హైదరాబాద్ నగర శివార్లలోని వీధి కుక్కల రక్తంతో వ్యాపారం చేస్తున్న ఉదంతం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ అమానుష ఘటనపై అనిమల్ హస్బెండ్రీ సైబరాబాద్ మున్సిపల్ అధికారులు తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ దారుణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వెటర్నరీ డాక్టర్ వెంకటేష్ యాదవ్‌ను అనిమల్ హస్బెండ్రీ డైరెక్టర్ ఇప్పటికే సస్పెండ్ చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ క్రియాలిటీ అగైన్స్ట్ అనిమల్స్ యాక్ట్ కింద ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
నిబంధనల ప్రకారం ఏదైనా జంతువు నుండి రక్తం సేకరించాలంటే సదరు యజమాని అనుమతి తప్పనిసరి. కేవలం పెంపుడు కుక్కల నుండి మాత్రమే అది కూడా వాటి ఆరోగ్య పరిస్థితిని బట్టి రక్తం తీసుకోవాల్సి ఉంటుంది. వీధి కుక్కలను పట్టుకుని వాటి నుండి ఇష్టం వచ్చినట్లు రక్తం సేకరించడం చట్టరీత్యా నేరం. ఈ ప్రాథమిక సూత్రాలను తుంగలో తొక్కి పెట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం వ్యాపారమే పరమావధిగా వ్యవహరించినట్లు విచారణలో తేలింది.
మున్సిపల్ అధికారుల తనిఖీల్లో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. సదరు హాస్పిటల్ ఇన్ని రోజులు ఎటువంటి అధికారిక లైసెన్స్ లేకుండానే కార్యకలాపాలు సాగించినట్లు గుర్తించారు. వీధి కుక్కల రక్తంతో దందా చేస్తున్నట్లు వార్తలు బయటకు రావడంతోనే యాజమాన్యం హడావుడిగా ట్రేడ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉండటంతో ఆ దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంది.
ఈ దారుణంపై ఇప్పటికే హెల్త్ మున్సిపల్ శాఖలతో పాటు అనిమల్ హస్బెండ్రీ అధికారుల సంయుక్త బృందం విచారణ పూర్తి చేసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తూ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించింది. ఆ రిపోర్ట్ ఆధారంగా ఒకటి రెండు రోజుల్లోనే సదరు హాస్పిటల్‌ను సీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మూగజీవాలను హింసించి వాటి రక్తంతో కోట్లు గడిస్తున్న ఈ ముఠా వెనుక ఉన్న ఇతర వ్యక్తులపై కూడా దృష్టి సారించారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ALSO READ: కొండగట్టులో భక్తుల రద్దీ.. ఆర్జిత సేవలు తాత్కాలిక రద్దు, 4 రోజులు స్పెషల్ దర్శనాలే..!