Hyderabad Bus Metro Pass:బస్సు ఎక్కితే ఒక పాస్ ..మెట్రో ఎక్కితే మరో పాస్ ..ఇదీ ఇప్పటి వరకు ఉన్న లెక్క .కానీ ఇపుడు లెక్క మారబోతుంది.అవును …ఇకపై హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సు, మెట్రో రైలులో జర్నీ చేసేందుకు వేర్వేరుగా పాస్‌లు తీసుకోవాల్సిన అవసరం లేదంటూ గుడ్ న్యూస్ చెబుతుంది తెలంగాణ సర్కార్ .
ఇందులో భాగంగా తెలంగాణ ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో రైలుకు కలిపి ఉమ్మడి పాస్ విధానం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది.ఇక దీనికి సంబంధించి కార్యాచరణను వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారట కూడా.
రెంటికి వేర్వేరు పాసులు ఉండటంతో
హైదరాబాద్‌లో ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు,రోజువారీ పనుల కోసం నగరంలో తిరిగే లక్షలాది మంది ప్రజలు ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లను ఉపయోగిస్తున్నారన్న సంగతి తెల్సిందే.
అయితే ఇప్పటివరకు దేని పాస్ దానికే ఉంది.ఇలా రెంటికి వేర్వేరు పాసులు ఉండటంతో ప్రయాణికులకు ఖర్చుతో పాటు సమయం కూడా ఎక్కువ పడుతున్న పరిస్థితి.మొత్తానికి ఈ సమస్యకు చెక్ పెడుతూ ఉమ్మడి పాస్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచన చేయడం మెచ్చుకోతగ్గ విషయం.
ఇక ఈ నిర్ణయం కాస్తా అమల్లోకి వస్తే ఒకే పాస్‌తో ఆర్టీసీ, మెట్రో సేవలను వినియోగించుకునే అవకాశం ఉంటుందన్న మాట .. ముఖ్యంగా ప్రతిరోజూ ఒకే రూట్‌లో ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులకు ఇది ఉపయోగకరంగా మారనుంది. ఇంటి దగ్గర నుంచి మెట్రో స్టేషన్ వరకు ఆర్టీసీ బస్సులో వెళ్లి, అక్కడి నుంచి మెట్రోలో తమ స్థానాలకు చేరుకునే వారికి ఈ నిర్ణయం ఎంతో లాభదాయకం అనే చెప్పాలి.
ప్రయాణికులకు భారం కాకుండా
ఇక ఇప్పటికే ఈ ఉమ్మడి పాస్ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ, మెట్రో అధికారులు ప్రభుత్వానికి వివరించినట్లు తెలుస్తోంది. దీంతో ఇక ప్రధానంగా చార్జీలను ఎలా నిర్ణయించాలి? ఏ మార్గాల్లో పాస్ చెల్లుబాటు అవుతుంది? రోజువారీ, నెలవారీ పాస్‌ల ధరలు ఎంత ఉండాలి? వంటి అంశాలపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందట.
అయితే మెట్రో, ఆర్టీసీ రెండింటి ప్రయాణ చార్జీలను కలిపి ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా ధరలను ఫిక్స్ చేయాలని సీఎస్ సంజయ్ జాజు అధికారులకు సూచించారని సమాచారం. చార్జీల నిర్ణయంలో ప్రయాణికులకు భారం కాకుండా ,రెండు రవాణా సంస్థలకు ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ధరల్ని ఫిక్స్ చేసే అవకాశం కనిపిస్తుంది.
సులభంగా మారే సౌకర్యం ఉంటే
ఏది ఏమైనా హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ ఎక్కువవుతున్న ఈవిధంగా కొత్త విధానం తీసుకువస్తే రోడ్లపై రద్దీ ఏమైనా తగ్గే అవకాశం ఉంటుందేమో చూడాలి .
మొత్తానికి ఒకే పాస్‌తో బస్సు నుంచి మెట్రోకు, మెట్రో నుంచి బస్సుకు సులభంగా మారే సౌకర్యం ఉంటే హైదరాబాద్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందనడం లో సందేహం లేదు .
Also read :తెలంగాణలో ఈవీ వాహనదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్!
ముఖ్యంగా మెట్రో స్టేషన్లకు నేరుగా చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులను ఉపయోగించే ప్రయాణికులకు ఈ ఇంటిగ్రేటెడ్ పాస్ విధానం బాగా ఉపయోగపడుతుంది కూడా.
మొత్తానికి.. హైదరాబాద్‌లో రోజూ బస్సు, మెట్రో రెండింటినీ ఉపయోగించే వారికి ఇది నిజంగా రిలీఫ్ ఇచ్చే నిర్ణయమే అని చెప్పకతప్పదు.