ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాలు ప్రయాణీకులలో భయాందోళనలు కలిగిస్తున్నాయి. నెల్లూరులో ప్రైవేట్ బస్సు అగ్నిప్రమాదం, రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ మరువక ముందే నల్లగొండ జిల్లాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో, క్షణాల్లోనే కాలి బూడిద అయ్యింది. డ్రైవర్ అప్రమత్తతో బస్సులోని ప్రయాణీకులంతా సేఫ్ గా బయటపడ్డారు.
రాత్రి సుమారు 12.15 నిమిషాల సమయంలో చిట్యాల మండలం వెలిమినేడు శివారులో జాతీయ రహదారి 65పై ఈ ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్కుట్ కారణంగా విహరి ప్రైవేట్ ట్రావెల్ బస్సు(NL 01 B 3250) పూర్తిగా దగ్దం అయ్యింది. ఇంజన్ లో మంటలు రావడంతో వెంటనే గమనించి డ్రైవర్ బస్సును పక్కకు ఆపాడు. వెంటనే ప్రయాణీకులను కిందికి దింపాడు. డ్రైవర్ అప్రమత్తతో బస్ లోని 29 మంది ప్రయాణికులు సేఫ్ గా బయటపడ్డారు. ప్రమాదానికి కొద్ది సేపటి ముందు చౌటుప్పల్ శివారులో బస్ ను టీ బ్రేక్ కోసం ఆపారు. అక్కడి నుంచి బయల్దేరిన 10 నిముషాల తర్వాత బస్ లో పొగలు రావడం మొదలు పెట్టడంతో వెంటనే డ్రైవర్ బస్సును ఆపాడు. ప్రయాణీకులంతా మెలకువతో ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణీకులు కిటీకీలు, వెనుక డోర్ నుంచి క్షణాల్లో బయటపడి ప్రాణాలు దక్కించుకున్నారు. బస్సు హైదరాబాద్ బీరంగూడ నుంచి నెల్లూరు జిల్లా కొండాపురానికి వెళ్తుండగా ఈ ఘటన జరింది.
ప్రయాణీకులంతా బయటకు వచ్చిన వెంటనే ఫైర్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించారు. స్పాట్ కు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బస్సులో మంటలు ఆర్పడానికి ఎలాంటి ఫైర్ సేఫ్టీ పరికాలు లేవని ప్రయాణీకులు చెప్పారు. డ్రైవర్ అప్రమత్త కారణంగానే తాము ప్రాణాలతో బయటపడినట్లు వెల్లడించారు. ఫిట్ నెస్ లేని వాహనాలను రోడ్ల మీద తిప్పడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నట్లు ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్న ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన తర్వాత బాధపడటం కంటే, ముందుగానే చర్యలు తీసుకోవడం వల్ల ప్రజల ప్రాణాలకు హాని జరగకుండా ఉంటుందన్నారు.
అటు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. నిబంధనలు పాటించనట్లు గుర్తిస్తే, తగిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అటు ప్రయాణీకులను మరో బస్సులో అక్కడి నుంచి నెల్లూరుకు పంపించేందుకు ట్రావెల్స్ బస్సు యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా బస్సు ప్రయాణాలు అంటేనే ప్రయాణీకులకు వణుకుపుట్టేలా చేస్తున్నాయి గత కొంత కాలంగా జరుగుతున్న వరుస ప్రమాదాలు.
Read Also: గత 5 ఏళ్లలో దేశంలో జరిగిన బాంబు పేలుళ్లు ఇవే, ఎంత మంది చనిపోయారంటే?