MLC Kavitha : రాజకీయం కలకలం రేపుతోంది. కల్వకుంట్ల కుటుంబంలో కుంపటి రాజుకుంది. కవిత రెబెల్ అయ్యారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు, పార్టీలో కోవర్టులు అంటూ కాక రేపారు. కేటీఆర్ సైతం తగ్గేదేలే అన్నారు. కోవర్టులు ఉంటే ఉండొచ్చని అంగీకరించారు. పార్టీ విషయాలు బయట మాట్లాడటం మంచిది కాదంటూ చెల్లికి చురకలు వేశారు. ఇటు కవిత, అటు కేటీఆర్.. ఇద్దరూ ఎవరి పేర్లూ బయటపెట్టకపోవడం ఆసక్తికరం. ఇంతకీ కారులోని దెయ్యం ఎవరు? ఆ కోవర్టు ఎవరు?
అంతా సంతోష్‌రావేనా..?
ఆ దెయ్యం కేసీఆర్ సన్నిహితుడు, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ రావునే అంటున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్‌రెడ్డి. సంతోష్ చెప్పినట్టే పార్టీ నడుస్తోందని చెప్పారు. కనీసం తండ్రితో కూడా మాట్లాడనీయకుండా కవితను అడ్డుకుంటున్నారని.. అందుకే ఆమె లేఖ రాయాల్సి వచ్చిందని అన్నారు. కేటీఆర్ చెప్పిన ప్రజాస్వామ్యం ఇదేనా? అని ప్రశ్నించారు సామ.
కవిత సస్పెన్షన్ తప్పదా?
త్వరలోనే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయబోతున్నారంటూ సామ బాంబు పేల్చారు. ఆ దెయ్యమే ఈ నిర్ణయం తీసుకోబోతున్నారని జోస్యం చెప్పారు. సంతోష్‌రావును పార్టీ అధ్యక్షుడిగా చేసినా ఆశ్చర్యపోనవసరం లేదంటూ కలకలం రేపారు. కవిత కొత్త పార్టీ పెట్టుకునే ఆలోచనలో ఉన్నారని.. ఆమెపై చర్యలు తీసుకుంటే కొత్త పార్టీ పెట్టడం ఖాయమని తేల్చి చెప్పారు. కల్వకుంట్ల కుటుంబంలో రాజకీయ అగ్గి మొదలైందన్నారు.
కేసీఆర్‌కు జయలలిత పరిస్థితి..?
వెన్నుపోటుదారులను పక్కన పెట్టుకున్నారని.. కేసీఆర్‌కు జయలలిత పరిస్థితే రావొచ్చని సామ రామ్మోహన్ అన్నారు. కేటీఆర్‌కు మతిమరుపు వచ్చిందని.. ఇప్పటికైనా తన పరువును తీసుకోవడం మానుకోవాలన్నారు. కల్వకుంట్ల కుటుంబ పరువు ఇప్పటికే బజారున పడిందని.. ఇప్పటికైనా శాంతియుతంగా మీ కుటుంబ సమస్యను పరిష్కరించుకోండని హితవు పలికారు సామ.
Also Read : ఈ కవిత పోతే ఈ కవిత? కేటీఆర్ మెసేజ్ ఇదేనా?
సంతోష్‌రావు అంత ఖతర్నాకా?
సంతోష్‌రావు మొదటినుంచీ కేసీఆర్‌కు అంతర్గత మనిషి. ఆయనకు మందులిచ్చేది ఈయనే అంటారు. ఎవరికి ఫోన్ చేయాలన్నా.. ఎవరి ఫోనైనా మాట్లాడాలన్నా.. సంతోష్‌రావునే డిసైడ్ చేస్తారని చెబుతారు. సీఎంగా ఉన్నప్పుడు ప్రగతి భవన్ మొత్తం సంతోష్ గుప్పిట్లో ఉండేదంటారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఎవరైనా ముందు సంతోష్‌కే ఫోన్ చేయాలి. ఆయన ఓకే చేస్తేనే కేసీఆర్ కాంటాక్ట్‌లోకి వస్తారు. తనకు చేసిన సేవలకు గుర్తింపుగా సంతోష్‌రావును ఎంపీగా ఎంపిక చేశారు గులాబీ బాస్. సంతోష్ చెట్లు నాటుతూ సొంత ఇమేజ్ సైతం పెంచుకునే ప్రయత్నం చేశారు. కేసీఆర్‌కు సంతోష్ లెఫ్ట్ హ్యాండ్ అంటారు. సంతోష్‌రావు గుప్పిట్లో కేసీఆర్ బంధీ అయ్యారని కూడా చెబుతారు. ఎప్పుడూ మీడియా ముందుకు రారు. ప్రజలకు ముఖం చూపించరు. కేసీఆర్ వెన్నంటి ఉండటం.. కిచెన్ కేబినెట్‌లా వ్యవహరించడమే అతని పని అంటారు. ధరణితో భూమల గోల్‌మాల్, వివాదాస్పద స్థలాల కబ్జా, నయీం ఆస్తులు, భూములు, డబ్బులు కొట్టేయడం.. ఇలా సంతోష్ రావుపై చాలానే రాజకీయ ఆరోపణలు ఉన్నాయి. కవితకు వరుసకు బ్రదర్. అలాంటి సంతోషే కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యమా? కోటరీనా? అనే అనుమానాన్ని బలపరిచేలా మాట్లాడారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి.