర్వపు సరస్సు రూపంలో చూస్తారని హామీ ఇచ్చారు. చెత్త, రసాయన వ్యర్థాలను తొలగించి, నీటిని నిల్వ చేసేందుకు, భూగర్భ జలాలను పెంపొందించేందుకు సమగ్ర చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
మొత్తం 482.60 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువులో 120.60 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు గుర్తించారు. వీటిలో 14.46 ఎకరాల మేర నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రధాన కట్ట నుంచి 10 మీటర్ల పరిధిలోని ఆక్రమిత నిర్మాణాలను తొలగించనున్నారు. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోని నివాస సముదాయాల బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు లేదా మరోచోట ఇళ్ల నిర్మాణం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కమిషనర్ తెలిపారు. ఉమామహేశ్వర కాలనీ వాసులకు ఇబ్బందులు కలగకుండా చూడనున్నారు. వాణిజ్య షెడ్ల విషయంలో మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు.
Also Read: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నోటిఫికేషన్ విడుదల
పూడికతీత, చెరువు లోతు పెంపు పనులతో పాటు వరద నీరు చెరువులోకి చేరేందుకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేస్తారు. మూసుకుపోయిన సర్‌ప్లస్ నాలాలను పునరుద్ధరించి, కాలువల మళ్లింపు చేపడతారు. 2000 సంవత్సరంలో ఫాక్స్ సాగర్ పరిసర ప్రాంతాల్లో వచ్చిన వరదలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో ముంపు సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ అమలు చేయనున్నారు.
చెరువులోకి మురుగు నీరు చేరకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఎఫ్లుయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు (ఈటీపీ), రీసైక్లింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. నీటి నాణ్యతపై ప్రస్తుత నమూనాలను పరీక్షించి, ఏడాది తర్వాత మరోసారి ల్యాబ్ పరీక్షలు నిర్వహించి మార్పులను వెల్లడిస్తారు. బ్రిటిష్ ఇంజినీర్లు నిర్మించిన చారిత్రక గేట్లను మరమ్మతు చేసి వారసత్వ లక్షణాలను పునరుద్ధరిస్తారు. అవసరమైతే యూరప్ నిపుణుల సేవలు వినియోగించుకోనున్నారు. చెరువు పరిధిలోని చారిత్రక ఆలయాలను తొలగించబోమని స్పష్టం చేశారు. మినీ ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు తరహాలో రింగ్‌రోడ్డు సర్కిల్, వాకింగ్ ట్రాక్‌లు, ఆధునిక పార్కులు, ఓపెన్ జిమ్‌లు, బోటింగ్ వంటి వినోద సదుపాయాలు కల్పించనున్నారు.
పర్యావరణానికి ప్రాధాన్యమిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించనున్నారు. పోలీసు, ఇరిగేషన్, రెవెన్యూ, వాటర్‌బోర్డు, సైబరాబాద్ మున్సిపల్ విభాగాల సమన్వయంతో పనులు సాగనున్నాయి. 18 నెలల అంచనా గడువుతో చేపట్టిన ఈ ప్రాజెక్టును 2027 నవంబరు లేదా డిసెంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భూమిపూజ కార్యక్రమంలో ప్రాజెక్టు కాంట్రాక్టర్ దామోదర్ మంజునాథ్, హైడ్రా అధికారులు యూనుస్, ఆదిత్య గౌడ్, వేణు, మేడ్చల్ ఏసీపీ శంకర్‌రెడ్డి, పేట్‌బషీరాబాద్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి, కొంపల్లి ట్రాఫిక్ సీఐ క్రాంతికుమార్, ఇరిగేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Also Read: కడుపులో విషం పెట్టుకుని రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.. సీఎం రేవంత్ ఫైర్!