International Schools: స్వేచ్ఛ, బ్యూరో : తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఇప్పుడు అంతర్జాతీయ విద్యా సంస్థలకు ప్రధాన చిరునామాగా మారుతోంది. హైదరాబాద్ విద్యా హబ్‌గా మరో అంతర్జాతీయ మైలురాయిని చేరుకోనుంది. నగరంలోని మౌలిక సదుపాయాలు, జీవన ప్రమాణాలకు ఆకర్షితులైన బ్రిటన్ విద్యా సంస్థలు ఇక్కడ తమ శాఖలను ప్రారంభించేందుకు క్యూ కడుతున్నాయి. దాదాపు 13 ప్రఖ్యాత బ్రిటన్ పాఠశాలలు హైదరాబాద్‌లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. తెలంగాణలో అంతర్జాతీయ పాఠశాలల స్థాపనపై యూకే ప్రతినిధులతో ఉన్నత స్థాయి భేటీ జరిగింది. ఇప్పటికే యూకే హైకమిషన్‌తో విద్యాశాఖ కీలక భేటీ నిర్వహించింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతం, అంతర్జాతీయ పాఠశాలల ఏర్పాటుపై చర్చించారు. ఈ భేటీలో పాఠశాలల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు, నిబంధనలు, ఇతర ప్రక్రియలపై రాష్ట్ర అధికారులు బ్రిటన్ బృందానికి పూర్తిస్థాయిలో వివరించారు.
తెలంగాణలో పాఠశాలల స్థాపనకు అవసరమైన అనుమతులు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, కేంబ్రిడ్జ్ అనుబంధ గుర్తింపు కోసం ప్రభుత్వం జారీ చేసే ఎన్ వోసీ ప్రక్రియను డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ యేకే ప్రతినిధులకు వివరించారు. పాఠశాల అనుమతులు, క్లియరెన్స్‌ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఆన్‌లైన్ పోర్టల్ పనితీరును సైతం ఆయన వివరించారు. ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉంటుందని ప్రతినిధులకు స్పష్టంచేశారు. ఈ భేటీలో భాగంగా ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలను నెలకొల్పాలని ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక.. యూకే ప్రతినిధులను ఆహ్వానించారు.
Also Read: IPL 2026: KKR జట్టులో కామాంధులు..ఇద్దరు అమ్మాయిలతో హోటల్ లో రొమాన్స్..మైక్ ముందే వాగేసిన బ్రావో
కాగా సైబరాబాద్ కార్పొరేషన్ కమిషనర్ సృజన విద్యా సంస్థలకు వర్తించే భవన భద్రతా ప్రమాణాలు, ఫైర్ ఎన్ వోసీ, ఇతర ధృవీకరణపత్రాల జారీకి సంబంధించిన ఏకీకృత డిజిటల్ వ్యవస్థపై యూకే ప్రతినిధులకు అవగాహన కల్పించారు. భారత్ ఫ్యూచర్ సిటీ లేదా ఔటర్ రింగ్ రోడ్ సమీప ప్రాంతాల్లో ఈ పాఠశాలలు ఏర్పాటు చేయాలని సర్కార్ భావిస్తోంది. కాగా ప్రభుత్వం వీటి కోసం ఒక ప్రత్యేక ఎడ్యుకేషన్ జోన్‌ను కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కేవలం పాఠశాలలే కాకుండా, టాప్ యూకే యూనివర్సిటీలు సైతం హైదరాబాద్‌లో తమ ఆఫ్-క్యాంపస్ సెంటర్లను ఏర్పాటు చేసే అంశంపై చర్చలు తుది దశలో ఉన్నట్లు సమాచారం. ఈ అంతర్జాతీయ విద్యా సంస్థల రాకతో తెలంగాణ విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలు స్థానికంగానే అందుబాటులోకి రానున్నాయి. ఇది రాష్ట్రాన్ని గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించనుంది.
రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వనుంది. ఈ అంశాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజా ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్ ఇలాక అయిన గజ్వేల్ లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ప్రారంభించనుంది. ఈమేరకు ఉత్తర్వులు కూడా జారీచేసింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా సంస్కరణల్లో భాగంగా దీన్ని ఏర్పాటుచేయనుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పాఠశాల మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం రూ.16.62 కోట్లను మంజూరు చేసింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఈ పాఠశాలను అధికారికంగా ప్రారంభించనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రీ-ప్రైమరీ నుంచి 8వ తరగతి వరకు తరగతులు ప్రారంభమవుతాయి. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు క్లాసులను 2027-28 విద్యా సంవత్సరం నుంచి నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు తెలంగాణ విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ పర్యవేక్షించనుంది.
రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.1011.65 కోట్ల భారీ బడ్జెట్‌ను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అందులో భాగంగా కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(క్యూర్) ప్రాంతాల్లోరూ.496.75 కోట్లతో 11 కొత్త సమీకృత పాఠశాల సముదాయ భవనాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించరనుంది. ఇవి మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఏర్పాటు కానున్నాయి. వీటితో పాటు ఇప్పటికే ఉన్న 17 ప్రభుత్వ పాఠశాలలను రూ.364.60 కోట్లతో అప్‌గ్రేడ్ చేయనున్నారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 164 ప్రభుత్వ పాఠశాలల్లో రూ.150.30 కోట్లతో 501 అదనపు తరగతి గదులను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల్లో 30 శాతం రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లేదా సీఎస్ఆర్ నిధుల ద్వారా సమకూర్చనున్నారు. మిగిలిన 70 శాతం నిధులను ఏషియన్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్(ఏఐఐబీ) నుంచి రుణ సహాయం ద్వారా సమకూర్చుకోనున్నారు. ఈ పనుల అమలు బాధ్యతను కూడా టీజీఈడబ్ల్యూఐడీసీ సంస్థకు సర్కార్ అప్పగించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆర్వో నీటి ప్లాంట్ల ఏర్పాటుకు రూ.10 కోట్ల బడ్జెట్‌ను విడుదల చేయాలని తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శికి లేఖ రాశారు. రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు 2026-2027 విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం విజయవంతం కావాలంటే విద్యార్థులకు తప్పనిసరిగా స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉండాలి.
అందుకే ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు అవసరమని లేఖలో పేర్కొన్నారు. వీటి ఏర్పాటుకు బోర్డు నుంచి రూ.10 కోట్లు మంజూరు చేయాలని కోరారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల నిర్వహణ కోసం 2026-27 విద్యా సంవత్సరానికి గానూ రూ.5,25,91,000(రూ.ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల తొంభై ఒక్క వేలు) కేటాయించాలని లేఖలో పేర్కొన్నారు. ఈ నిధులను కళాశాలల్లోని టాయిలెట్ల శుభ్రత, మొక్కలకు నీరు పోయడం, ప్రాంగణాల నిర్వహణ కోసం వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. 30 లోపు విద్యార్థులుంటే ఆ కాలేజీకి రూ.3,000 చొప్పున, 750 కంటే ఎక్కువ మంది ఉంటే రూ.20,000 వరకు అందజేయాలని ప్రతిపాదించారు. ఇదిలాఉండగా 2025-26 విద్యా సంవత్సరం జూన్ నుంచి ఫిబ్రవరి వరకు 8 నెలల కాలానికి ఇప్పటికే రూ. 3.87 కోట్లు ఖర్చు చేసినట్లు లేఖలో ప్రస్తావించారు. మిగిలిన మూడు నెలల నిధులను యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించిన వెంటనే విడుదలవ్వనునాయి.