Train Ticket Regret Sankranti-2026: సంక్రాంతి-2026 పండుగ ఏమో గానీ, బుకింగ్ ఓపెన్ చేసిన క్షణాల్లో అన్ని రైళ్ల టికెట్లు బుక్కైపోయాయి. తెలంగాణ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్ల టికెట్లు కేవలం 5 నిమిషాల్లో అమ్ముడుపోయాయి. టికెట్లు దొరక్క చాలా మంది నిరాశకు గురయ్యారు. ఇక తమకు స్పెషల్ ట్రైన్లు దిక్కని అంటున్నారు.
ప్రయాణికులకు సంక్రాంతి-2026 టెన్షన్
రిజర్వేషన్ల కోసం ఇండియన్ రైల్వే కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. గతంలో మూడు నెలలకు ముందు ప్రయాణికులు రిజర్వేషన్లు చేసుకునేవారు. ప్రస్తుతం దాన్ని రెండు నెలలకు కుదించారు. అన్నింటి కంటే ముందుగా చెప్పుకోవాల్సింది వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ. రెండు నెలలు ముందుగా రైల్వే టికెట్లు బుక్కయిపోయాయి. చాలా రైళ్లకు రిగ్రెట్ అని వచ్చేసింది. దీంతో ఏం చెయ్యాలో ప్రయాణికులకు తెలియడం లేదు.
వచ్చే ఏడాది భోగి పండుగ జనవరి 13న వచ్చింది. ఆ రోజు మంగళవారం కావడంతో ముందుగానే ప్రయాణికులు రైళ్ల టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. టెక్ ఉద్యోగులతోపాటు చాలామంది శుక్రవారం నుంచి టికెట్లు బుక్ చేసుకోవడం మొదలుపెట్టారు. మరికొందరు సోమ, మంగళవారం నుంచి ఆయా తేదీలకు బుకింగ్ మొదలుపెట్టారు.
బుకింగ్ ఓపెనైన ఐదు నిమిషాలకే రిగ్రెట్
బుకింగ్ ఓపెన్ కాగానే కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో టికెట్లు అయిపోయాయి. చాలా రైళ్లకు రిగ్రెట్ అని వచ్చింది. దీంతో ప్రయాణికులు నిరాశకు గురయ్యారు. చాలామంది ఆధార్ లింక్ చేసుకోలేదు. చివరకు ఆధార్‌కు లింకు చేసేసరికి దాదాపుగా అన్ని రైళ్లకు టికెట్లు అయిపోయారు. కొన్నింటికి 150 వరకు వెయిటింగ్ లిస్టు రాగా, మరికొన్నింటికి రిగ్రెట్ అని వచ్చింది.
ముఖ్యంగా తెలంగాణ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు దాదాపు డజనుకు పైగా రైళ్లు ఉన్నాయి. జన్మభూమి, ఈస్ట్‌కోస్ట్, విశాఖ ఎక్స్‌ప్రెస్, గోదావరి, ఫలక్‌నుమా, గరీభ్‌రథ్ వంటి సూపర్ ఫాస్ట్ రైళ్లతోపాటు కోణార్క్ , మహబూబ్ నగర్- విశాఖ వంటి రైళ్లకు చాంతాండత వెయిటింగ్ లిస్టు వచ్చేసింది. దీంతో జంట నగరాల నుంచి ఏపీలోని సొంతూళ్లకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నవారు ఆవేదన చెందుతున్నారు.
ALSO READ: జూబ్లీహిల్స్ పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
తమకు స్పెషల్ రైళ్లు మాత్రమే దిక్కని అంటున్నారు. ఇప్పుడు ప్రజల చూపంతా ప్రత్యేక రైళ్లపై పడింది. ఆ రైళ్ల గురించి చెప్పనక్కర్లేదు. అనుకున్న సమయానికి బయలుదేరినా.. రైట్ టైమ్‌కు వెళ్లవు. అంతేకాదు ఆ సమయంలో రైళ్లు ఎక్కువగా ఉండడంతో గంటల తరబడి ఎక్కడపడితే అక్కడ అపేస్తుంటారు. ఈసారి సంక్రాంతికి రైలు ప్రయాణికులు కష్టాలు తప్పవనే సంకేతాలు అప్పుడే మొదలయ్యాయి.