CP Sajjanar: హైదరాబాద్ కూకట్ పల్లిలో ఐదేళ్ల చిన్నారిని మృత్యు మాంజా బలితీసుకుంది. ఎంతో సరదాగా తండ్రితో బైక్ పై కబుర్లు చెబుతున్న వెళుతున్న.. ఆ చిన్నారిని మృత్యు మాంజా మెడకు చుట్టేసింది. తన కళ్ల ముందే కూతురి ప్రాణాలు పోతుంటే.. ఆ తండ్రి పడిన వేదన వర్ణనాతీతం. ఈ ఘటనపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పందించారు.
“గుండె తరుక్కుపోతోంది. అభం శుభం తెలియని ఈ ఐదేళ్ల చిన్నారి చేసిన నేరమేంటి? నాన్న బైక్ ముందు సీట్లో కూర్చుని, ఇంటికి వెళ్తున్నామని సంబరపడే లోపే.. మృత్యువు ‘మాంజా’ రూపంలో ఆమె మెడకు చుట్టుకుంది. ఆ చిన్నారి గొంతు తెగిపోతుంటే ఆ తండ్రి పడ్డ ఆవేదనకు ఎవరు బాధ్యులు? సంక్రాంతి అంటే సంతోషాలు పంచుకోవడం.. ఇలా శోకాన్ని మిల్చడం కాదు కదా. కొందరు తమ ఆనందం కోసం వాడే చైనా మాంజా ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. గుర్తుంచుకోండి.. అది కేవలం దారం కాదు, గాలిలో వేలాడే పదునైన కత్తి. దయచేసి ప్లాస్టిక్/నైలాన్ మాంజాను వాడకండి. పిల్లల చేతికి మరణాయుధాలను ఇవ్వకండి. మాంజా అమ్మితే ఉపేక్షించం.. వాడితే వదిలిపెట్టం” – సీపీ సజ్జనార్
చైనా మాంజాకు 5 ఏళ్ల చిన్నారి బలైంది. తండ్రి బైక్ పై ముందు కూర్చున్న బాలిక మెడకు మాంజా చుట్టుకోవడంతో ఈ దారుణం జరిగింది. హైదరాబాద్ కూకట్ పల్లి రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఏపీ కోనసీమ జిల్లాలోని అంబాజీపేటకు చెందిన డి.రాంసాగర్, పద్మావతి హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు కాగా చిన్న కుమార్తె నిశ్వికాదిత్య స్థానికంగా ఉన్న స్కూల్ లో ఎల్.కె.జి చదువుతుంది. వీరు ఇటీవలె ఇల్లు కొనుగోలు చేశారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసేందుకు భార్యాభర్తలు చిన్నారిని తీసుకుని బయటికొచ్చారు.
Also Read: హైదరాబాద్ మరో దారుణ ఘటన.. ఐదేళ్ల బాలిక ప్రాణం తీసిన చైనా మాంజా
సోమవారం మధ్యాహ్నం కూకట్ పల్లిలోని ఓ జ్యువెల్లరీ షాపునకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బైక్ పై వెళ్తున్నప్పుడు నిశ్వికాదిత్య ముందు కూర్చుంది. సుమిత్రానగర్ వద్దకు రాగానే అకస్మాత్తుగా బాలిక కేకలు పెట్టింది. దీంతో తండ్రి బైక్ ఆపి చూడగా చిన్నారి మెడకు చైనా మాంజా చుట్టుకుని, తీవ్రగాయం అయింది. బాలికను వెంటనే దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలిక ప్రాణాలు విడిచింది. చిన్నారి ఆసుపత్రికి వచ్చేసరికే తీవ్రంగా రక్తస్రావమైందని, మెడ రెండున్నర అంగుళాల మేర తెగిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కూకట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.