Damodar Raja Narasimha : తెలంగాణలో నకిలీ ఔషధాల విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు. హైదరాబాద్ లోని తన నివాసంలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వార్షిన నివేదికని విడుదల చేసిన మంత్రి.. అక్రమార్కులపై కేసులు నమోదు చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగంలోని అధికారులంతా సమిష్టిగా పనిచేసి.. తెలంగాణ ప్రభుత్వ ఆశయాలను సాధనలో, లక్ష్యాలను చేరుకోవడంలో సహకరించాలని కోరారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ను బలోపేతం చేసినట్లు వెల్లడించిన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా.. రాష్ట్రంలో నిషేధిత మందులు ప్రవేశించకుండా కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ప్రజలకు నకిలీ మందుల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించిన మంత్రి.. నకిలీ మందుల విక్రయాలు జరిపే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.
పేదలకు, మధ్య తరగతి వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వైద్యారోగ్య శాఖ అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా నిర్దేశించిన ధరలకంటే ఎక్కువ ధరలకు మందుల్ని విక్రయించకుండా చూడాలని కోరారు. రాష్ట్రంలోని ఏదైనా ఔషధ దుకాణంలో ప్రభుత్వం సూచించిన ఎమ్ఆర్పీ ధరల కంటే ఎక్కువకు విక్రయిస్తే.. చట్టప్రకారం వారిని బాధ్యులుగా చేసి, కేసులు నమోదు చేయాలని సూచించారు.
ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ వినియోగంపై సీరియస్ గా ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈ విషయమై అనేక సార్లు అధికారులతో సమావేశాలు నిర్వహించి స్పష్టమైన మార్గదర్శకాలు చేశారు. ఇందులో భాగంగా.. ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోకి ప్రవేశిస్తున్న అక్రమ డ్రగ్స్ ను నిరోధించాలని అధికారులకు ఆదేశించారు.
ఈ ఏడాది డ్రగ్స్ రాకెట్ కు పాల్పడుతున్న అక్రమార్కులపై కఠినంగా వ్యవహరించి 2024 ఏడాదిలో 573 కేసులు నమోదు చేశామని తెలిపారు. అంతకముందు అంటే.. 2023 లో కేవలం 56 కేసులే నమోదయ్యాయని ప్రభుత్వ చిత్తశుద్ధి కారణంగానే ఇన్ని కేసుల నమోదు సాధ్యమైందని వ్యాఖ్యానించారు. వివిధ కేసుల్లో చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసిన డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులను మంత్రి దామోదర రాజనర్సింహా అభినందనలు తెలిపారు.
Also Read : న్యూ ఇయర్ ఫస్ట్ రోజే.. రికార్డ్ బద్దలు కొట్టిన మద్యం ప్రియులు..
రాష్ట్రంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మెడికల్ , ఫార్మా కంపెనీల పై చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశించారు. మందుల కొనుగోలులో ప్రజలు అవగాహన పెంచుకోవాలని ఆంకాంక్షించిన మంత్రి రాజనర్సింహ.. నకిలీ మందుల వల్ల పేదలు, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపిన మంత్రి.. ప్రజలకు అవసరాల మేరకు ప్రభుత్వాలు పనిచేయాలని, వాటిని అధికార యంత్రాగం అమలు చేయాలని కోరారు.