ఎవరు తెలంగాణ జాతిపిత..? ఇప్పుడిది స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మీటింగులు, రౌండ్ టేబుల్ సమావేశాలూ పెట్టుకుని మరీ చర్చించుకుంటున్నారు. దీనికి కారణం బీఆరెస్సే. అసందర్భంగా జాతిపిత అంటూ కేసీఆర్‌ను కీర్తించి వివాదాన్ని మరింత తీవ్రం చేశారు.
మొన్న ఫిబ్రవరి నెలలో ఆయన బర్త్ డే సందర్బంగా జాతిపితగా కేసీఆర్‌ను కీర్తిస్తూ ఎక్కడబడితే అక్కడ ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేశారు. అంతకు ముందు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనను విచారించేందుకు సిట్ నందినగర్‌లోని ఆయన ఇంటి గోడకు నోటీసులు అంటించి వెళ్లడంతో మా జాతిపితనే పిలుస్తారా? అవమానిస్తారా?? అంటూ చెలరేగిపోయారు.
ఇలా ఈ జాతిపిత అనే టాపిక్‌ను ఎప్పటికప్పుడు తమకు ఓన్ చేసుకునే క్రమంలో మరింత వివాదాన్ని బీఆరెస్ నెత్తికెత్తుకోవడంతో పాటు అసలు కేసీఆర్ జాతిపిత ఎట్లైతడు..? అనే అంశం విపరీతంగా చర్చకు వచ్చే దాకా లాగారు. ఈ వివాదం ఇప్పుడు వాదించి, ఖండించి… గద్దర్‌కు జాతిపిత ఇవ్వాలనే దాకా తీసుకొచ్చారు. తాజాగా గద్దర్ గళం ఆధ్వర్యంలో మేధావులు, సామాజిక వేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన పాశం యాదగిరి తదితరులు కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఆయనను తాగుబోతుగా వర్ణించిన యాదగిరి.. కేసీఆర్ జాతిపిత కాదు పీత (పీనా అంటే హిందీలో తాగడం అని… పీత అంటే తాగుతాడు అని ) అంటూ ఆరోపించడం చర్చనీయాంశమైంది. ఆయనకు రెండు సార్లు అధికారం ఇవ్వడమే తెలంగాన జనం చేసిన పెద్ద తప్పు అని కూడా పాశం అనడం… ఓ పిట్టకథను జోక్‌గా చెప్పడం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ జాతిపిత వివాదం ఎక్కడిదాకా వచ్చిందంటే.. అటుపోయి ఇటుపోయి సర్కార్ మెడకు చుట్టుకునే వరకు. గద్దర్ వర్దంతి ఆగస్టు 6న ఉంది.
అప్పటిలోగా గద్దర్‌ను జాతిపితగా సర్కార్ ప్రకటించాలని ఒత్తిడి పెంచే వరకు వెళ్లింది పరిస్థితి. లేకపోతే సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ జనం క్షమించదని అల్టిమేటం జారీ చేసే దాకా వెళ్లారు వీరు. జాతిపిత .. జాతిపిత అని కలవరించి.. కలరింగిచ్చుకునే క్రమంలో కంపు కంపు చేసుకుని తామంతగా తాముగా సెల్ఫ్‌గోల్ చేసుకున్నది బీఆరెస్. ఆ మధ్య సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ జాతిపిత అంశంపై తీవ్రంగా స్పందించారు.
ఎవడికిరా నువ్వు జాతిపిత? నీ జాతికి నువ్వు జాతిపిత.. మా తెలంగాణ సమాజానికి కాదు.. అని బహిరంగ వేదిక మీదే వ్యాఖ్యానించడం అప్పట్లో కలకలం రేపింది. ఇంత జరిగినా మళ్లీ కేసీఆర్ బర్త్ డే నాడు అవే హోర్డింగులు పెట్టి హోరెత్తించింది గులాబీదళం. ఇక ఇట్లనే ఉపేక్షిస్తే.. ఇదే పాట పాడుతారనుకున్నారేమో తెలియదు గానీ మేధావులు, ఉద్యమకారులు.. గద్దర్ పేరును బలంగా తెరపైకి తెచ్చారు. ఆయన వర్దంతి లోపు తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని సర్కార్‌కు డెడ్‌లైన్ కూడా విధించారు. ఈ వివాదం ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు.