Heavy Flood: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వానలు దంచికొట్టాయి.హైదరాబాద్‌తో పాటు మెదక్, రంగారెడ్డి, వికారాబాద్,సిద్ధిపేట్, నల్లగొండ జిల్లాల్లో భారీగా వర్షం కురిసింది. మెదక్‌లో గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏకధాటిగా 3 గంటలపాటు కుండపోత వాన కురిసింది.మళ్లీ రాత్రి కూడా కుమ్మేసింది. దీంతో మెదక్ పట్టణం అతలాకుతలమైంది. జిల్లా కేంద్రంలో అత్యధికంగా 17.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రోడ్లన్నీ చెరువులను తలపించగా, పట్టణంలోని పలు ఇళ్లలోకి నీరు చేరింది.మెదక్ మండలంలోని పలు గ్రామాల్లో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. సిద్ధిపేట్ జిల్లా హుస్నాబాద్‌లో సాయంత్రం నుండి రాత్రి వరకు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.మెయిన్ రోడ్ లోని పలు ఇళ్లలోకి చేరిన వర్షపు నీటిని ఫైర్ ఇంజన్ మోటార్ సాయంతో తొలగించే ప్రయత్నం చేశారు సిబ్బంది.
హుస్నాబాద్‌లో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా, మల్లెచెట్టు చౌరస్తాలో భారీగా చేరిన వరదనీరు చిన్నపాటి కుంటలను తలపించింది. వరద నీటిలో వాహనదారులు రహదారిపై వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం లేక తీవ్ర ఎండలతో ఉక్కపోతకు గురైన పట్టణ ప్రజలకు భారీ వర్షం కురవడంతో వాతావరణం చల్లబడి కాస్త ఉపశమనం లభించింది.భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చిగురుమామిడి మండలం ఇందుర్తి- ఓగులాపూర్ మధ్య లోలెవల్ వంతెనపై ఎల్లమ్మవాగు ఉద్ధృతికి పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కోహెడ మండలం పోరెడ్డిపల్లి వద్ద మోయతుమ్మెద వాగు ఉద్ధృతికి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
కరీంనగర్ జిల్లా సైదాపూర్‌లో భారీ వర్షానికి పలు చెరువులు కుంటలు అలుగు పారుతున్నాయి.సోమారం మోడల్ స్కూల్ జలమయమైంది.హస్టల్లోకి భారీగా చేరిన వరదనీరు చేరడంతో విద్యార్థులు చిక్కుకున్నారు.దీంతో విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు ఉపాధ్యాయలు.జిల్లాలోకి వరి పొలాలు నీట ముననగడంతో రైతులు బోరుమంటున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో భారీ వర్షానికి 11,12 వార్డులు నీట మునిగాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా నిన్న భారీ వర్షాలు కురవడంతో ఇళ్లన్నీ నీట మునిగాయి. స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చి చేరడంతో రాత్రి వేరే ఇళ్లలో బస చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసరాలు కూడా నీట మునిగాయని అధికారులు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వెంటనే తగిన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సహాయక బృందాలతో పాటు స్థానిక మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.
భువనగిరి -చిట్యాల ప్రధాన రహదారిపై నాగిరెడ్డి పల్లి వద్ద లోలెవల్ వంతెనపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. నిన్నటితో పోలిస్తే ప్రవాహ వేగం కొంత మేర తగ్గింది. లోలెవల్ బ్రిడ్జికి ఓ వైపు నేల కోతకు గురైనట్లు అధికారులు గుర్తించారు. రాత్రి నుండి నుంచి ఇరు వైపులా పోలీసులు బారికేడ్‌లు ఏర్పాట్లు చేసి వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.నందనం పరిసర గ్రామాల చెరువులు అలుగు పారుతుండటంతో నాగిరెడ్డి పల్లి వద్ద కాలువ నిండుగా ప్రవహిస్తోంది. భువనగిరి – చిట్యాల ప్రధాన రహదారి పై వరద నీరు ప్రవహిస్తోంది. ద్విచక్ర ఇతర వాహన దారులు నాగిరెడ్డి పల్లి లోలెవల్ వంతెనను దాటడానికి ప్రయత్నం చేయవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Also Read: హద్దులు దాటుతున్న అమెరికా గన్ కల్చర్.. ట్రంప్ ఫ్రెండ్ చార్లీ కిర్క్ పై గన్ ఫైర్ దేనికి సంకేతం?
మరోవైపు ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో శనివారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.