Hyderabad Security: నగరంలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు పాల్పడతామంటూ వచ్చిన బెదిరింపు ఈ మెయిల్ నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసులు తక్షణమే అప్రమత్తమయ్యారు. ప్రజల భద్రత దృష్ట్యా నగరవ్యాప్తంగా భద్రతా చర్యలను ముమ్మరం చేసినట్టు హైదరాబాద్ సీపీ మహేష్ భగవత్ తెలిపారు.
బెదిరింపు ఈ మెయిల్ అందిన వెంటనే పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. అనుమానాస్పద ప్రాంతాలు, రద్దీ ప్రదేశాల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో విస్తృతంగా యాంటీ-సబోటేజ్ తనిఖీలు నిర్వహించారు. ప్రజల్లో భరోసా కల్పించేందుకు, శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు నగరంలోని కీలక కూడళ్లు, జనసమ్మర్ధ ప్రాంతాల్లో విజిబుల్ పోలీసింగ్ ను పెంచారు.
మరోవైపు బెదిరింపు ఈ మెయిల్ పంపిన ఆగంతకులను గుర్తించేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ మెయిల్ ఐపీ అడ్రస్, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుల జాడను కనిపెట్టేందుకు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనపై సోషల్ మీడియాలో గానీ, బయట గానీ వచ్చే ఎలాంటి వదంతులను ప్రజలు నమ్మవద్దని, వాటిని ఇతరులకు షేర్ చేయవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా సంయమనం పాటిస్తూ ప్రశాంతంగా ఉండాలని కోరారు. నగరంలో ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, లేదా యజమానులు లేని వస్తువులు (బ్యాగులు, పార్శిళ్లు మొదలైనవి) కంటపడినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 112 డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రతి పౌరుడి ప్రాణ, ఆస్తుల భద్రతకు హైదరాబాద్ పోలీసులు 24 గంటలూ అందుబాటులో ఉంటారని, శాంతిభద్రతల పరిరక్షణకు పూర్తిగా కట్టుబడి ఉన్నారని కమిషనర్ స్పష్టం చేశారు.
Also read: హైదరాబాద్‌కు బాంబు బెదిరింపు కలకలం.. పోలీసులు హై అలర్ట్!