FarmHouse Case : బిగ్ బ్రేకింగ్. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ట్రాప్ కేసులో ముగ్గురు నిందితులకు రిమాండ్ విధిస్తూ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వారి రిమాండ్ ను రిజెక్ట్ చేస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఇవ్వగా.. ఆ తీర్పును హైకోర్టు కొట్టివేసింది. వెంటనే రామచంద్రభారతి, సింహయాజులు, నందు కుమార్ లను సైబరాబాద్ సీపీ ముందు లొంగిపోవాలని ఆదేశించింది. నిందితులను అరెస్ట్ చేసి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది ధర్మాసనం.
మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ముగ్గురు నిందితుల విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆసక్తిగా మారింది. ఇప్పటికే పలు ఫోన్ కాల్ సంభాషణలు, వాట్సప్ చాట్ లు బయటకు రాగా.. పోలీసుల విచారణలో మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే నందు డైరీలో సుమారు 40 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వివరాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే.. నందు కుమార్ ఎవరెవరిని కాంటాక్ట్ చేశారో.. ఎవరికి ఎంత ఇస్తానన్నారో.. నందు వెనక ఉన్నదెవరో.. ఆ డబ్బంతా ఎక్కడిదో.. పూర్తి స్థాయిలో విచారణ కొనసాగనుంది.
నందుతో పాటు రామచంద్ర భారతి కీ రోల్ ప్లే చేసినట్టు లీకైన ఆడియో సంభాషణతో తెలుస్తోంది. ఆ ఫోన్ కాల్ లో రామచంద్ర భారతి.. సంతోష్, అమిత్ షా ల పేర్లు ప్రస్తావించడంతో.. ఈ కేసు విచారణ ఎక్కడి వరకూ దారి తీస్తుందోననే ఆసక్తి పెరుగుతోంది. తీగ లాగితే.. ఢిల్లీలో డొంక కదిలే అవకాశాలూ లేకపోలేదని అంటున్నారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఎపిసోడ్ బీజేపీ చుట్టూనే తిరుగుతుండటంతో.. మునుగోడు ఎన్నికల సమయంలో ఆ పార్టీకి బాగా డ్యామేజ్ జరిగే ఛాన్స్. అయితే, కమలనాథులు ప్రమాణాలు, సవాళ్లతో ధీటుగా రివర్స్ అటాక్ చేస్తుండంతో టీఆర్ఎస్ సైతం కాస్త ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇలాంటి కీలక సమయంలో ఆ ముగ్గురు నిందితుల పోలీసు విచారణ రాజకీయాలను అమాంతం మార్చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు.