School Bus Accident: జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక ప్రైవేట్ స్కూల్‌కు చెందిన బస్సు అదుపు తప్పి పొలంలోకి దూసుకుపోయి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 20 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. అదృష్టవశాత్తూ అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. కొంతమంది విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడగా, ఈ సంఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
ఘటన వివరాలు
శుక్రవారం ఉదయం విద్యార్థులను స్కూల్‌కు తీసుకెళ్తున్న ప్రైవేట్ స్కూల్ బస్సు.. సల్కాపురం వద్ద రోడ్డు వంపులో అదుపు కోల్పోయింది. బస్సు ఒక్కసారిగా కుడి వైపు జారిపడి పొలంలోకి దూసుకెళ్ళింది. ఆ తర్వాత వ్యాన్ ఒక్కసారి తిరగబడడంతో బస్సులో ఉన్న పిల్లలు భయాందోళనలకు గురయ్యారు. చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకుని, బస్సులో ఇరుక్కుపోయిన విద్యార్థులను బయటకు తీసారు.
విద్యార్థుల పరిస్థితి
సమాచారం అందిన వెంటనే తల్లిదండ్రులు, స్కూల్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. 20 మంది విద్యార్థులలో ఐదుగురికి స్వల్ప గాయాలు కావడంతో వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వైద్యులు విద్యార్థులను పరీక్షించి, ఎటువంటి ప్రాణాపాయం లేనట్లు తేల్చారు. మిగిలిన వారు భయంతో వణికిపోయినప్పటికీ, పెద్దగా ఎటువంటి గాయాలు లేకుండా బయటపడ్డారు.
కారణం ఏమిటి?
స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల చెప్పిన సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. బస్సును అధిక వేగంతో నడపడం, వంపు వద్ద సరైన నియంత్రణ పాటించకపోవడం వల్లే.. బస్సు అదుపు తప్పిందని వారు పేర్కొన్నారు. అంతేకాక, వ్యాన్ పరిస్థితి కూడా సరిగా లేనట్లు సమాచారం. వాహనం రోడ్డు మీద నడిపే ముందు సరిగా సర్వీసింగ్ చేయకపోవడం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వంటి అంశాలు కూడా బయటకొస్తున్నాయి.
తల్లిదండ్రుల ఆగ్రహం
ఈ సంఘటన తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఉదయం తమ పిల్లలను స్కూల్‌కు పంపిన వారు మధ్యాహ్నం ఈ వార్త విని షాక్‌కు గురయ్యారు. తమ పిల్లలు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. కానీ డ్రైవర్ నిర్లక్ష్యం వలన పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. స్కూల్ నిర్వాహకులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని చర్యలు తీసుకోవాలి అంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారుల స్పందన
అప్రమత్తమైన స్థానిక పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. వ్యాన్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. వాహనానికి సరైన అనుమతులు ఉన్నాయా, భద్రతా ప్రమాణాలు పాటించారా అనే విషయాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. విద్యార్థుల భద్రతను విస్మరించి ఇలాంటి నిర్లక్ష్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
Also Read: నిన్న బెంగళూరు.. నేడు తమిళనాడు.. రేపు..?
సామాజిక చర్చ
ఈ ఘటన మరోసారి స్కూల్ వాహనాల భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తింది. చాలాసార్లు స్కూల్ వాహనాలు రోడ్డు రూల్స్ పాటించకపోవడం, అధిక వేగం, మాన్యువల్ చెకప్ లేకుండా నడపడం వంటివి పెద్ద సమస్యలుగా మారుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఇలాంటి ప్రమాదాలు జరగగా, ప్రతి ఘటన తర్వాతే తాత్కాలిక చర్యలు తీసుకుంటారు. కానీ దీర్ఘకాలిక పరిష్కారం కోసం తగిన చర్యలు కనిపించడం లేదు.