న్యూ ఇయర్ వేడుకల వేళ నిబంధనలు ఉల్లంఘించి, రోడ్లపై హంగామా సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హద్దు మీరితే హ్యాపీ న్యూ ఇయర్ ఉండదని అన్నారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (TGICCC) వేదికగా క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి, న్యూ ఇయర్ బందోబస్తు ఏర్పాట్లపై క్షేత్రస్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వేడుకల నిర్వహణకు సంబంధించి పోలీసు శాఖ తీసుకున్న కీలక నిర్ణయాలను వెల్లడించారు.
మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఉక్కుపాదం మోపేందుకు బుధవారం నుంచే నగరవ్యాప్తంగా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్స్ ప్రారంభించనున్నట్లు సీపీ తెలిపారు. ముఖ్యంగా డిసెంబర్ 31 రాత్రి 100కు పైగా ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం 7 ప్లాటూన్ల అదనపు బలగాలను కేటాయించారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే వాహనం సీజ్ చేయడంతో పాటు 10 వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉందని, అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేస్తామని హెచ్చరించారు. పార్టీలకు వెళ్లేవారు ముందుగానే క్యాబ్‌లను ఆశ్రయించాలని లేదా మద్యం సేవించని ‘డెసిగ్నేటెడ్ డ్రైవర్’ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
డిసెంబర్ 31 రాత్రి పబ్‌లు, త్రీస్టార్, ఆపై స్థాయి హోటళ్లలో వేడుకలకు అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే అనుమతి ఉంటుందని సీపీ స్పష్టం చేశారు. శబ్ద కాలుష్య నిబంధనలు ఉల్లంఘిస్తే సౌండ్ సిస్టమ్‌లను సీజ్ చేస్తామన్నారు. ఈవెంట్లలో గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం జరిగినా, అశ్లీల నృత్యాలకు తావిచ్చినా యాజమాన్యాలదే పూర్తి బాధ్యత అని, అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. యువత రోడ్లపై రేసింగ్‌లు, వీలింగ్‌లు, ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడితే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు.
వేడుకల్లో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నట్లు సీపీ వివరించారు. రద్దీ ప్రాంతాలు, పార్టీ వేదికల వద్ద 15 షీ టీమ్స్ మఫ్టీలో నిఘా ఉంచుతాయని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని తక్షణమే అరెస్టు చేస్తామని వెల్లడించారు. గతంలో నేరాలు జరిగిన ప్రాంతాలు (హాట్ స్పాట్లు), పాత నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు.
2026 స్వాగత వేడుకలు ప్రజల జీవితాల్లో తీపి జ్ఞాపకాలుగా మిగలాలని, చట్టాన్ని గౌరవిస్తూ సురక్షితంగా వేడుకలు జరుపుకోవాలని సీపీ కోరారు. ఈ సమావేశంలో అదనపు సీపీ ఎం. శ్రీనివాసులు, డీసీపీలు ఎన్. శ్వేత, రక్షితా కృష్ణమూర్తి, రూపేష్, వెంకటేశ్వర్లు, అరవింద్ బాబు, లావణ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ALSO READ: Indian Railways: ఇండియన్ రైల్వేలో 4వేలకు పైగా ఉద్యోగాలు.. దరఖాస్తు ఫీజు రూ.100 మాత్రమే, డోంట్ మిస్