Rain Alert: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణంలో భిన్నమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొద్దసేపులు ఎండలు, ఆ కాసేపటికే వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో రాబోయే ఐదు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని.. రాబోయే మూడు రోజుల్లో తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వరకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయని వివరించింది.
ఈ రోజు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఈ నెల 27న పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో రాబోయే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదు నుంచి ఏడు డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశాలున్నాయని తెలిపింది. ఇవాళ నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో.. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. అక్కడక్కడా పిడుగులు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది.
రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో భారీ వర్షం
ఇక రేపు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతాయని వివరించింది. ఎల్లుండి నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతాయని పేర్కొంది.
ఈ నెల 29వరకు భారీ వర్షాలు
ఈ నెల 27న కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 28న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది. ఈ నెల 29న కూడా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
ALSO READ: NMDC Notification: హైదరాబాద్ NMDCలో 995 ఉద్యోగాలు.. జీతం రూ.35,040, ఈ అర్హత ఉంటే చాలు!
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పొలాల వద్ద ఉన్నప్పుడు చెట్ల కింద నిలబడొద్దని చెబుతున్నారు. చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ఐదు రోజులు అత్యవసరం అయితే తప్ప పొలాల వద్దకు రైతులు వెళ్లొద్దని చెబుతున్నారు.
ALSO READ: NTPC Limited: బీటెక్ అర్హతతో ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. అక్షరాల రూ.2,00,000 జీతం