Tukkuguda Nurse Murder Case:తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సు హత్యాచారానికి గురైన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఈ కేసుపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఘటనకు సంబంధించిన అన్ని విషయాలపై మేజిస్టీరియల్ విచారణ చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. అసలు ఘటన ఎలా జరిగింది? దానికి కారణాలు ఏంటి? నర్సు ఉంటున్న ప్రాంతంలో భద్రత ఎలా ఉంది? అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారా? సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా? వంటి అంశాలను కూడా విచారణలో పరిశీలించాలని చెప్పారు.
అలాగే ఆసుపత్రి యాజమాన్యం ఉద్యోగుల భద్రత విషయంలో నిర్లక్ష్యం చేసిందా? మహిళా ఉద్యోగుల రక్షణ కోసం ప్రభుత్వం సూచించిన నిబంధనలు అమలు చేశారా? అనే విషయాలను కూడా అధికారులు పరిశీలించనున్నారు.
దర్యాప్తు వేగంగా పూర్తి చేయాలి
ఈ కేసులో నిందితుడిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో దర్యాప్తును మరింత వేగంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
కేసుకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికలు, సాంకేతిక ఆధారాలు, ఇతర సాక్ష్యాలను త్వరగా సేకరించాలని సూచించారు. అన్ని ఆధారాలను పరిశీలించి త్వరగా ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు చెప్పారు.
నిందితుడికి చట్ట ప్రకారం శిక్ష పడేలా దర్యాప్తు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. పోలీసుల దర్యాప్తుతో పాటు ప్రాసిక్యూషన్ కూడా బలంగా ఉండాలని సూచించారు.
ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ
బాధిత కుటుంబానికి త్వరగా న్యాయం అందేలా కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారించే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.కేసు విషయంలో పోలీసు శాఖ, న్యాయశాఖ, ప్రాసిక్యూషన్ అధికారులు కలిసి పనిచేయాలని సూచించారు. విచారణలో ఎలాంటి ఆలస్యం లేకుండా చూడాలని చెప్పారు.
అంతేకాదు.. ఈ ఘటనకు కారణమైన భద్రతా లోపాలు ఏమైనా ఉంటే వాటిని గుర్తించి వెంటనే సరిచేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించే విషయంలో సంస్థలు నిర్లక్ష్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండ
బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క కుటుంబాన్ని పరామర్శించారు.ప్రభుత్వం తరఫున కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేయడం విశేషం.
also read:సీఎం రేవంత్ వ్యూహం వర్సెస్ బీఆర్ఎస్ కౌంటర్.. తెలంగాణ అసెంబ్లీలో ఏం జరగబోతోంది?