Shamshabad AirPort: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న ఇండిగో విమానానికి లేజర్ లైట్ తాకిడి తగిలింది. వీటి కారణంగా పైలట్ కాసేపు ఇబ్బందిపడ్డారు. ఆ తర్వాత విమానం సేఫ్ గా ల్యాండైంది. ల్యాండింగ్ చేసిన తర్వాత పైలెట్ ఏటిసి అధికారులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు రెండు ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ రావడంతో విమానాన్ని సిబ్బంది క్షుణ్నంగా తనిఖీ చేశారు.
ఇండిగో ఫ్లైట్‌కు లేజర్ లైట్ తాకిడి
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న ఇండిగో విమానానికి లేజర్ లైట్ తాకిడి క్రమంగా పెరుగుతోంది. ఆదివారం ఉదయం కోల్‌కతా నుంచి శంషాబాద్‌కు ఇండిగో విమానం వస్తోంది. అయితే శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఏడు మైళ్ల దూరంలో లేజర్ లైట్ పైలట్‌ని ఇబ్బందికి గురి చేసింది. చివరకు విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ అయ్యింది. ఆ తర్వాత పైలెట్ ఏటిసి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎయిర్‌పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు.
ఇటీవలకాలంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో లేజర్ లైట్ల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఒకప్పుడు చిన్నచిన్న గ్రామాలు ఉండడంతో లేజర్ లైట్లు ఉండేవికావు. దశాబ్దం కాలంగా ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్లో జనావాసాలు, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకున్నాయి. దీనికితోటు కన్వెన్షన్ల సంఖ్య అమాంతంగా పెరిగింది.
పైలట్ ఇబ్బందులు, ఆపై ఫిర్యాదు
ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో లేజర్ లైట్ల వినియోగంపై ఆంక్షలు ఉన్నాయి. ఐనప్పటికీ చాలామంది అవేమీ పట్టించుకోలేదు. పెళ్లిళ్లు, బర్త్ డే పార్టీల్లో లేజర్ లైట్ల వినియోగం పెరుగుతోంది. దాని ప్రభావం ల్యాండింగ్ అయ్యే విమాన పైలట్లపై పడుతుంది. ఫలితంగా విమాన ప్రమాదాలు ఆస్కారం ఉంటుందని అంటున్నారు. ఎయిర్‌పోర్టు పరిసరాల్లో లేజర్ లైట్ల వాడకంపై కీలక సూచనలు చేసింది డీజీసీఏ.
విమానాశ్రయానికి 10 కిలోమీటర్ల లోపు వివిధ జోన్లుగా విభజించింది. తొలి లేజర్ బీమ్ ఫ్రీ ఫ్లయిట్ జోన్. ఆ జోన్‌లో లేజర్ కాంతులు పూర్తిగా నిషేధం. రెండో జోన్ విషయానికి వద్దాం. లేజర్ బీమ్ క్రిటికల్ ఫ్లైట్ జోన్‌లో లేజర్ కాంతి ప్రసారం మేరకు నిబంధనలుంటాయి. ఇక మూడోది లేజర్ బీమ్ సెన్సిటివ్ ఫ్లైట్ జోన్‌గా గుర్తించారు.
ALSO READ: కర్రెగుట్టలో భారీ ఐఈడీ బాంబు గుర్తింపు
టేకాఫ్, ల్యాండింగ్ వేళ లేజర్ లైట్లతో పైలట్లు పడే కష్టాలు చాలానే ఉన్నాయి. ఈ కాంతి ద్వారా పైలట్లకు తాత్కాలిక దృశ్య లోపం ఏర్పడుతుంది. ఈ లైట్లు పైలట్ల పని తీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒక్క శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే కాదు.. దేశంలోని చాలా ఎయిర్ పోర్టుల్లో ఈ సమస్య వెంటాడుతోంది కూడా.
మరోవైపు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వస్తున్న రెండు ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ రావడం కలకలం రేపింది. జెడ్డా వస్తున్న ఓ విమానం, అలాగే కొచ్చి నుండి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వస్తున్న మరో విమానాంలో ఆర్‌డిఎక్స్ అమర్చినట్లు మెయిల్ సారాంశం. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు సిబ్బంది, శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానాలు ల్యాండింగ్ తర్వాత తనిఖీలు చేపట్టారు. చివరకు అదంతా ఒట్టిదేనని తేలిపోయింది.