IDPL Land Dispute: హైదరాబాద్ నగరంలోని ఐడీపీఎల్ భూముల వివాదం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. వేల కోట్ల రూపాయల విలువైన ఈ భూములపై వెల్లువెత్తిన ఆరోపణలు రాజకీయ వర్గాలను కుదిపేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐడీపీఎల్ భూముల వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేస్తూ, పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చింది.
కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని సర్వే నంబర్ 376లో ఉన్న ఐడీపీఎల్ భూములపై.. గత కొంతకాలంగా అనుమానాస్పద లావాదేవీలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల విలువైన ఈ భూములు అక్రమంగా కబ్జా అయ్యాయన్న వాదనలు చర్చకు వచ్చాయి. ఈ నేపథ్యంలో భూముల అసలు యాజమాన్యం, గతంలో జరిగిన లావాదేవీలు, బదిలీలు, అక్రమ కబ్జాలపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వం విజిలెన్స్ అధికారులను ఆదేశించింది.
ఈ భూముల వివాదం రాజకీయ రంగు పులుముకోవడానికి ప్రధాన కారణం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత మధ్య చోటుచేసుకున్న పరస్పర ఆరోపణలే. ఇటీవల ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేసుకోవడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. దీంతో ఐడీపీఎల్ భూముల అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆయన కుమారుడు ఐడీపీఎల్ భూములను.. అక్రమంగా కబ్జా చేశారంటూ బహిరంగంగా ఆరోపణలు చేశారు. భూముల లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని, అధికారుల సహకారంతో భూకబ్జాలకు పాల్పడ్డారంటూ ఆమె విమర్శించారు. దీనికి ప్రతిగా మాధవరం కృష్ణారావు కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు. కవిత భర్త అనిల్ ఐడీపీఎల్ భూముల కబ్జాల్లో కీలక పాత్ర పోషించారని ఆయన ఆరోపించారు.
ఈ పరస్పర ఆరోపణలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. నిజానిజాలు తేల్చాలనే డిమాండ్ అన్ని వర్గాల నుంచి వినిపించడంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విచారణలో భూముల అసలు రికార్డులు, గత ప్రభుత్వాల కాలంలో జరిగిన ఒప్పందాలు, లీజులు, బదిలీలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.
Also Read: అక్కడ పోలింగ్ బహిష్కరణ.. ఆ జీవో ఇస్తేనే ఓటేస్తామన్న గ్రామస్తులు!
ఇప్పటికే ఈ వివాదం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. విజిలెన్స్ విచారణ ప్రారంభమైతే మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.