Bharat Jodo Yatra : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. తెలంగాణలో నాలుగో రోజు మహబూబ్ నగర్ మండల పరిధిలోని ధర్మాపూర్ లోని జయప్రకాశ్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ప్రారంభమైంది. రాహుల్ తోపాటు పార్టీ జాతీయ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్, తెలంగాణ కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, మధుయాష్కీ , పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సీతక్క పాదయాత్రలో పాల్గొన్నారు. 15 కిలోమీటర్ల పాటు సాగిన పాదయాత్రలో చిన్నారులు, యువకులు, మహిళలు, కళాకారులు, వివిధ సంఘాల నేతలు, కార్మికులతో రాహుల్ ముచ్చటించారు. ఇదే సమయంలో సినీనటి పూనమ్ కౌర్ భారత్ జోడో యాత్రలో ప్రత్యక్షమయ్యారు. ఆమె రాహుల్ తోపాటు భారత్ జోడో యాత్ర చేశారు. భద్రాచలం నుంచి వచ్చిన గిరిజనులతో కలిసి రాహుల్ సంప్రదాయ నృత్యం చేసి ఆకట్టుకున్నారు. చేనేత కార్మికులు వారి సమస్యలను రాహుల్ దృష్టికి తీసుకొచ్చారు. ఎన్ఎస్ యూఐ ఆధ్వర్యంలో 3 వేల మంది విద్యార్థులతో ర్యాలీ చేశారు. ఉస్మానియా , కాకతీయ విశ్వవిద్యాలయాల విద్యార్థలు రాహుల్ కలిసి వర్శిటీ సమస్యలను వివరించారు.