JP Nadda : నిన్నామొన్నటి దాకా మునుగోడులో బీజేపీ దూకుడు మీదున్నట్టు కనిపించింది. మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసుతో కమలదళం ఒక్కసారిగా డిఫెన్స్ లో పడిపోయింది. ఇప్పుడు ఇష్యూ అంతా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు చుట్టూనే తిరుగుతోంది. లీకైన ఆడియోలు, వాట్సాప్ చాట్.. ఆ పార్టీని ఇరకాటంలో పడేసినట్టుంది. బీజేపీ నేతలు తమకేం సంబంధం లేదని ఎంత గట్టిగా వాదిస్తున్నా.. అనుమానాలు మాత్రం వీడటం లేదు. మునుగోడు ఎన్నికకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఫామ్ హౌజ్ ఎపిసోడ్ కమలంలో కల్లోలం రేపింది.
భయపడ్డారో.. జాగ్రత్తపడ్డారో.. కారణం ఏదైనా.. అక్టోబర్ 31న మునుగోడులో జరగాల్సిన బీజేపీ బహిరంగ సభ వాయిదా పడటం ఆసక్తికరం. ఈ సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రావాల్సి ఉండగా ఆ మీటింగ్ క్యాన్సిల్ కావడం చర్చకు దారి తీస్తోంది. బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభను అర్థాంతరంగా ఎందుకు రద్దు చేసుకున్నట్టు? ఫామ్ హౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, ఆడియో లీకులు తమ పార్టీ పెద్దల వైపే వేలెత్తి చూపుతుండటంతో తెలంగాణ ప్రజలకు ముఖం చూపించే పరిస్థితి లేకనే నడ్డా ముఖం చాటేశారా? అని ప్రశ్నిస్తున్నారు గులాబీ నేతలు. ఎమ్మెల్యేల డీల్ వ్వవహారం ఢిల్లీ స్థాయిలో జరిగిందనే ప్రచారంతో.. ఆ విషయంలో జవాబు చెప్పలేక.. ఎందుకైనా మంచిదని నడ్డా తన సభను రద్దు చేసుకున్నారని అంటున్నారు.
అయితే, నడ్డా సభ లేకపోయినా.. అదే రోజు మునుగోడు నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, ఏడు మండలాల్లో చిన్నచిన్న సభలు, బైకు ర్యాలీలు నిర్వహించనుంది బీజేపీ. ఈ మండల సభలకు పలువురు కీలక జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు హాజరవుతారని చెబుతున్నారు. జరిగిన డ్యామేజీని.. బైకు ర్యాలీలు, సభలతో కవర్ చేయాలనేది బీజేపీ స్ట్రాటజీ కావొచ్చు. అయితే, ఈనెల 30న కేసీఆర్ భారీ బహిరంగ సభకు సిద్ధమవుతుండగా.. ఆ మర్నాడు జరగాల్సిన నడ్డా మీటింగ్ రద్దు కావడం ఆ పార్టీ ప్రచారానికి బిగ్ మైనస్ అవుతుందని అంటున్నారు.