New Secretariat : తెలంగాణ కొత్త సచివాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఉదయం నుంచే వాస్తు పూజ, యాగం నిర్వహిస్తున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు పూజల్లో పాల్గొన్నారు. కేసీఆర్ మధ్యాహ్నం ఒంటి గంటకు సచివాలయానికి చేరుకుంటారు.
తొలుత ప్రధాన ప్రవేశ గేటు వద్ద కేసీఆర్ పూజ నిర్వహిస్తారు. హోమశాల వద్ద యాగ పూర్ణాహుతిలో పాల్గొంటారు. ఆ తర్వాత ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని సచివాలయాన్ని ప్రారంభిస్తారు. అక్కడ నుంచి ఆరో అంతస్తులోని తన ఛాంబరుకు చేరుకుంటారు. పలు దస్త్రాలపై కేసీఆర్ సంతకాలు చేసి కొత్త సచివాలయం నుంచి పరిపాలనను ప్రారంభిస్తారు. కేసీఆర్ తన ఛాంబరుకు వెళ్లే సమయంలో అక్కడకి మంత్రులు, ఉన్నతాధికారులు ఎవరూ రావద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు మధ్యాహ్నం ఒంటి గంటకల్లా తమ ఛాంబర్ల వద్ద ఉండాలి. మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు మధ్యాహ్నం 1.58 గంటల నుంచి 2.04 గంటల మధ్య తమ ఛాంబర్లలో ఆసీనులై దస్త్రాలపై సంతకాలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ ప్రక్రియ పూర్తికాగానే అందరూ గ్రౌండ్ ఫ్లోర్ కు చేరుకుని సమావేశంలో పాల్గొంటారు. 2.15 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశ వేదికకు చేరుకుని తన సందేశాన్ని ఇస్తారు.
సచివాలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. రంగురంగుల పూలున్న కుండీలను ఏర్పాటు చేశారు. ప్రధాన గేట్లను పూలమాలలతో అలంకరించారు. సచివాలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు రాత్రి 8 గంటల వరకు కొనసాగుతాయి. హుస్సేన్‌సాగర్ పరిసరాలు, నెక్లెస్ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.తెలుగు తల్లి జంక్షన్‌లో వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌పై వాహనాలకు ఎంట్రీ లేదు. ట్యాంక్‌బండ్, తెలుగుతల్లి, బీఆర్‌కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్‌లో వాహనాలకు అనుమతి ఇవ్వడంలేదు. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పార్కులను మూసివేశారు.