Hyderabad Rain Alert: వర్షాకాలం వస్తే చాలు నగరంలో నీటి ప్రవాహం కన్నా ముందు వచ్చే వార్తే – ట్రాఫిక్ జామ్, రోడ్లన్నీ జలమయం.. ఇప్పుడు అదే పరిస్థితి మళ్లీ నెలకొనబోతుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఈ రోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి అధికారిక హెచ్చరిక వచ్చింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో, నగర ప్రజలకు మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి ఒక ముఖ్య సూచన చేశారు. “అత్యవసరమైతే తప్ప, బయటికి రావద్దు” అని ఆమె విజ్ఞప్తి చేశారు. వర్షం కారణంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా జీహెచ్ఎంసీ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని ఆమె హామీ ఇచ్చారు.
ముఖ్యంగా నగరంలోని జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, క్షేత్రస్థాయి అధికారులు, GHMC విభాగాల ఉన్నతాధికారులకు మేయర్ ఇప్పటికే సూచనలు జారీ చేశారు. వర్షాల వల్ల వచ్చే ఫిర్యాదులకు తక్షణమే స్పందించాలనీ, ప్రజల సమస్యలపై సత్వర నిర్ణయాలు తీసుకోవాలనీ ఆమె ఆదేశించారు. అంతేకాదు, హైదరాబాద్ రెయిన్ అండ్ డ్రెయినేజ్ అనాలిసిస్ అథారిటీ – HYDRAAతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలనీ స్పష్టం చేశారు. వరద నీరు నిలిచే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వాటర్ లాగింగ్ పాయింట్లను ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలనీ మేయర్ గద్వాల విజయలక్ష్మి సూచించారు. ఈ నేపథ్యంలో GHMC-DRF (డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్)ను సంప్రదించేందుకు మేయర్ కొన్ని అత్యవసర నంబర్లను సూచించారు.
ప్రజలు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఉండాలంటే ఈ నెంబర్లు గుర్తుంచుకోవాలని కోరారు. 040-29555500, 040-21111111, 9000113667 లేదా HYDRAA ప్లాట్‌ఫారమ్ ద్వారా కూడా సమస్యలు చెప్పవచ్చని తెలిపారు. ఇక ప్రధానంగా మేయర్ చేసిన విజ్ఞప్తి చేశారు. అవసరం ఉంటేనే బయటికి వెళ్లాలని తెలిపారు. పూర్తి జాగ్రత్తలతో బయటకి వెళ్లాలని ఆమె సూచించారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్న ఇళ్లలో మరింత జాగ్రత్త అవసరం. పాఠశాలలు, కార్యాలయాలు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మేయర్ తెలిపారు.
రోడ్లపైకి నీరు ప్రవహించినప్పుడు విద్యుత్ స్తంభాల దగ్గర ఉండకుండా, కనీసం తడిగా ఉండే ప్రదేశాల వద్ద ఎలక్ట్రానిక్ పరికరాల వాడకానికి దూరంగా ఉండాలని సూచించారు. ఇదే సమయంలో, GHMC బృందాలు పలు ప్రాంతాల్లో క్లీనింగ్, డ్రెయినేజ్ క్లియర్ చేసే పనుల్లో నిమగ్నమయ్యాయని సమాచారం. ఫీల్డ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎలాంటి ఫిర్యాదు వచ్చినా, ఏ ప్రాంతమైనా – అక్కడికి తక్షణమే DRF బృందాలు వెళ్లి పరిష్కారానికి సిద్ధంగా ఉంటాయని మేయర్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ విజ్ఞప్తి చేశారు.