SFI: తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం నిర్లక్ష్యానికి గురవుతోందని ఆరోపిస్తూ, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ (స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) రాష్ట్ర కమిటీ ఆందోళనకు సిద్ధమైంది. ఈ సమస్యపై ప్రభుత్వానికి నిరసన తెలియజేసేందుకు రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత, వృత్తి విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల బంద్‌కు ఎస్‌ఎఫ్‌ఐ పిలుపునిచ్చింది.
సోమవారం నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్. రజనీకాంత్, టి. నాగరాజులు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. విద్యారంగం నిద్రావస్థలో ఉందని, విద్యా శాఖను తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని వారు ఆరోపించారు.
గత ఆరేళ్లుగా విద్యార్థులకు చెల్లించాల్సిన రూ. 8 వేల కోట్లకు పైగా ఫీజుల బకాయిలను ప్రభుత్వం విడుదల చేయడంలో ఘోరంగా నిర్లక్ష్యం వహిస్తోందని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టోకెన్‌లు ఇచ్చి, దశలవారీగా బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చినా, 23 నెలలు గడుస్తున్నా ఆ హామీలు నెరవేర్చలేదని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫీజు బకాయిలు విడుదల కాకపోవడం వల్ల విద్యాసంస్థల యాజమాన్యాలు పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులపై లక్షలాది రూపాయల కోసం బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాయని.. దీంతో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోందని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఒత్తిడి కారణంగానే అనేక మంది పేద విద్యార్థులు తమ చదువులకు దూరం కావాల్సిన దుస్థితి ఏర్పడుతోందని వారు పేర్కొన్నారు.
ALSO READ: Heavy rains: అత్యంత భారీ వర్షాలు.. రేపు స్కూళ్లకు సెలవు ఉందా..? లేదా..? ఇదిగో క్లారిటీ
తక్షణమే ఫీజుల చెల్లింపు కోసం ప్రభుత్వం హామీ ఇచ్చి, విద్యార్థులకు భరోసా కల్పించే విధంగా జీవో జారీ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్ చేసింది. అంతేకాకుండా.. బెస్ట్ అవైలబుల్ స్కీమ్, డైట్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీల బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని కోరింది. విశ్వవిద్యాలయాల్లో సైతం నిధులు విడుదల చేయకపోవడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని వారు తెలిపారు.
ముఖ్యమంత్రి వెంటనే ఈ సమస్యలపై స్పందించి, నవంబర్ మొదటి వారంలోగా బకాయిలు విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ హెచ్చరించింది. లేని పక్షంలో.. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను సమీకరించి ‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. రేపు తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు.