Indiramma Housing Scheme: తెలంగాణ ప్రభుత్వం పేదవారి సొంతింటి కలను నెరవేర్చేందుకు ముందడుగు వేసింది. అయితే ఈ పథకం ద్వారా లబ్ది పొందడం ఎలా? అసలు ఇంటి నిర్మాణానికి ఎంత డబ్బు ప్రభుత్వం అందజేస్తుంది? ఎన్ని గృహాలు మంజూరు కానున్నాయనే విషయాలను తెలుసుకుందాం.
చెప్పిన మాట చెప్పినట్లుగా పాటించడం మా నైజం. ఇచ్చిన హామీ ఇచ్చినట్లుగా నెరవేర్చడమే మా ధ్యేయం. పేదవారి సొంతింటి కలను నెరవేరుస్తామని చెప్పాం. చేసి చూపించాం అంటూ ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సంధర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులను గుర్తించేందుకు ప్రభుత్వం యాప్ ను ప్రవేశపెట్టింది. ఆ యాప్ ఆధారంగా రాజకీయాలకు అతీతంగా లబ్దిదారులను గుర్తించాలన్నదే ప్రభుత్వ ధ్యేయం.
ఇక పథకం వివరాలలోకి వెళితే.. 2004 నుండి 2014 వరకు ఇందిరమ్మ పథకంలో భాగంగా 25 లక్షలకు పైగా గృహాల నిర్మాణం జరిగింది. మరలా 2014 నుండి 2014 వరకు బీఆర్ఎస్ పాలనలో కేవలం 65 వేల గృహాలు మాత్రమే నిర్మాణం పూర్తి చేసుకున్నట్లు అధికారిక లెక్క. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తమ 5 ఏళ్ల కాలవ్యవధిలో ఏకంగా 25 లక్షల గృహాలు మంజూరు చేయాలని సంకల్పించింది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఇళ్లు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు దరఖాస్తులను స్వీకరించింది.
ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల లబ్ది గురించి దరఖాస్తుదారులు ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా ప్రభుత్వం ఓ యాప్ ను ఏర్పాటు చేసింది. లబ్దిదారులు ఇంటి వద్ద ఉంటే చాలు.. అధికారులే మీ ఇంటికి వచ్చేస్తారు. రాజకీయ ప్రమేయం లేకుండా, అర్హత ఉంటే చాలు ఈ పథకంతో మీరు లబ్ది పొందవచ్చు. ఇందిరమ్మ మొబైల్ యాప్ ద్వారా మీ వివరాలను వెరిఫై చేసి, అర్హత ఉంటే మీ సొంతింటి కలను ప్రభుత్వం నెరవేర్చనుంది. అంటే అసలు మీకు ఇళ్లు ఉందా? ఇంటిలో ఎంత మంది సభ్యులు ఉంటున్నారో అధికారులు ముందుగా ధృవీకరిస్తారు.
మీరు ఈ పథకానికి అర్హత సాధిస్తే చాలు, ప్రభుత్వం తరపున మీకు రూ. 5 లక్షల సాయం అందుతుంది. పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని పెంచిందని చెప్పవచ్చు. ఈ యూనిట్ కాస్ట్ తో 400 చదరపు అడుగుల ఇంటి నిర్మాణం చేసుకొనే వీలుంది. మీకు ఇంటి ప్లాన్ అర్థం కాకున్నా, ఎలా నిర్మించుకోవాలో తెలియకున్నా మీరు డోంట్ వర్రీ. ఎందుకంటే ప్రభుత్వం అందుకు తగ్గ నమూనాలను కూడా తయారు చేసింది. మీరు ఇంకా డబ్బులు వెచ్చించి ఇంటిని నిర్మించుకోవాలని భావించినా, మీ ఇష్టా రీతిలో ఇంటిని మీరు నిర్మించుకోవచ్చు.
ప్రతి నియోజకవర్గంలో 3500 గృహాలను ప్రభుత్వం మంజూరు చేయాలని భావిస్తోంది. తొలిదశలో ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్ జెండర్స్, పేదలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే దశలో ప్రభుత్వం నిర్ణయించింది. మరెందుకు ఆలస్యం మీరు నిశ్చింతగా ఉండండి.. మీకు అర్హత ఉంటే చాలు.. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం మీకు రూ. 5 లక్షలు ఇంటి నిర్మాణానికి అందించనుంది. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు సుమా!