Uttam Kumar Reddy: హుజుర్నగర్ పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలకు.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంక్రాంతి కానుక ప్రకటించారు. పట్టణ శివారులోనీ రామస్వామి గుట్టవద్ద 115 ఎకరాలలో ప్రభుత్వం నిర్మిస్తున్న 2160 ఇళ్లను.. పట్టణంలోని నిరుపేదలకు పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు.
మార్చి చివరి నాటికి హుజుర్నగర్ లోని రామస్వామి గుట్టవద్ద నిర్మిస్తున్న హౌజింగ్ కాలనీని.. పూర్తి చేస్తామని రాష్ట్ర ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇక్కడ నిర్మిస్తున్న 2160 ఇండ్లను రాష్ట్రంలోనే రోల్ మోడల్‌గా తీర్చి దిద్దుతామని ఆయన తెలిపారు.
బుధవారం ఉదయం సహచర రెవిన్యూ, గృహ నిర్మాణ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలసి.. హుజర్నగర్ లోని హౌజింగ్ బోర్డ్ కాలనీలో జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించారు.
అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. హుజుర్నగర్ పట్టణంలోని అర్హులైన నిరుపేదలకు ఇల్లు మంజూరు చేస్తామని ఆయన ప్రకటించారు. ఇందులో ఎటువంటి రాజకీయ జోక్యం ఉండదని అర్హులైన నిరుపేదలకు పారదర్శకంగా ఇల్లు మంజూరు చేయాలని.. ఆయన జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్‌ను ఆదేశించారు.
ఇళ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని.. ఇంజినీరింగ్ విభాగం అధికారులు నిశితంగా పరిశీలించాలని ఆయన అధికారులను ఆదేశించారు. పేదలకు మంజూరు చేసే ఇళ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించక పోతే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ఇక్కడ నిర్మిస్తున్న ఇండ్ల కాలనీ భవిష్యత్‌లో ఒక పట్టణంగా రూపాంతరం చెందనుందని ఈ కాలనీకి ప్రత్యేకంగా పాఠశాల భవనం, అంగన్ వాడి కేంద్రంతో పాటు కమ్యూనిటీ హాల్, క్రీడా ప్రాంగణం మంజూరు చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బి.ఎల్.ఆర్ జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్, ఎస్.పి నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో హౌసింగ్ శాఖామంత్రిగా తాను ఉన్న సమయంలో నిరుపేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వాలన్న తలంపుతో దేవాదాయ శాఖా భూములను.. ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి ఇక్కడ ఇండ్ల నిర్మాణం చేపట్టామన్నారు.
అయితే ఆ తరువాత అధికారంలోకి వచ్చిన బి.ఆర్.ఎస్ పాలకులు తన మీద ద్వేషంతో కుట్ర పురితంగా ఇండ్ల నిర్మాణాలను నిలిపి వేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో త్వరితగతిన పూర్తి చేసి నిరుపేదలకు అందించాలన్న తన బలమైన ఆకాంక్ష నేరవేర బోతున్నందుకు.. మహదానందంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
హుజుర్నగర్ లో 50 కోట్లతో నిర్మించిన పారిశ్రామిక శిక్షణా సంస్థ,అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ లలో మౌలిక సదుపాయాల కల్పనకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిధులు మంజూరు.
బుధవారం ఉదయం హుజుర్నగర్ పట్టణంలోని అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ వృత్తి నైపుణ్యం కోర్సులను అభ్యస్తూన్న విద్యార్థులతో ఆయన ముఖాముఖి చర్చించినారు. విద్యార్థులు రవాణా సౌకర్యంతో పాటు బాత్రూమ్‌ల ఆవశ్యకతను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వివరించారు.
తక్షణమే స్పందించిన ఆయన అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌కు.. అదేశాల లిస్టు మౌలిక సదుపాయాల కల్పన పై దృష్టి సారించాలన్నారు. శిక్షణ పొందుతున్న 172 మంది విద్యార్థుల నుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. వృత్తి విద్య కోర్సులను పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆయన తెలిపారు.
హుజుర్నగర్ ఆర్.డి.ఓ కార్యక్రమంలో జరిగిన కల్యాణలక్ష్మీ/షాదిముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని కోటి 71 లక్షల రూపాయల చెక్ లను లబ్ధిదారులకు అంద జేశారు.
ఇదిలా ఉండగా హుజుర్నగర్ పట్టణంలో నిర్మిస్తున్న డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాలతో పాటు రోడ్లు భవనాల వసతి గృహం,షాపింగ్ కాంప్లెక్స్,రోడ్లు భవనాల డివిజన్ కార్యాలయం,నీటిపారుదల కార్యాలయ భవనాల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. వాటి పురోగతిని పై అధికారులను అడిగి తెలుసు కొని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇదే కార్యక్రమంలో పాల్గొన్నమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వాలన్న బలమైన తలంపుతో ఉమ్మడి ఆంద్రప్రదేశ లో ఇంత పెద్ద ఎత్తున ఇండ్ల నిర్మాణం చేపట్టిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభినంద నీయుడని కొనియాడారు.
అదే సమయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా.. ఇక్కడ 2160 ఇండ్ల నిర్మాణము పూర్తి కావడంతో పాటు ఈ నియోజకవర్గానికి మరో 3500 ఇండ్లు మంజూరు అయ్యాయని, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజుర్నగర్ నియోజకవర్గానికి మొత్తం 5660 ఇండ్లు మంజూరు కావడం ఆయన కోరుకున్న ఆకాంక్ష నెరవేరుతుందని చెప్పారు.